నేడు నిస్వార్థ రాజకీయ నాయకులు లేరు...అందుకే నేనొస్తున్నా

by Sridhar Babu |   ( Updated:2024-04-14 10:37:32.0  )
నేడు నిస్వార్థ రాజకీయ నాయకులు లేరు...అందుకే నేనొస్తున్నా
X

దిశ, కామారెడ్డి క్రైమ్ : నేడు నిస్వార్థ రాజకీయ నాయకులు లేరని, రాజకీయాల్లోకి కోట్ల రూపాయలు కూడగట్టేందుకే వస్తున్నారని, అందుకే ఎంపీగా పోటీ చేస్తా అని కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుడిమెట్ మహాదేవుని ఆలయ పీఠాధిపతి మహాదేవ్ స్వామీజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిస్వార్ధ రాజకీయాలు కనపడటం లేదన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ధర్మ సంస్థాపన కోసం ఇప్పటిదాకా ప్రజల్లో ఉన్నానని, ఇకపై ధర్మ పాలన కోసం రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నానన్నారు.

ప్రభుత్వాలు మారుతున్నా ఇక్కడ అభివృద్ధి జరగడం లేదన్నారు. ప్రజల సంక్షేమం కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. డా. బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం పేదల జీవితాల్లో వెలుగులు నిండాయా.. అట్టడుగు పేదవాళ్లు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో పోటీ సమయంలో ఎంపీ, ఎమ్మెల్యేలు చూపించే ఆస్తులు తర్వాత కూడబెట్టిన ఆస్తులపై విచారణ జరగాలని, నాయకులను శిక్షించే చట్టం తేవాలని కోరారు.

ఆస్తులు కూడబెట్టి అప్పులు చూపిస్తున్నారని, వీటిపై ప్రజల్లో మార్పు రావాలన్నారు. ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం సకాలంలో అందాలని, నిరుద్యోగం రూపు మాపాలని, జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో రైల్వే లైన్లు రావాలన్నారు. ధర్మ పాలన కోసం వస్తున్న తనకు ప్రజల నుంచి ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నానన్నారు. ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు, ప్రజల్లో మార్పు తేవడం కోసం, నిస్వార్థ సేవలు చేయడానికి వస్తున్న తనకు అండగా నిలవాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed