సర్ధార్ పటేల్, మున్షీ వల్లే నిజాం పాలన అంతం: కేంద్రమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు

by Satheesh |
సర్ధార్ పటేల్, మున్షీ వల్లే నిజాం పాలన అంతం: కేంద్రమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ చరిత్రను 75 ఏళ్ల పాటు వక్రీకరిచారని.. తెలంగాణ విమోచన దినోత్సవం గురించి దేశ ప్రజలందరికీ తెలియాలని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. ఆదివారం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా అమిత్ షా హాజరు కాగా, కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అమిత్ షా మాట్లాడుతూ.. ‘తెలంగాణ సాయుధ పోరాట యోధులకు వందనాలు. రజాకార్ల అరాచకాలకు పరకాల సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవ వల్ల విమోచనం కలిగింది.

ఆపరేషన్ పోలో పేరిట నిజాం, రజాకార్ల మెడలు వంచారు. తెలంగాణ ముక్తి కోసం పోరాడిన నరసింహారావు, పండిట్ కేశవ్, ప్రభాకర్, బద్దం ఎల్లారెడ్డి, బూర్గుల రామకృష్ణ రావు తదితరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా వేడుకలు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చిన మోడీకి కృతజ్ఞతలు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే గతంలో ఉన్న ఏ ప్రభుత్వం విమోచన దినోత్సవం నిర్వహించలేదు, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదు’ అని ధ్వజమెత్తారు.

ఈ సందర్భంగా సాయుధ బలగాల కోసం 80 ఎకరాల స్థలంలో నిర్మించిన స్వశస్త్ర సీమా బల్ క్వార్టర్లను వర్చువల్‌గా అమిత్ షా ప్రారంభించారు. అలాగే షోయబుల్లా ఖాన్, రాంజీ గోండు పోస్టల్ కవర్ ఆవిష్కరించారు. మోడీ పుట్టినరోజు కానుకగా అమిత్ షా 173 మంది దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్ళు అందించారు. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు సందర్భంగా పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కాగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన అమిత్ షా ఇవాళ బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్‌తో సమావేశం కాబోతున్నారు. సీఆర్పీఎఫ్ సెక్టార్ మెస్ లో ఈ భేటీ జరగనుంది. బండి సంజయ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లేకుండానే ఈ సమావేశం జరుగనుందని సమాచారం.

Advertisement

Next Story

Most Viewed