పోక్సో కేసులో నేరవిచారణలో లోపాలు ఉండరాదు.. ప్రధాన న్యాయమూర్తి

by Sumithra |
పోక్సో కేసులో నేరవిచారణలో లోపాలు ఉండరాదు.. ప్రధాన న్యాయమూర్తి
X

దిశ, నిజామాబాద్ క్రైం : పిల్లలపై జరిగిన లైంగిక వేధింపులు, దాడుల కేసులలో నేరవిచారణ ప్రణాళికబద్ధంగా నిర్వహించాలని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. జిల్లాకోర్టు ప్రాంగణంలోని న్యాయసేవ సదన్ లో డైరెక్టర్ అఫ్ ప్రాసిక్యూషన్ నిర్వహిచిన సదస్సులో ఆమె పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ను ఉద్దేశించి ప్రసంగించారు. అభం శుభం తెలియని పిల్లల వయసు, మానసిక పరిస్థితి, సామాజిక స్థితిని పరిగణలోకి తీసుకుని వారి స్టేట్ మెంట్ ను మహిళ విచారణ అధికారులు రికార్డు చేయాలని సూచించారు. నేరవిచారణ నిర్వహించే సమయాలలో నేరం జరిగిన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని పేర్కొన్నారు. నేరస్థలాన్ని పరిశీలించే సందర్భంలో నేరం జరిగిన తీరు, స్థలం, సమయం ఒక క్రమపద్ధతిలో నమోదు చేసుకోవాలని ఆమె వివరించారు. పిల్లల స్టేట్ మెంటుతో పాటు వారి తల్లిదండ్రులు, ప్రత్యక్ష సాక్షుల స్టేట్ మెంట్స్ కీలకమని, స్టేట్ మెంట్స్ ను చాలా జాగ్రత్తగా నమోదు చేయాలని ఉద్భోదించారు.

నేరం జరిగిన తరువాత ఫిర్యాదు స్వీకరించిన వెంటనే నమోదు చేసి ప్రాథమిక విచారణ నివేదిక నుండి నేరవిచారణ పూర్తిచేసుకున్న తర్వాత కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేసే వరకు అనుసరించాల్సి విధివిధానాలు జిల్లాజడ్జి సునీత తెలిపారు. సాక్ష్యాలు సేకరించే క్రమంలో నిర్లక్ష్యానికి తావివ్వరాదని తెలిపారు. నిజామాబాద్ అదనపు జిల్లాజడ్జి కనకదుర్గ ప్రసంగిస్తూ పిల్లల వాంగ్మూలాలు వారి భాషలోనే నమోదు చేయాలని అన్నారు. నేరవిచారణ పోలీసు అధికారులు తమ స్వంత భాషను పిల్లల పై ప్రయోగించారాదని తెలిపారు. లైంగిక వేధింపులు, దాడులు అనే పదప్రయోగాలు జాగ్రత్తగా వాడుకుని బాధితుల, ఇతర సాక్షుల వాంగ్మూలాలో నిక్షిప్తం చేయాలని అన్నారు. సదస్సులో జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి, జూనియర్ సివిల్ జడ్జిలు కుష్భు, గోపికృష్ణ, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ లక్ష్మీ నర్సయ్య, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మహ్మద్ రహిమోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed