రుణాలు ఇప్పిస్తానంటూ టోకరా

by Sridhar Babu |
రుణాలు ఇప్పిస్తానంటూ టోకరా
X

దిశ, కామారెడ్డి : తాను కలెక్టర్ ఆఫీసులో పనిచేస్తానని, తనకు అధికారులంతా పరిచయం ఉన్నారని, నీకు రుణం ఇప్పిస్తానంటూ చెప్పి టోకరా కొట్టించిన ఉదాంతం ఇది. కామారెడ్డి సీఐ చంద్రశేఖర్ రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి పట్టణంలోని పెద్ద బజారుకు చెందిన మంగలి రాములు అనే వ్యక్తిని పెద్దోళ్ల విజయ్ కుమార్ అలియాస్ జై కుమార్ అనే వ్యక్తి తాను బిక్నూర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా పరిచయం చేసుకొని, కలెక్టర్ ఆఫీస్ ఎస్సీ కార్పొరేషన్ సెక్షన్లో పనిచేస్తున్నానని, చాలామందికి దళిత బంధు, డబుల్ బెడ్ రూములు, బీసీ బంధు ఇప్పించినట్లుగా మంగలి రాములుతో పరిచయం పెంచుకున్నాడు. దాంతో నిందితుడు ఆరు నెలలుగా రాములు నుండి

అప్పుడప్పుడు 39 వేల రూపాయలు తీసుకున్నాడు. ఒక డబుల్ బెడ్ రూమ్, బీసీ బంధు ఇప్పిస్తానని చెప్పాడని, ఆ తర్వాత ఎన్ని సార్లు అడిగినా కూడా ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో పో అని బెదిరించాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు నిందితుని ఫోన్ నెంబర్ ఆధారంగా విచారణ చేయగా గుర్రపు పెద్దోళ్ల విజయ్ కుమార్ అలియాస్ జై కుమార్ అనే వ్యక్తి కలెక్టర్ ఆఫీసులో ఎక్కడా పనిచేయడం లేదని, కేవలం డబ్బుల గురించి అమాయకున్ని మోసం చేసినట్టుగా ఒప్పుకున్నాడన్నారు. ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినట్లుగా చెప్పాడని, ప్రజలందరూ మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని, అలాగే ఎవరైనా మోసపూరిత మాటలు మాట్లాడి మోసం చేస్తే ముందుగానే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి కోరారు.

Advertisement

Next Story