మాయమవుతున్న పోస్టులు.. ఉద్యోగాల ఖాళీలపై ఆయోమయం!!

by GSrikanth |   ( Updated:2022-09-04 05:05:58.0  )
మాయమవుతున్న పోస్టులు.. ఉద్యోగాల ఖాళీలపై ఆయోమయం!!
X

ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. గందరగోళం మాత్రం తప్పడం లేదు. ఖాళీల విషయంలో ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు పోస్టులకు పొంతన కుదరడం లేదు. విద్యాశాఖలో 20,964 పోస్టులు ఖాళీగా ఉన్నాయని గతంలో సర్కారు ప్రకటించింది. కానీ ప్రస్తుతం 11,170 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తేలింది. ఇదిలా ఉండగా ప్రభుత్వం ఒక వేళ రేషనలైజేషన్ ప్రక్రియ చేపడితే ఈ పోస్టుల్లో మరింత కోత పడే చాన్స్ ఉంది. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.


దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్యోగాల భర్తీ అంశంలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఆర్థిక శాఖ అనుమతి అంటూ జీవోలు ఇస్తున్నా.. నోటిఫికేషన్లు మాత్రం ఆలస్యమవుతున్నాయి. ఇక, అసలు కొన్ని శాఖల్లో ఇప్పటికీ ఖాళీలపై క్లారిటీ రావడం లేదు. "రాష్ట్రంలో 80 వేల ఉద్యోగాలు త్వరతగతిన భర్తీ చేస్తున్నాం" అంటూ సీఎం కేసీఆర్​ అసెంబ్లీ వేదికగా ప్రకటించి ఆరు నెలలు కావస్తోంది. కానీ, ఆశించిన స్థాయిలో నోటిఫికేషన్లు రావడం లేదని నిరుద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కనీసం కొన్ని డిపార్టుమెంట్ల నుంచి పోస్టుల జాబితానే ఇవ్వడం లేదు. ఇచ్చినా చాలా పోస్టులు కనిపించడం లేదు. కేసీఆర్​ప్రకటించిన జాబితాలో ఉన్న వేల పోస్టులు.. భర్తీ చేసే సమయానికి గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఇప్పటికే రెవెన్యూలో ఎన్ని పోస్టులు భర్తీ చేయాలనే దానిపై స్పష్టత రావడం లేదు. తాజాగా విద్యాశాఖలోనూ ఖాళీలు, భర్తీ ప్రకటనకు పొంతన లేకుండా పోయింది. కొన్ని విభాగాల నుంచి ఇప్పటికీ జాబితానే ఇవ్వడం లేదు.

ప్రకటించింది 20 వేలు.. ఇచ్చింది 11 వేలు

ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన వెంటనే విభాగాల వారీగా ఖాళీల సేకరణ, నోటిఫికేషన్లపై వేగవంతం చేస్తారని భావించినా.. ఒక్క అడుగు ముందుకేస్తే.. మూడడగులు వెనక్కి పడుతున్నాయి. తాజాగా విద్యాశాఖలో కొన్ని కీలక పోస్టుల మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటించినట్లుగా సెకండరీ ఎడ్యుకేషన్‌లో 13,086 పోస్టులు, హయ్యర్ ఎడ్యుకేషన్‌లో 7,878 పోస్టులు ఖాళీలున్నట్లు జాబితాలో చూపించారు. ఇవన్నీ డైరెక్ట్ రిక్రూట్ మెంట్ వెకెన్సీలుగా సీఎం వెల్లడించిన జాబితాలో స్పష్టం చేశారు. కానీ, ఈ శాఖల్లో ఇటీవల ఖాళీల జాబితా బయటకు వచ్చింది. సెకండరీ ఎడ్యుకేషన్‌లో పాఠశాల విద్యాశాఖ, మోడల్ స్కూల్, తెలంగాణ గురుకుల విద్యాలయాల సొసైటీ, పాఠ్యపుస్తక ముద్రణ, ఎన్సీఈఆర్డీ, గ్రంథాలయాలు వంటివి ఉంటాయి. 10,900 పోస్టులు పాఠశాల విద్యాశాఖలోనే ఉన్నట్లు అంచనా వేశారు. అదేవిధంగా టీచర్ పోస్టులు ఎస్జీటీ 6,360, స్కూల్ అసిస్టెంట్ 2179, ఎల్పీ 669, పీఈటీ 162, మోడల్ స్కూల్స్ 680, తెలంగాణ గురుకులాలు 93 వరకు ఉన్నాయి. ఇలా లెక్కలు తీసిన స్కూల్ ఎడ్యకేషన్‌లో మొత్తం ఖాళీలు 11,170 మాత్రమేనని తేల్చారు. ఇక హయ్యర్ ఎడ్యుకేషన్‌లో ఇంకా ఎన్ని పోస్టులు ఉన్నాయో అసలు లెక్కలే కనిపించడం లేదు. మరోవైపు రెవెన్యూ శాఖలో కూడా 3560 పోస్టులను ముందుగా ఖాళీ చూపించారు. ఇప్పుడు వీఆర్వోలను ఇతర శాఖలకు సర్దుబాటు చేశారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఖాళీలు పెరుగాల్సి ఉండగా.. ఇంకా తగ్గినట్లు తెలుస్తోంది. ఈ శాఖ నుంచి కూడా జాబితా రావడం లేదు.

క్రమబద్ధీకరణ చేస్తే..?

ప్రభుత్వం 11,103 మంది ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ప్రకటించటం తెలిసిందే. అందులో 44 శాతం మంది విద్యాశాఖ పరిధిలోనే ఉన్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 3,683 మంది, డిగ్రీ కళాశాలల్లో 811, పాలిటెక్నిక్‌లలో 443.. మొత్తం 4,937 మంది ఉన్నట్లు అధికారులు తేల్చారు. క్రమబద్ధీకరణ ఉద్యోగుల్లో సగం మంది విద్యాశాఖలోనే ఉన్నారని ఇటీవల విద్యామంత్రి సబిత కూడా ప్రకటించారు. ఇప్పుడు వీరందరినీ క్రమబద్ధీకరణ చేస్తే ఖాళీ పోస్టులపై ప్రభావం చూపిస్తుందా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. దీనిపై అటు అధికారులు సైతం క్లారిటీ ఇవ్వడం లేదు. దీనిలో భాగంగానే సెకండరీ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్‌లో పోస్టులు తగ్గుతున్నట్లు భావిస్తున్నారు.

రేషనలైజేషన్‌తో మరింత ముప్పు

టీచర్ల పోస్టుల భర్తీపై అనుమానాలు మొదలయ్యాయి. ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల రేషనలైజేషన్ ప్రక్రియను తెరపైకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దీంతో భర్తీ చేయాల్సిన ఉపాధ్యాయ పోస్టులపై ప్రభావం చూపించే అవకాశాలున్నాయి. రేషనలైజేషన్ ప్రక్రియను పూర్తి చేస్తే.. కొత్త ఖాళీల కంటే ఇంకా ఉన్న ఉపాధ్యాయులే మిగిలే పరిస్థితులున్నాయనే ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చూపించిన పోస్టులు కూడా మాయమమ్యే చాన్స్ ఉందని ఉపాధ్యాయవర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

అంతా అస్తవ్యస్థమే

కొన్ని విభాగాల నుంచి ఖాళీల జాబితా వస్తున్నా.. సారీ మళ్లీ పంపిస్తామంటూ కొత్తది తయారు చేయడంలో నిమగ్నమవుతున్నారు. దీంతో ఇప్పటి వరకు చాలా విభాగాల నుంచి జాబితా నియామక సంస్థలకు అందడం లేదు. ఇప్పటి వరకు మేజర్‌గా పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్​ విడుదలైంది. ఆ తర్వాత టీఎస్​పీఎస్సీ నుంచి శనివారం ఇంజినీరింగ్​పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​వచ్చింది. అంతకు ముందు గ్రూప్​–1 ఇచ్చారు. గ్రూప్​–4 ఎప్పుడిస్తారో తెలియకుండా పోతోంది. అడపాదడపా పది, ఇరవై, యాభై పోస్టులకు నోటిఫికేషన్​ఇస్తున్నా.. గంపగుత్తగా ఇచ్చే పోస్టుల కోసమే ఎదురుచూస్తున్నారు. అయితే, ఒకేసారి వేల పోస్టులకు నోటిఫికేషన్​ఇవ్వాలంటే ముందుగా ఖాళీల జాబితా అందాలి కదా అని నియామకసంస్థల అధికారులు చెప్తున్నారు.

Also Read : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: TSPSC నుంచి మరో నోటిఫికేషన్

Advertisement

Next Story