- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దళారుల చేతిలో నిలువుదోపిడీకి గురవుతున్న పసుపు రైతులు..
పసుపు రైతులకు వ్యాపారులు, దళారులు విశ్వరూపం చూపిస్తున్నారు. ఉత్తర తెలంగాణలో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ గా పేరుగాంచిన నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. మొన్నటి వరకు ధరలు లేవని ఇబ్బందులు పడుతున్న రైతులకు ఇటీవల కాలంలో ధర రూ.5 వేలు పైచిలుకు దాటిందని సంతోషపడుతుంటే అది కేవలం నోటీసు బోర్డులకే పరిమితమవుతోంది. నోటీసు బోర్డులో గరిష్ట, కనిష్ట ధరల్లో రైతులు నిలువునా మోసపోతున్నారు. ఖరీదు దారులు, కమీషన్ ఏజెంట్లు కుమ్మక్కయి వారికి నచ్చిన ధరనే చెల్లిస్తున్నారు. తేమ శాతం తక్కువగా ఉందని చెబితే కాడి, గోళ రకాలకు వేర్వేరుగా ధర నిర్ణయించి కొనుగోలు చేస్తున్నారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో ఈ-నామ్ ద్వారా కొనుగోళ్లు జరుగుతాయని, రైతులు మోసపోయే అవకాశం లేదని అధికారులు చెబుతుంటే వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కు ప్రతీ ఏటా లక్షల క్వింటాళ్ల పసుపు వస్తుంది. నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, కోరుట్ల, మెట్పల్లి ప్రాంతాల నుంచి ఏటా వచ్చే పసుపు ద్వారా మార్కెట్ కమిటీకి ఆదాయం వస్తుంది. అయితే రైతులకు మద్దతు ధర దక్కపోగా, నిలువు దోపిడీకి గురవుతున్నారు. సోమవారం నిజామా బాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో గరిష్ఠ పసుపు ధర రూ.7200 కాగా, కనిష్ఠంగా రూ.4500గా కాడికి నిర్ణయించారు. గోళ రకానికి రూ.6119, కనిష్ఠంగా రూ.4050 ధర పలికింది ఉంది. రైతుల కు వచ్చేసరికి కనిష్ఠంగా కోత వెయ్యి వరకు వస్తోం దని వారు లబోదిబోమంటున్నారు. దుంపకుళ్ళు తెగుళ్లతో పాటు ఇటీవల వడగళ్ల వర్షానికి చాలా ప్రాంతాల్లో పసుపు పచ్చిగా అయింది. ఇదే అదునుగా మార్కెట్ యార్డులో ఖరీదు దారులు, కమీషన్ ఏజెంట్లు రైతులను దోచుకుంటున్నారు. గత ఏడాది మార్కెట్ లో ధర లేని సమయంలో క్వింటాళ్ల కొద్దీ కొనుగోలు చేసి గిడ్డంగుల్లో, కోల్డ్ స్టోరేజీల్లో భద్రపరచుకున్న వ్యాపారులు, ఈసారి కూడా అదే సూత్రాన్ని అమలు చేస్తున్నారు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు లక్ష క్వింటాళ్ల పసుపు మార్కెట్ కు వచ్చిందని అధికారులు చెబుతున్నారు.
మరో రెండు నెలల పాటు పసుపు రాక ఎక్కువగా ఉండనుంది. గరిష్ఠ ధర చూసి మార్కెట్ కు పసుపు తెచ్చిన వ్యాపారులు మాయ చేస్తున్నారు. అధికారుల అలసత్వాన్ని అలుసుగా తీసుకుని క్వింటాళ్ల కొనుగోలుపై రూ.500 నుంచి రూ.1000 వరకు గండి కొడుతున్నారు. అసలే మార్కెట్లో ధర లేదని లబోదిబోమంటున్న రైతులు అకాల వర్షంతో పాటు పసుపు నిల్వ చేసే స్థలం లేక ఏదో ఒక ధరకు విక్రయిస్తున్నారు. గతంలో మాదిరిగా ఇక్కడ పసుపును సాంగ్లీ తీసుకెళ్లలేని పరిస్థితి ఉంది. మహారాష్ట్రలో ఈసారి పసుపు దిగుబడి ఎక్కువ కావడంతో అక్కడ డిమాండ్ తగ్గింది. దీంతో అక్కడ వచ్చే ధర రవాణా ఖర్చులకే సరిపోతుందని రైతులు తప్పని పరిస్థితుల్లో ఇక్కడే విక్రయిద్దామనుకుంటే ఖరీదు దారులు, కమీషన్ ఏజెంట్లు చేతుల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నారు. మార్కెట్ కమిటీ అధికారులు చెబుతున్న ధరలు పక్కాగా అమలవుతున్నాయా? వ్యాపారులు ఎంత చెల్లిస్తున్నారనేది పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. నోటీసు బోర్డులో పెట్టిన ధరకు రైతులకు ఇస్తున్న ధరకు వ్యత్యాసం ఉందని రైతులు గగ్గోలు పెడుతున్నారు.