ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ సొత్తు నగరాభివృద్ధికే ఖర్చు చేయాలి

by Sridhar Babu |
ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ సొత్తు నగరాభివృద్ధికే ఖర్చు చేయాలి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ మున్సిపల్ రెవెన్యూ అధికారి ఇంట్లో ఏసీబీ దాడుల్లో స్వాధీనం చేసుకున్న అక్రమ ఆస్తులను, నగదును నిజామాబాద్ నగర అభివృద్ధికి ఖర్చు చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ గుప్త అన్నారు. శనివారం ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారిందని తాను గతంలోనే పలు మార్లు చెప్పినట్లు గుర్తు చేశారు. దాసరి నరేందర్ ఇంట్లో శుక్రవారం జరిగిన ఏసీబీ దాడుల్లో రూ. 6 కోట్ల పైచిలుకు అక్రమాస్తులు పట్టుబడటం ఇందుకు నిదర్శనమని అన్నారు. పెద్దమొత్తంలో బంగారు ఆభరణాలు, విలువైన ఆస్తుల దస్తావేజులే సజీవ సాక్ష్యాలన్నారు.

మున్సిపల్ కార్పొరేషన్ లో అవినీతి తిమింగలాలు ఇంకా ఉన్నాయని, ఏసీబీ అధికారులు వాటి పైన కూడా దృష్టి పెట్టాలని కోరారు. కార్పొరేషన్ లో అవినీతి ప్రక్షాళన ఇంకా జరగాల్సిన అవసరముందన్నారు. అవినీతి అధికారులున్నంత కాలం సామాన్యులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందని ద్రాక్షలా మిగిలిపోతాయాన్నారు. జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ లు అధికారులపైన, ఆయా శాఖల పైన ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలన్నారు. ప్రజలకు న్యాయబద్ధమైన పాలనను అందించాలని ఆయన అన్నారు. ఇందూర్ నగర ప్రజల నుండి దోచుకున్న ప్రతి పైసా కూడా ఇందూర్ నగర అభివృద్ధికే ఖర్చుపెట్టాలని, ఆ సొమ్ముపై ఇందూర్ నగర ప్రజలకే హక్కు ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. ఏసీబీ అధికారులు రికవరీ చేసిన అక్రమ ఆస్తులు తిరిగి మున్సిపల్ కార్పొరేషన్ ఖాతాలో జమచేయాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed