కన్న బిడ్డ పట్టించుకోలేదు.. తోబుట్టువులు గాలికొదిలేశారు

by Naveena |
కన్న బిడ్డ పట్టించుకోలేదు.. తోబుట్టువులు గాలికొదిలేశారు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ మార్చి 21: ఎలాంటి రక్త సంబంధం లేని వాళ్లే అభాగ్యులను ఆత్మీయంగా చేరదీసి మానవత్వాన్ని ప్రదర్శిస్తుంటే, అయిన వాళ్లూ, అందునా రక్తం పంచుకు పుట్టిన వాళ్లూ, తోబుట్టువులు, కన్న బిడ్డలే కాదనుకుంటున్నారు. ఆశ్రమంలో వదిలేస్తామని నమ్మబలికి అనాధలా రోడ్డుపై తీసుకొచ్చి పడేస్తున్నారు. చేతులు దులుపుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా శుక్రవారం నిజామాబాద్ నగరంలో ఇలాంటి అమానవీయ ఘటనే వెలుగు చూసింది..

చలికి గజగజ వణుకుతూ.. దైన్య స్థితిలో..

రాత్రి కురిసిన వర్షానికి పూర్తిగా తడిసి చలికి గజ గజ వణుకుతూ ఓ వృద్ధుడు శుక్రవారం నగరంలోని ఉదయం పాత కలెక్టరేట్ ఆవరణలో ఉన్న ఆలయ పరిసరాల్లో పేరుకు పోయిన చెత్తప్రదేశంలో కనిపించాడు. స్థానికులు ఆయన పరిస్థితిని చూసి దగ్గరకు వెళ్లి వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. పూర్తిగా లేవలేని, నడవలేని స్థితిలో ఉన్న ఆ వృద్ధుడు పక్షవాతం బారిన పడి తీవ్ర అనారోగ్యం పాలైనట్లు గుర్తించారు. సరిగా మాట్లాడే స్థితిలో కూడా లేని ఆ వ్యక్తి తన గురించి పలు విషయాలు వెల్లడించారు. ఆయన వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి..

నిజామాబాద్ నగరంలోని యెల్లమ్మ గుట్టకు చెందిన హుల్లయ్య అనే 1979 లో ఆర్టీసీలో కండక్టర్ గా చేరానని, 2014 లో రిటైరయ్యానని హుల్లయ్య తెలిపారు. ఆయనకు ముగ్గురు పిల్లలు.. ఇద్దరు ఆడపిల్లలు కాగా, ఒక కొడుకు. కొడుకు మానసిక స్థితి సరిగా లేకపోవడంతో పాటు అనారోగ్య కారణాలతో చనిపోయారు. చిన్నకూతురు కూడా మానసిక స్థితి సరిగా లేదని తెలిసింది. పెద్ద కూతురు బాగానే ఉంది. తను హైదరాబాద్ లోని సుచిత్ర ఏరియాలో తన కుటుంబంతో పాటు ఉంటున్నారు. నాలుగేళ్ల క్రితం 2021 లో హుల్లయ్య భార్య అనారోగ్యంతో చనిపోయింది. ఆ తరువాత హుల్లయ్య పక్షవాతానికి గురయ్యాడు. అప్పటి నుండి ఆయనకు దరిద్రం పట్టుకుంది. తన పనులు తాను చేసుకోలేనంతగా అనారోగ్యానికి గురవడంతో ఆయనకు సేవలు చేయడాన్ని కూతురు భారంగా భావించింది. ఆమె తండ్రి బాధ్యతను వదిలేసింది. అన్నదమ్ములు కూడా ఆయన భారాన్ని పీడగా భావించారు. వదిలించుకుందామనుకున్నారు. అనాద శరణాలయంలో సేవలు చేసే వారుంటారు. నీకెలాంటి ఇబ్బంది ఉండదని అన్నదమ్ములు హుల్లయ్యను నమ్మించారు. అనాధ శరణాలయంలో వదిలేస్తామని చెప్పి నాలుగు రోజుల క్రితం ఆటోలో తీసుకొచ్చి ఇక్కడ తనను వదిలేసారని, అప్పటి నుండి ఇక్కడే ఉన్నానని బాధతో హుల్లయ్య చెపుతుండటం పలువురిని కంట తడిపెట్టించింది.

నిజామాబాద్ ఇందూరు యువత గుర్తుకొచ్చింది..

హుల్లయ్య లాంటి అనాధలకు ఆపన్న హస్తం అందించే విషయంలో ఇందూరు యువత స్వచ్ఛంద సంస్థ ముందుంటుందన్న విషయం తెలిసిన నగరవాసుల్లో కొందరు వారికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో ఇందూరు యువత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు సామాజిక సేవికుడు సాయిబాబు ఆధ్వర్యంలో.. వారి టీం అక్కడికి వచ్చింది. మల మూత్రాలతో తడిసిపోయి దుర్గంధంలో ఉన్న ఆ వృద్ధుడికి శుభ్రంగా కడిగి స్నానం చేయించారు. ఆయన పరిస్థితిని చూసి అధికారులకు సమాచారం అందించింది. ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగా లేనందున హుల్లయ్యను అంబులెన్సులో మెరుగైన వైద్యం కోసం జీజీహెచ్ హాస్పిటల్ కు తరలించారు. హుల్లయ్య కోలుకునే వరకు ఆయన బాగోగులు సఖీ కేంద్రం వారు చూసుకుంటున్నట్లు తెలిసింది.

Next Story