హాస్టల్​లో కనీస సౌకర్యాలు లేవు

by Sridhar Babu |
హాస్టల్​లో కనీస సౌకర్యాలు లేవు
X

దిశ, నిజామాబాద్ సిటీ : హాస్టల్​లో కనీస సౌకర్యాలు లేవని విద్యార్థులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ నగరంలోని నాందేవ్ వాడ పరిధిలో గల 36వ డివిజన్ లో గిరిజన కళాశాల వసతి గృహాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఆకస్మిక తనిఖీ చేయడంతో ఈమేరకు వివరించారు. హాస్టల్​లో మధ్యాహ్న భోజనం, మంచినీరు, బాత్రూమ్, మౌలిక సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వసతి గృహంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు మాట్లాడుతూ హాస్టల్​లో కనీసం మౌలిక సౌకర్యాలు లేవని,

భోజనం సరిగా ఉండటం లేదని, రోజూ ఒకే కూరతో తింటున్నాం అని, మొఖాలు కడుక్కోవడానికి కూడా నీళ్లు లేవని, 120 మందికి ఒక చిన్న వాటర్ ట్యాంక్ ఉందని విద్యార్థులు తెలిపారు. మున్సిపల్ వాటర్ రాక నానా ఇబ్బందులు పడుతున్నాం అని, బాత్రూంలలో భరించలేని వాసనా వస్తుందని వివరించారు. ఎమ్మెల్యే వెంటనే గిరిజన వెల్ఫేర్ ఆఫీసర్ తో ఫోన్ లో మాట్లాడుతూ హాస్టల్లో కనీస మౌలిక సౌకర్యాలు లేవని, విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని, బాత్రూమ్ లు ఆధ్వానంగా ఉన్నాయని, స్నానాలకు నీటి కొరత లేకుండా వారం రోజుల్లోగా చూడాలని ఆదేశించారు. లేకుంటే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. త్వరలో ఈ సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మాస్టర్ శంకర్, సుదీర్, ప్రవళిక, బీజేపీ నాయకులు ప్రభాకర్, పవన్ పాల్గొన్నారు.

Advertisement

Next Story