మట్టి అక్రమ రవాణాపై చర్యలేవీ?

by Rajesh |
మట్టి అక్రమ రవాణాపై చర్యలేవీ?
X

దిశ, సత్తుపల్లి: సత్తుపల్లి మండల పరిధిలోని కొమ్మేపల్లి, లింగపాలెం, కిష్టారం, రెవెన్యూ సరిహద్దు ప్రాంతం నుంచి కొందరు అక్రమార్కులు వందలాది ట్రిప్పుల మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. సింగరేణి పరిధిలోని కొమ్మేపల్లి, లింగపాలెంలోని వ్యవసాయ భూములకు సింగరేణి సంస్థ నుంచి కొంతమంది రైతులకు పరిహారం అందజేసి, మరి కొంతమందికి జాప్యం చేసింది.

దీంతో ఆ రెవెన్యూ పరిధిలోని స్థానిక రైతులకు మట్టి మాఫియా డబ్బులను ఆశగా చూపి ఎలాగో సింగరేణి పరిహారం మీకు అందుతుంది కదా అంటూ నమ్మించి అక్రమంగా తరలిస్తున్నారు. ప్రత్యేక రోడ్డు మార్గం ఏర్పాటు చేసుకొని రాత్రి, పగలు తేడా లేకుండా వందలాది ట్రిప్పుల మట్టి తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. మట్టి తరలింపుపై దిశ పలు కథనాలు ప్రచురించిన తర్వాత రెండు మూడు రోజులు నిలుపుదల చేసి మళ్లీ యథావిధిగా మట్టి తరలింపునకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తున్నది.

రెవెన్యూ, పోలీస్ అధికారుల అండ, స్థానికంగా ఉన్న ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లు వాడుకొని, తమకు ఆనాయకుడు తెలుసు... ఈనాయకుడు తెలుసు అంటూ మట్టిమాఫియా మభ్యపెడుతున్నట్లు తెలుస్తున్నది. అడ్డుకునే వారు ఎవరూ లేకపోవడంతో కోమ్మేపల్లి పరిధి నుంచి సింగరేణి జీఎం కార్యాలయం మీదుగా సత్తుపల్లి తహసీల్దార్ ఆఫీస్ ముందు నుంచి పదుల సంఖ్యలో మట్టి టిప్పర్లు తరలివెళ్తున్నాయి. ఈమట్టిని బేతుపల్లి, తాళ్లమడ రెవెన్యూ పరిధిలోని వ్యవసాయ భూమిలో ఏర్పాటు చేస్తున్న వెంచర్ కోసం తరలిస్తున్నట్లు తెలుస్తున్నది.

వందలాది లారీలతో వేలాది టిప్పులు మట్టి తరలిస్తున్నా రెవెన్యూ, పోలీస్ అధికారులు పట్టించుకోవడం లేదు. పదుల సంఖ్యలో టిప్పర్లు అధిక స్పీడ్‌తో వెళ్లుతూ గతంలో రెండు మూడు సార్లు సత్తుపల్లి పట్టణంలో ప్రమాదాలు జరిగాయి. మట్టిని తరలించే టిప్పర్లకు సరైన పత్రాలు, డ్రైవర్లకు లైసెన్స్ లేదని, ఆంధ్రా పర్మిట్‌తో తెలంగాణలో లారీలను నడుపుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మరోవైపు మట్టి మాఫియాతో పంటలు ధ్వంసం అవుతున్నాయని, తమ పంటలను కాపాడాలంటూ కొమ్మేపల్లి, లింగపాలెం పరిధిలోని రైతులు వేడుకుంటున్నారు. స్థానిక రెవెన్యూ, పోలీస్, మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకుని, కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed