డిపాజిటర్ల నెత్తిపైన ఎన్సీడీసీ అప్పులు..

by Sumithra |
డిపాజిటర్ల నెత్తిపైన ఎన్సీడీసీ అప్పులు..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రాష్ట్రంలోనే సంచలనం రేపిన తాళ్లరాంపూర్ సొసైటీ డిపాజిట్ల గోల్ మాల్, దారిమళ్లింపు వ్యవహరం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. గత రెండు సంవత్సరాలుగా తమ అవసరాల కోసం సొసైటీలో డిపాజిట్ చేసిన రైతులకు అసలు సొమ్ము వస్తుందా లేదా అన్న సంశయానికి తెరపడలేదు. రాష్ట్ర ప్రభుత్వం తాళ్లరాంపూర్ సొసైటీలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ కమిటీలు వేసి బాధ్యులను గుర్తించిన ఇప్పటి వరకు ఒక్కరిపై చర్య తీసుకున్న దాఖలాలు లేవు.

పోని రైతులు చేసిన డిపాజిట్ తాలుకు సొమ్మును తిరిగి ఇప్పించేందుకు ఆస్తులు వేలం వేసి ఇవ్వాలని నిర్ణయించిన అందులో రైతుల తలపైన సొసైటీ టోపి పెట్టింది. సోమవారం నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ సొసైటీ మహాజన సభ సమావేశం తీరు రైతులను అయోమయానికి గురి చేసింది. దాని అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మహాసభకు జిల్లా సహకార అధికారి సింహాచలం హాజరయ్యారు.

తాళ్లరాంపూర్ సొసైటీ సంబంధించిన రైతులు చేసిన డిపాజిట్లను చెల్లించాలని ప్రభుత్వ నిర్ణయం మేరకు ఆస్తుల వేలం జరిగిన విషయం తెల్సిందే. సొసైటీకి సంబంధించిన రైసుమిల్లును 2 కోట్ల 5 లక్షలకు, గుమ్మిర్యాల్ క్యాష్ కౌంటర్ ను రూ.61 లక్షలకు, తాళ్లరాంపూర్ ఓపెన్ ల్యాండ్ ను 1 కోటి లక్షా 50 వేలకు వేలం వేసి అమ్మిన విషయం తెల్సిందే. తాళ్లరాంపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సుమారు 400 మంది రైతులు లక్ష రూపాయల డిపాజిట్ ను చేసిన విషయం తెల్సిందే. గత రెండు రోజుల క్రితం సొసైటీలో వెలుగు చూసిన డిపాజిట్ సొమ్ము దారి మళ్లింపు వ్యవహరం నేపథ్యంలో ప్రభుత్వం ఆస్తుల వేలం వేసి ఇవ్వాలని తెలుపడంతో రైతులు తమ సొత్తు తిరిగి వస్తుందని ఆశపడ్డారు.

కానీ సోమవారం జరిగిన మహాజన సభలో ఆస్తులు అమ్మగా వచ్చిన డబ్బులను ఎన్సీడీసీకి చెల్లించాలని తీర్మాణం చేసి రైతులతోనే సంతకాలు చేయించారు. ఎన్సీడీసీకి రూ.5 కోట్ల వరకు అప్పులు ఉండడంతో ప్రస్తుతం ఆస్తులు అమ్మగా వచ్చిన సొమ్ము దానికే సరిపోనుంది. మరి రైతులకు మిగిలిన సొమ్ము ఇద్దామా అంటే ప్రస్తుతానికి ఓ ఫంక్షన్ హాల్ మాత్రమే మిగిలి ఉంది. దానిని అమ్మిన తర్వాత ఇద్దామంటే అది ఏ మూలకు సరిపోతుందో లేదోనని రైతులు సంశయం వ్యక్తం చేస్తున్నారు. మార్చి చివరి వారం వరకు రైతులకు డిపాజిట్లను చెల్లిస్తామని సమావేశం తీర్మాణం చేయగా వారం పది రోజుల్లో రైస్ మిల్ అమ్మకం పూర్తవుతుందా అనేది అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

డిపాజిట్ దారులకు 8 శాతం వడ్డి ఇస్తామని ఆశ చూపిన సొసైటీ తీరా తిరిగి చెల్లింపుల సమయానికి ఆర్బీఐ నిబంధనల ప్రకారం 6.10 శాతం మాత్రమే చెల్లిస్తామని చెప్పడం వారికి 2 శాతం వడ్డికోత తప్పేలా లేదు. గతంలో ఏర్గట్ల బ్రాంచ్ లో జరిగిన గోల్ మాల్ వ్యవహరంలో ఫిక్స్ డ్ డిపాజిట్ సొమ్మును రూ.50 లక్షలు డ్రా చేసి నిధులను గల్లంతు చేసిన విషయం తెల్సిందే. రూ.50 లక్షల బాండ్ పోయిందని చెప్పి నిధులను కాజేసిన వ్యవహరంలో అప్పటి బ్రాంచ్ మేనేజర్ ను సస్పెండ్ చేసిన విషయం విధితమే.

అసలు ప్రాథమిక సహకార సంఘం బాధ్యులపై ఇప్పటి వరకు రెవెన్యూ రికవరి యాక్టు అమలు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యులైన వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని చెబుతుండగా సంబంధిత స్టే ఆర్డర్ ఎందుకు చూపలేదని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులే కోట్ల రూపాయల నిధుల గల్లంతు వ్యవహరంలో బాధ్యులుగా ఉండడంతో చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తున్నారని అపవాదును ఇంకా సొసైటీ మూటగట్టుకుంది. ఆస్తుల వేలంతోనైనా రైతులు డిపాజిట్లు దక్కుతాయంటే ముందుగా ఎన్సీడీసీ అప్పులను తీర్చాలని తీర్మాణం చేయడంతో రైస్ మిల్ అమ్మకంపైనే వారి డిపాజిట్ల రాక ఆధారపడి ఉంది.

Advertisement

Next Story

Most Viewed