పునరుద్ధరణతో కోనేరు కు ప్రపంచ స్థాయి గుర్తింపు

by Sridhar Babu |
పునరుద్ధరణతో కోనేరు కు ప్రపంచ స్థాయి గుర్తింపు
X

దిశ, భిక్కనూరు : పురాతన కాలం నాటి కోనేరు (పుష్కరిణి)ను పునరుద్ధరించడంతో ప్రపంచ స్థాయి గుర్తింపు లభించనుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. దక్షిణ కాశీ భిక్కనూరు సిద్ధరామేశ్వరాలయం వద్ద పరంపర ఫౌండేషన్ ఆధ్వర్యంలో పునరుద్ధరించిన కోనేరు వద్ద ఓం నమశ్శివాయ భరతనాట్యాన్ని ఆదివారం రాత్రి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం జరిగిన గుడి సంబరాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ కోనేరుకు ఈ ఖ్యాతి రావడానికి పరంపర ఫౌండేషన్ సహకారం ప్రధానమన్నారు.

కోనేరు పునరుద్ధరణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రాచీన ఆలయాలను మంచి గుర్తింపు తీసుకువచ్చి కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అలనాటి రాతి కట్టడాలను చెక్కుచెదరకుండా, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి యువ ఆర్కిటెక్చర్ల ను తెప్పించి యధావిధిగా నిర్మించడం వారి గొప్పతనమని ప్రశంసించారు. పురాతన బావులను దాతల సహకారంతో పునరుద్ధరించడంతో భావితరాలకు వాటి ప్రాముఖ్యత తెలుస్తుందన్నారు. ఇందుకు పరంపరం ఫౌండేషన్, కావూరి ఫ్యామిలీ, రెయిన్ వాటర్ స్వచ్ఛంద సంస్థ కల్పనా రమేష్ లు ముందుకు రావడం అభినందనీయమన్నారు.

అనంతరం జరిగిన భరతనాట్య కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులతో కలసి తిలకించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అధ్యక్షులు జాంగారి గాల్ రెడ్డి, సర్పంచ్ తునికి వేణు, ఆలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ అందె మహేందర్ రెడ్డి, ఆలయ పీఠాధిపతి సదాశివ మహంతు, ఎంపీడీఓ అనంతరావు, ఆలయ ఈఓ పద్మ శ్రీధర్, సచివాలయ కార్యదర్శి గంగాధర్, వైస్ ఎంపీపీ గుడిసె యాదగిరి, ఎంపీటీసీ సభ్యులు మద్ది చంద్రకాంత్ రెడ్డి, బండి రాములు చంద్రకళ, సరస్వతి సువర్ణ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

నాట్యాన్ని తిలకించేందుకు తరలివచ్చిన ప్రజలు....

పరంపర ఫౌండేషన్ సౌజన్యంతో శంకరానంద కళాక్షేత్రం ఆధ్వర్యంలో నిర్వహించిన భరతనాట్యాన్ని తిలకించేందుకు స్థానికులే కాకుండా జిల్లా రాష్ట్ర నలుమూలల నుంచి తరలిరావడంతో సిద్ధ రామేశ్వర ఆలయం ప్రాంగణం కిక్కిరిసిపోయింది. భరతనాట్యం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసులు ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశారు.

Advertisement

Next Story