- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రయాణం.. నరకప్రాయం
దిశ, కామారెడ్డి : 'ప్రభుత్వాలు మారుతున్నాయి.. పాలకులు మారుతున్నారు. మా బ్రతుకులు మాత్రం మారడం లేదు. డ్రైనేజీలు బాగు చేయాలని మొరపెట్టుకుంటున్నా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు. ఇదేం వ్యవస్థ..? ఇంత అధ్వానంగా, నిర్లక్ష్యంగా ఉంటారా..? ఏళ్ల తరబడి సమస్య పరిష్కారానికి నోచుకోకపోతే ఎలా' కామారెడ్డి పట్టణ ప్రజల నుంచి వస్తున్న మాటలివి. కామారెడ్డి పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వర్షాకాలం వస్తే నీళ్లు ఎక్కడ ఇళ్లలోకి వచ్చి చేరతాయోనని ఆందోళన చెందుతూ గడపాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు సుమారు గంటన్నర పాటు కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. పట్టణంలోని ప్రధాన రోడ్లన్నీ జలమయం అయ్యాయి.
ఇళ్లలోకి నీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా నిజాంసాగర్ చౌరస్తా నుంచి జీవధాన్ వెళ్లే దారిలో లయోల స్కూల్ చౌరస్తా వద్ద విద్యానగర్ కాలనీ నుంచి వచ్చిన డ్రైనేజీ నీటితో రోడ్డు మొత్తం నిండిపోయి చెరువును తలపించింది. ప్రధాన రహదారి కావడంతో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. లయోల స్కూల్ చౌరస్తా ప్రాంతంలోనే నీరు ఎక్కువగా నిలవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఒకవైపు నీటి ఫ్లో ఎక్కువగా ఉండటంతో రోడ్డుపై ఉన్న పోలీస్ బూత్ స్టాండ్ ను పోలీసులు రోడ్డుకు అడ్డుగా వేసి ఒకవైపు నుంచే దారిని మళ్లించారు. ఈ క్రమంలో నీటి ఫ్లో ఎక్కువ ఉన్న రోడ్డు వైపు నుంచి వచ్చే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
ద్విచక్ర వాహనాలపై వెళ్లే వాహనదారులు బైకులను తోసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మోకాలి వరకు నీటిలో ఓ స్కూటిపై వస్తున్న ముగ్గురు మహిళలు స్కూటీ ముందుకు సాగక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్య ఇప్పుడు ఉన్నది కాదు. ఏళ్ల తరబడి ఇదే సమస్య పునరావృతం అవుతున్నా మున్సిపల్ అధికారులు పరిష్కారానికి శాశ్వత మార్గం చూపడం లేదన్న విమర్శలు ఎప్పటినుంచో వస్తున్నాయి. వర్షాకాలం వచ్చే ముందే పక్కా ప్రణాళికతో పరిష్కారానికి మార్గం చూపాల్సిన అధికారులు దానిపై దృష్టి పెట్టడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ పాలకవర్గం ప్రత్యేక దృష్టి పెట్టి రహదారులపై నీరు నిల్వకుండా ఉండటంతో పాటు డ్రైనేజీ నీళ్లు ఇళ్లలోకి చేరకుండా శాశ్వత పరిష్కారం మార్గం చూపాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
గంటన్నర పాటు భారీ వర్షం
కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం మొదలైన వర్షం ఏకధాటిగా సాయంత్రం వరకు కురిసింది. గత కొద్దిరోజులుగా వర్షం కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు ఈ వర్షంతో సంతోషాన్నిచ్చింది. పట్టణంలో కురిసిన వర్షానికి మాత్రం పట్టణ ప్రజలతో పాటు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షానికి చెరువులు కుంటలలో భారీగా నీరు చేరుకుంటుంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.