పార్కింగ్ చేసిన వాహనాలే వారి టార్గెట్

by Sridhar Babu |
పార్కింగ్ చేసిన వాహనాలే వారి  టార్గెట్
X

దిశ, భిక్కనూరు : రాత్రి పొద్దు పోయాక హైవే పక్కన పార్కు చేసి ఉంచిన వాహనాలే టార్గెట్ గా లారీల్లో చొరబడి దొంగతనాలకు పాల్పడుతున్న సంఘటనలు నాలుగైదు రోజులుగా ఏదో ఒక చోట వెలుగు చూస్తున్నాయి. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్ 44వ జాతీయ రహదారి మొదలుకొని, జంగంపల్లి గ్రామ శివారులోని ఆర్టీఏ చెక్ పోస్ట్ సమీపంలోని హైవే వరకు ప్రతినిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. సుదూర ప్రాంతాల నుంచి డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చి రాత్రి బాగా పొద్దు పోవడం,అలసిపోవడం వలన నిద్ర మత్తు ఆవహిస్తుండడంతో చాలామంది డ్రైవర్లు పెట్రోల్ బంకులు, హోటళ్లు, ట్రక్ లే బైల వద్ద పార్కు చేసి పడుకోవడంతోపాటు, మరికొందరు డ్రైవర్లు హైవే పక్కన పార్కింగ్ చేసి నిద్రకు ఉపక్రమిస్తారు.

ఇదే అదనుగా భావించిన కొందరు దుండగులు గత నాలుగైదు రోజులుగా హోటళ్లు, పెట్రోల్ బంకుల వద్ద, అర్ధరాత్రి రెక్కి నిర్వహించి దొంగతనానికి పాల్పడుతున్నారు. లారీ డ్రైవర్లు క్యాబిన్ డోర్లను లాక్ చేసుకుని వేసవి కాలం కావడంతో క్యాబిన్ వెనకాల పడుకుంటుండగా, మరికొందరు లోపల పడుకుంటారు. అయితే వేకువ జామున పార్కు చేసి ఉంచిన వాహనాల వద్దకు చేరుకొని తమ వద్ద ఉన్న వస్తువులతో క్యాబిన్ గ్లాస్ కు ఉన్న బీడింగ్ ను తొలగించి లోనికి ప్రవేశిస్తారు. డ్రైవర్ పై మత్తుమందు చల్లి ఏ మార్చి అతని వద్ద ఉన్న నగదును, సెల్ ఫోన్ తో పాటు విలువైన వస్తువులను అపహరించు కు పోతున్నారు. తాజాగా శనివారం వేకువ జామున పెట్రోల్ బంక్ వద్ద వాహనాన్ని పార్కు చేసి ఉంచి డ్రైవర్ నిద్రకు ఉపక్రమించగా గుర్తు తెలియని దుండగుడు వచ్చి క్యాబిన్ లో

చొరబడే ప్రయత్నం చేయగా డ్రైవర్ కు మెలకువ వచ్చి అరుపులు కేకలు పెడుతూ బెదిరించడంతో పారిపోయాడు. దీంతో భయపడిపోయిన డ్రైవర్ ఎదురుగా ఉన్న దాబా వద్దకు చేరుకొని అందులో పని చేసే సిబ్బందికి దొంగతనం కాకుండా వాహనం వైపు చూడాలని కోరాడు. సదర్ డ్రైవర్ వేకువ జామున నాలుగు గంటలకు వచ్చి క్యాబిన్ లో నిద్ర ఉపక్రమించగా మళ్లీ దొంగతనం చేసేందుకు యత్నించగా సడన్ గా మెలుకువ వచ్చి అరవడంతో తప్పించుకొని పారిపోయాడు. ఈ విధంగా నాలుగు రోజులుగా పార్కింగ్ చేసి ఉంచిన వాహనాలలో నుంచి వరుసగా దొంగతనాలు జరుగుతుండడంతో వాహన డ్రైవర్లు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

చోరీలకు పాల్పడుతుంది ఎక్స్ పర్ట్ లా లేక స్థానికులా...

వాహన క్యాబిన్లలో చొరబడి దొంగతనాలకు పాల్పడుతున్నది... ఎక్స్ పర్ట్ ముఠానా.. లేక జల్సాల కోసం స్థానికులే ఈ చోరీలకు పాల్పడుతున్నారా...? అనే అనుమానాల ను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఎక్స్ పర్ట్ లయితేనే గ్లాస్ బీడింగ్ ను చాకచక్యంగా తొలగించి క్యాబిన్ లోకి ప్రవేశించి మత్తుమందుతో ఏమార్చి ఈ చోరీలకు పాల్పడుతున్నారని, జల్సాల కోసం చోరీలకు పాల్పడే వారైతే ఈ విధంగా చోరీలు చేసేందుకు సాహసించరన్న వాదనను మరి కొంతమంది వాహనదారులు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed