ఆసుపత్రిలో చేర్పించిన కూతురు..మళ్ళీ రాలేదు..ఓ తల్లి ఆవేదన

by Naveena |
ఆసుపత్రిలో చేర్పించిన కూతురు..మళ్ళీ రాలేదు..ఓ తల్లి ఆవేదన
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ నవంబర్ 21: అడ్డాలనాడు బిడ్డలు కాని.. గడ్డాల నాడా? అని పెద్దలు ఊరికే అనలేదు..నవమాసాలు కడుపులో మోసి, కని పెంచి పెద్దచేసిన బిడ్డలు..పెద్దయ్యాక కన్నవారిని పట్టించుకోకుండా గాలికొదిలేస్తున్నారు. ముదిమి వయసులో శరీరం సహకరించక ఒంట్లో సత్తువ లేక నానా అవస్థలు పడుతుంటే, వారి బాగోగులు చూసే దిక్కు కూడా లేకుండా ఎందరో అనాధలుగా మిగిలిపోతున్నారు. కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలం కొత్తపల్లికి చెందిన గీకూరి సాయవ్వకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు కాగా..ఒక కొడుకు చనిపోయాడు. కోడళ్లు ఓ కుటుంబమే ఉంది. ఆమె ప్రమాదవశాత్తు కింద పడటంతో చేయి విరిగింది. చికిత్స కోసం ఆమెను కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. ఆస్పత్రిలో చేర్చిన తరువాత ఆమె చచ్చిందో బతికుందో కూడా చూసేందుకు ఆమె కొడుకులు, కోడళ్లు రాలేదు. దీంతో ఆమె బాగోగులు హాస్పిటల్ లోని వైద్యులు, సిబ్బంది మాత్రమే చూసుకుంటున్నారు.

కన్న తల్లి తిరిగి కోలుకుని ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వచ్చే వరకు ఆస్పత్రిలో ఉంటూ..సేవలు చేయాల్సిన కన్న కూతురు ఆస్పత్రిలో చేర్పించడంతో తన బాధ్యత తీరిపోయిందన్నట్లుగా తల్లి బాధ్యతను ఆస్పత్రి సిబ్బందిపై వదిలేసి వెళ్లిపోయింది. కనీసం సాయవ్య కొడుకు, కోడలైనా పట్టించుకుంటారంటే వారు కనీసం ఆస్పత్రి వైపు అడుగే పెట్టలేదని తెలుస్తోంది. ఈనెల18 నుంచి ఇప్పటి వరకు సాయవ్వ కొడుకు,కోడలు కానీ, ఆస్పత్రిలో చేర్చి వెళ్లిపోయిన కూతురు కానీ, ఎవరు రాకపోవడంతో ఆస్పత్రి సిబ్బందే ఆమెను చూసుకుంటున్నారు.

సాయవ్వకూతురుకు ఫోన్ చేసినా స్పందించడం లేదని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. ఆస్పత్రి వైద్య సిబ్బంది, కానిస్టేబుల్ లక్ష్మణ్ రావు వృద్ధురాలికి సేవలు చేస్తున్నారు. కడుపున పుట్టిన కన్న కొడుకు,కూతురు ఇతర కుటుంబ సభ్యులందరూ ఉన్నా..అనాధలా ప్రభుత్వాసుపత్రిలో పడి ఉన్న సాయవ్వ గురించి తెలిసిన వారు అయ్యో పాపం.. అంటూ బాధగా స్పందిస్తున్నారు. ఇలాంటి సంతానం ఉంటే ఏందీ ..లేకపోతే ఏందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారి కడుపున పుట్టిన వారు ముసలి వయసులో వారి పట్ల అదే రీతిలో వ్యవహరిస్తే అప్పుడు ఆ తల్లి ఆవేదన అర్ధమవుతుందని, దేవుడు ఎవరిని ఎప్పుడెలా శిక్షించాలో శిక్షిస్తాడని నిట్టూరుస్తున్నారు. సాయవ్వను అనాధగా వదిలేసిన ఆమె కొడుకు,కోడలు, కూతుళ్లపై పోలీసులు చర్యలు తీసుకోవాలని జనం కోరుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed