తస్మాత్ జాగ్రత.. ప్రైవేట్ ఆస్పత్రుల డెంగ్యూ ఉచ్చు..

by Indraja |
తస్మాత్ జాగ్రత.. ప్రైవేట్ ఆస్పత్రుల డెంగ్యూ ఉచ్చు..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో డెంగ్యూ వైరస్ ప్రైవేట్ ఆస్పత్రులకు కాసుల కురిపిస్తోంది. ప్రధానంగా ఫిజిషియన్‌‌లకు సీజన్‌లో వరంగా మారింది. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు వచ్చే జ్వరాలు డెంగ్యూ జ్వరం ఏమోనన్న అనుమానంతో ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు తీసే జనాలను కొందరు పీల్చి పిప్పి చేస్తున్నారు. డెంగ్యూ వైద్యానికి కూడా లక్షలు లాగుతున్నారు. ప్రధానంగా ప్రైవేట్ ఆసుపత్రులకు వచ్చే రోగులకు పరీక్షలు నిర్వహించి వారి డెంగ్యూ పాజిటివ్‌‌‌‌‌‌‌గా ప్లేట్‌లెట్ కౌంటింగ్ తగ్గిందని భయపెడుతున్నారు.

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం డెంగ్యూ పాజిటివ్ నిర్ధారించే పరికరం ఒక్క నిజామాబాద్ జనరల్ ఆస్పత్రి ఆవరణలోని టీహబ్‌కే అధికారం ఉంది. కానీ ప్రైవేట్ ఆస్పత్రులు తమ దోపిడీకి ప్రైవేట్ డయాగ్నోసిస్ సెంటర్లను, తమ వద్ద ఉండే పాథాలజిస్టులను,టెక్నిషియన్లను ఆసరాగా చేసుకుని డెంగ్యూపాజిటివ్ పేరిట వైద్యం చేస్తున్నారు.

జిల్లా కేంద్రంలోని ఆస్పత్రుల్లో వైరస్ జ్వరాలతో పాటు డెంగ్యూ వైద్యానికి వచ్చే వారితో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా వాతావరణ మార్పుల సమయంలో వైరల్ జ్వరాలు రావడం సాధారణం, కాగా వాటిని కూడా డెంగ్యూ పాజిటివ్‌లుగా చూపుతూ వైద్యం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

నిజామాబాద్ జిల్లాలో డెంగ్యూ వైరస్ కేసులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. గతంలో ఏడాదికి 300 కేసులు నమోదయ్యేవి. ఈ నెల 5 వరకు జనవరి నుంచి 134 డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదయినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా డెంగ్యూ కేసులు పాజిటివ్ రావడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. ముఖ్యంగా డెంగ్యూ వైరస్ కేసులు ఎడిసా అనే దోమకాటు వల్ల సంబంధిత వైరస్ సోకుతుంది.

అయితే ప్రస్తుతం జిల్లాలో ముఖ్యంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మొదలుకుని మిగితా మూడు మున్సిపాలిటీల్లోని అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. మలేరియా నది పరివాహక ప్రాంతాల్లో కేసులు బహిర్గతమౌతుంటే డెంగ్యూ మాత్రం పట్టణ ప్రాంతంలో ప్రధానంగా పరిశుభ్రత లేని ప్రాంతంలోనే దోమలు తమ లార్వాల ద్వారా సంతానం ఉత్పత్తిని పెంచుకుంటున్నాయి.

ముఖ్యంగా ఇళ్ళ సమీపంలోని చెత్త చెదారంతో పాటు ఇంటి ఆవరణలో నీటి నిలువ కేంద్రాలే వాటి ఆవాసాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి.

నిజామాబాద్ జిల్లా కేంద్రం మెడికల్ హబ్ అని చెప్పాలి. జిల్లా కేంద్రంలో కొందరు వైద్యులు సొంత ప్రాక్టిస్ చేస్తుండగా మరికొంత మంది ప్రైవేట్ వ్యక్తులే డాక్టర్లను అద్దెకు మాట్లాడుకుని వైద్య సేవలందిస్తున్నారు. ప్రధానంగా మల్టీ స్పెషాలిటీ, ఆన్ కాల్ వైద్య మంతా పరస్పర సహకార పద్దతిలో కొనసాగుతుంది. జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో పని చేసే కొందరు ఇతర ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేసే మరికొందరు డెంగ్యూ వైద్య స్పెషాలిస్టుగా ఫీవర్ స్పెషలిస్టుగా చెప్పుకుని వైద్యం చేస్తున్నారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం డెంగ్యూ వైరస్‌ను గుర్తించే ఎలిసా టెస్టు కేవలం జీజీహెచ్‌లోనే టి హబ్‌లో ఉండగా అందుకు విరుద్దంగా ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్న వైద్యులు సాధారణ జ్వరాలను కూడా వైరల్ జ్వరాలుగానే చెబుతూ వైద్యం చేస్తూ నిండా ముంచుతున్నారు. నిజామాబాద్ జనరల్ ఆసుపత్రిలో డెంగ్యూ వైరస్‌కు వైద్య సేవలకు కావాల్సిన వైద్యులు, ప్లేట్ లెట్స్ అందుబాటులో ఉన్నప్పటికీ వైద్యులు తమ సొంత దవాఖానాలకు రోగులను తరలించి వారిని పిండేస్తున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అందే వైద్య సేవలను కాదని మిడిమిడి వైద్య సేవలు చేస్తూ, కొందరు ల్యాబ్ టెక్నిషియన్ ఇచ్చే రిపోర్టుల ఆధారంగా ప్లేట్ లెట్స్ తగ్గిపోతున్నాయని ఎమర్జెన్సీ వైద్యం చేయాలంటూ అడ్మిషన్స్ తీసుకుని వేల రూపాయలు లాగుతున్నారు. కేవలం డెంగ్యూ జ్వారానికి ఇన్ పేషెంట్‌గా ఉంటే ప్లేట్ లెట్స్ ఎక్కిస్తే మాత్రం రూ.50 వేల నుంచి లక్ష వరకు లాగుతున్నారు. ప్రతీ సీజన్ లో జరిగే దోపిడి ఈసారి అడ్వాన్స్‌గా తెర లేపినట్లయింది.

ఆందోళన చెందవద్దు.. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి తుకారాం రాథోడ్

జిల్లాలో ఈ సీజన్ లో అత్యధికంగా డెంగ్యూ వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం నమోదు కాలేదు. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమై మున్సిపల్అధికారులతో సమన్వయం చేస్తూ పరిసరాల పరిశుభ్రత అవగాహన కార్యక్రమంతో పాటు ప్రజలకు వైద్య ఆరోగ్య శాఖ తరపున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. డివిజన్‌కు ఆరు టీంల ద్వారా నిరంతర పర్యవేక్షణ జరుగుతుంది.

డెంగ్యూ వైరస్‌ను గుర్తించే కిట్‌లు కేవలం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణలోని టి హబ్‌లో మాత్రమే ఉంది. అక్కడ పాజిటివ్ అని వస్తేనే సంబంధిత వైద్యానికి వైద్యం చేయించుకోవాలి. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే ఈ విషయంలో డయాగ్నోసిస్ సెంటర్లకు , ప్రైవేట్ ఆస్పత్రులకు సర్క్యూలర్ జారీ చేశాం.

Advertisement

Next Story

Most Viewed