ఆ పోస్టు ఖాళీ.. అదుపు తప్పిన లా అండ్ ఆర్డర్

by srinivas |
ఆ పోస్టు ఖాళీ.. అదుపు తప్పిన లా అండ్ ఆర్డర్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆరు నెలలు పైబడి కమిషనర్ లేకపోవడంతో శాంతిభద్రతలు గాడి తప్పాయనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కాలంలో కమిషనరేట్ పరిధిలో నేరాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇదంతా రెగ్యులర్ సీపీ లేకపోవడంతో జరుగుతుందని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. అదుపు తప్పిన లా అండ్ ఆర్డర్ ను ఇప్పటికైనా స్పందించి గాడిలో పెట్టకుంటే క్రైం రేట్ పరిస్థితి దారుణంగా పెరిగిపోయే ప్రమాదం ఉందని ఇటీవల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాకు చెందిన బొమ్మ మహేశ్ కుమార్ ‌గౌడ్ టీపీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్నాడని, జిల్లాలో సీనియర్ నాయకుడు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిల వంటి నాయకులున్నప్పటికీ పోలీస్ కమిషనరేట్ కు రెగ్యులర్ సీపీని తీసుకురాలేక పోతున్నారని ఎద్దేవా చేశారు. రెగ్యులర్ సీపీ పోస్ట్ నెలల తరబడి ఖాళీగా ఉండటంతో కమిషనరేట్ పరిధిలో నేరాలు బాగా పెరుగుతున్నాయని, అన్ని రకాల నేరాలు పెరిగి ప్రజా జీవితం ప్రమాదంలో పడిందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. త్వరగా సీపీ నియామకం జరిగితే తప్ప నేరాల నియంత్రణ జరిగేలా లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లా అండ్ ఆర్డర్, పోలీసింగ్ విషయంలో స్పష్టమైన తేడా కనిపిస్తోందన్నది సర్వత్రా వినిపిస్తున్న మాట. సీపీ కల్మేశ్వర్ సింగెనవార్ సీపీగా ఉన్నప్పుడు ఆయన బదిలీ తర్వాత అనే విధంగా నిజామాబాద్ జిల్లాలో శాంతి భద్రతలు తయారయ్యాయని, పోలీసుల్లో సీపీ లేని నిర్లక్ష్యం, లెక్కలేని తనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పోలీస్ స్టేషన్‌లో పెరిగిన సివిల్ పంచాయతీలు..

సీపీ కల్మేశ్వర్ బదిలీ జరగక ముందు వరకు పోలీస్ స్టేషన్లలో సివిల్ పంచాయతీలు పెట్టాలంటేనే ఎస్‌ఐలు , సీఐలు దడుసుకునే వారు. సివిల్ పంచాయతీలు డీల్ చేసే పోలీసుల పైన ప్రత్యేక నిఘా పెట్టి సీపీ కల్మేశ్వర్ వారిని కంట్రోల్‌లో ఉంచారు. పొలిటికల్ ఫైరవీలకు, ఆశ్రిత పక్షపాతానికి తావివ్వకుండా నిక్కచ్చిగా పోలీసింగ్ వ్యవస్థను సమర్థవంతంగా నడిచేలా చూశారు. సమస్యలతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన బాధితులకు సత్వర న్యాయం అందేలా చూశారు. ఎప్పటికప్పుడు స్టేషన్లలో పెండింగులో ఉన్న కేసుల గురించి తెలసుసుకుంటూ వాటిని క్లియర్ చేయించే విషయంలో వెంట పడే వారు. కింది స్థాయి సిబ్బంది సాధక బాధకాలు తెలుసుకుని వారి సమస్యలను పరిష్కరించే వారు. బదిలీల విషయంలో కూడా పొలిటికల్ జోక్యాన్ని సహించకుండా వ్యవహరించారు. పోలీసు అధికారుల బదిలీలను పొలిటికల్ ప్రెషర్స్‌తో అడ్డుకున్నా వాటిని తిప్పికొట్టి తన దమ్మేంటో ఎస్‌ఐ‌లకు, సీఐలకే కాకుండా పొలిటికల్ లీడర్లకు చూపించారు. పైకి కనిపించని సింగంలా సైలెంట్ గా తన పని తాను చేస్తూ కింది స్థాయి సిబ్బంది నుండి అన్ని స్థాయిల్లోని అధికారులను కంట్రోల్‌లో ఉంచడమే కాకుండా లా అండ్ ఆర్డర్ ను కూడా కంట్రోల్‌లో ఉంచారు. తీరా ఆయన బదిలీపై వెళ్లడంతో సీన్ అంతా రివర్స్ అయి నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో వ్యవస్థ అంతా గాడి తప్పి క్రైం రేట్ పెరిగిపోయింది. సివిల్ పంచాయతీలు, ఇసుక అక్రమ రవాణా, మొరం దందా, వైట్ కాలర్ మోసాలు వంటి వాటికి రెక్కలొచ్చాయనే అభిప్రాయాలు సాధారణ జనాల్లోనే కాదు పోలీసు శాఖలోని కింది స్థాయి సిబ్బందిలో కూడా మాట్లాడుకుంటున్నారు.

చైన్ స్నాచింగ్లకు అడ్డే లేదు..

జిల్లాలో ఇటీవలి కాలంలో చైన్ స్నాచింగ్ కేసులు పెచ్చుమీరాయి. ఈ నేరాలకు అడ్డే లేకుండా పోయింది. నేరాల నియంత్రణలో, నేరస్థుల గుర్తింపు, పట్టివేతలో కీలకంగా ఉపయోగపడే సీసీ కెమెరాల వ్యవస్థను కూడా పట్టించుకోకపోవడంతో అవి చాలా చోట్ల పనిచేయకుండా పోయాయి. దీంతో చైన్ స్నాచింగ్ కేసుల్లో నేరస్థుల కదలికలు, వారి గుర్తింపు పోలీసులకు కష్టంగా మారుతోంది. కొద్ది రోజులుగా నిజామాబాద్ నగరలోనే ఎక్కువగా చైన్ స్నాచింగ్ కేసులు నమోదవుతున్నాయి.

తాజాగా శనివారం కూడా నగరంలోని మూడో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ తెల్లవారుజామున నిద్రలేచి ఇంటి ముందు వాకిలి ఊడుస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆమె మెడలోంచి బంగారు గొలుసును లాక్కెళ్‌లి పోయారు. ఇలాంటి కేసులు నగరంలో గత రెండు నెలల్లో పలు చోట్ల జరిగాయి. కిరాణా షాపు నిర్వహిస్తున్న మహిళ మెడలోని గొలుసును కూడా కొద్ది రోజుల క్రితం లాక్కెళ్లిపోయిన సంఘటన జరిగింది. ఈ కేసు విచారణలో పోలీసులకు ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఎలాంటి క్లూ దొరకక పోవడం గమనార్హం. ఇలా ఎన్నో కేసులు నమోదవుతున్నాయి. మహిళలు బయట రోడ్డుపై నడిచి వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితులున్నాయి. వీటిని నియంత్రించే విషయంలో పోలీసులు వెనకబడి పోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కమిషనరేట్ పరిధిలో చైన్ స్నాచింగ్ కేసులు..

గతేడాది కమిషనరేట్ పరిధిలో చైన్ స్నాచర్లు రెచ్చిపోవడంతో జిల్లాలో 2024‌లో చైన్ స్నాచింగు కేసులు 37 నమోదయ్యాయని, 7 కేసుల్లో నిందితులను గుర్తించినట్లు కమిషనర్ కార్యాలయం విడుదల చేసిన వార్షిక క్రైం నివేదిక చెపుతోంది. గతేడాది ఈ కేసులు 40 కేసులు నమోదు కాగా, 18 కేసుల్లో నిందితులను ట్రేస్ చేయగలిగారు. ట్రేసింగ్ శాతం 2023లో 45 శాతంగా ఉంటే 2024లో కేవలం 18 శాతం మాత్రమే ఉంది. పలు నేరాల్లో సీపీ కల్మేశ్వర్ ఉన్నప్పుటికీ ఇప్పటికీ స్పష్టమైన తేడా కనిపిస్తోందనే అభిప్రాయాలు పోలీసు వర్గాల్లోనే వ్యక్తమవుతున్నాయి. శాంతి భద్రతలు ఆర్డర్‌లో ఉండాలన్నా, కమిషనరేట్ పరిధిలోని ప్రజలకు నేరరహిత వాతావరణాన్ని కల్పించాలన్నా, ప్రజలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉండాలన్నా పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉండాలి.. పోలీస్ వ్యవస్థ అంటేనే నేరగాళ్లకు ఒంట్లో వణుకు పుట్టాలి.. పోలీసు శాఖలో బీట్ కానిస్టేబుల్ స్థాయి నుంచి వివిధ స్టార్ల అధికారుల వరకు పోలీస్ బాస్ అంటే భయం భక్తి ఉండాలి.. ఇవన్నీ జరగాలంటే కమిషనరేట్ పరిధిలో ముందుగా పోలీస్ బాస్ (సీపీ) ఉండాలి. కమిషనరేట్ లో పోలీస్ కమిషనరే లేకుంటే ఆ వ్యవస్థ అంతా ఆగమాగమై లా అండ్ ఆర్డర్ గాడి తప్పుతోంది. ఇప్పుడు నిజామాబాద్‌లో పరిస్థితి ఇలాగే మారింది. ఆరునెలలకు పైబడి నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కమిషనర్ లేరు. ఆయన బదిలీ తరువాత ఇక్కడికి రెగ్యులర్ సీపీ నియామకం జరగకపోవడంతో ఇంచార్జి సీపీ‌గా కామారెడ్డి ఎస్పీ సింధూశర్మ వ్యవహరిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఇంచార్జి సీపీ నిజామాబాద్ పై దృష్టి కేంద్రీకరించకపోవడంతో ఇక్కడి పోలీసులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహారం నడుస్తోందని, నేరాల సంఖ్యకు అడ్డుకట్ట పడకపోగా, మరింతగా నేరాల సంఖ్య పెరుగుతోందని రికార్డులు చెపుతున్నాయి.

2023లో 819మంది మిస్సవ్వగా 733మందిని ట్రేస్ చేశారు. 86మంది ట్రేస్ చేయలేకపోయారు. 2024లో 984మంది మిస్సవ్వగా, 846 మందిని పోలీసులు ట్రేస్ చేశారు. ఇంకా 138మందిని ట్రేస్ చేయలేకపోయారు. తీన్ పత్తా, మట్కా కేసులు కూడా ఈ ఏడాదిలో బాగా పెరిగాయి. తీన్ పత్తా కేసులు గతేడాది 291కేసులు నమోదు కాగా, ఈ యేడు 518కేసులు నమోదయ్యాయి. మట్కా కేసులు గతేడాది 28 నమోదు కాగా, ఈ యేడాది 51 కేసులు నమోదయ్యాయి. వైట్ కాలర్ కేసులు గతేడాదితో పోల్చితే 82 కేసులు (27.89 శాతం) పెరిగాయి.

Advertisement

Next Story

Most Viewed