- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పంచాయతీ ఎన్నికలపై కొనసాగుతున్న సస్పెన్స్

దిశ, కామారెడ్డి : రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. గత ప్రభుత్వం చేసిన అప్పులకు ప్రతినెలా వడ్డీలు కట్టడానికే కోట్లాది రూపాయలు చెల్లించాల్సి వస్తుందని ఓ వైపు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. మరోవైపు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు వస్తే పోటీ చేద్దామని ఆశించిన వారికి నిరాశే మిగులుతుంది. గత సర్పంచులకు ఒక్కొక్కరికి దాదాపుగా 20 నుంచి 50 లక్షల వరకు బిల్లులు పెండింగ్ లోనే ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో ప్రస్తుతం లక్షలు ఖర్చు చేసి పోటీ చేయడానికి అభ్యర్థులు వెనుకంజ వేస్తున్నారన్న టాక్ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది. ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికల్లో పోటీకి ముందుకు వస్తారా.. లేక వెనుకంజ వేస్తారా అనే సందిగ్ధం నెలకొంది.
ఇదిగో.. అదిగో అంటూ ఊరిస్తున్న పంచాయతీ ఎన్నికలు...
పంచాయతీల్లో పాలన ముగిసిన 13 నెలలు పూర్తవుతున్నా ఇప్పటికీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడం తో పోటీలో ఉంటామని ఆశలు పెట్టుకున్న ఆశావహులు ఆలస్యం అవుతుండడం, ప్రస్తుత పరిస్థితులను బట్టి కాస్త వెనుకంజ వేస్తున్నట్టుగా అర్థమవుతుంది. అంతేకాకుండా గతంలో పనిచేసిన సర్పంచులు ఆయా గ్రామాల్లో చేసిన పనులకు ఇప్పటివరకు బిల్లులు రాకపోవడంతో అప్పుల పాలై ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు. దీనికి తోడు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఖజానా ఖాళీగా ఉండటంతో రానున్న నూతన పంచాయతీ పాలకవర్గాలకు కూడా నిధులు వచ్చే పరిస్థితి లేకపోవడంతో పోటీకి వెనుకంజ వేయడానికి ఇదో కారణంగా కూడా అనుకుంటున్నారు. లక్షలాది రూపాయలు వెచ్చించి పోటీ చేసి తీరా గెలిచాక ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే తమ పరిస్థితి ఏంటి..? అని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఒక్కో సర్పంచ్ సుమారు 20 లక్షల నుంచి కోటి రూపాయల వరకు పనులు చేసి బిల్లుల కోసం కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నారు. బిల్లుల కోసం అధికారులను, ప్రజాప్రతినిధులను అడిగితే ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉందని, ప్రస్తుతం బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదని ముఖం ముందే చెబుతుండడంతో మాజీ సర్పంచులు ఆందోళన చెందుతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని రానున్న పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి చాలామంది వెనకడుగు వేస్తున్నట్లుగా తెలుస్తోంది.
గ్రామాల్లో పడకేసిన పాలన...
గ్రామ పంచాయతీల్లో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజల దరికి చేర్చడంలో ముందుండే సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు లేకపోవడంతో గ్రామాల్లో పాలన పడకేసింది. ప్రజలు ఏదైనా తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలంటే స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధుల అవసరం చాలా ఉంటుంది. అయితే వార్డు సభ్యుల నుంచి మొదలుకొని జడ్పీ చైర్మన్ వరకు కూడా ఎవరు ప్రజాప్రతినిధులు లేకపోవడంతో వారు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పట్టించుకునే వారే లేరని ఆవేదన..
పంచాయతీ ఎన్నికల్లో పోటీ విషయం పక్కన పెడితే అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు క్యాడర్ కు దూరంగా ఉంటున్నారని కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర వేదనకు గురవుతున్నారన్న ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో ఓటమి పాలైనా బీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీని విడిచి వెళ్ళలేదు. అయినా వారిని ఏకతాటిపైకి తెచ్చి దూరం కాకుండా చేసుకోవడంలో ముఖ్య నాయకులు విఫలమవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీలో కూడా ఇదే పరిస్థితి ఉందని, బయటకు చెప్పుకోలేని స్థితిలో ఉన్నామని కిందిస్థాయి క్యాడర్ చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో ధైర్యంగా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి ఉందన్న భావన కిందిస్థాయి క్యాడర్ లో ఉందన్న ప్రచారం సాగుతోంది.
అభివృద్ధికి నిధులు వచ్చేనా...
ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఖజానా ఖాళీగా ఉండటంతో రానున్న పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన ప్పటికీ గ్రామాల అభివృద్ధికి నిధులు వస్తాయో... రావో.. అనే సందిగ్ధంలో ఆశావాహులు ఉన్నారు. పోటీ చేసి గెలుపొందాక తీరా ప్రభుత్వం నుంచి నిధులు రాకపోతే ప్రజల వద్ద తమ పరిస్థితి ఏమిటని చర్చించుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితులే ప్రభుత్వం వద్ద ఉంటే నిధులు వస్తాయనే గ్యారెంటీ లేదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.