ఎస్సీ వర్గీకరణ అంశంపై ఏకసభ్య కమిషన్ బహిరంగ విచారణ

by Aamani |
ఎస్సీ వర్గీకరణ అంశంపై ఏకసభ్య కమిషన్ బహిరంగ విచారణ
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : షెడ్యూల్డ్ కులాల్లో ఉపవర్గీకరణపై వివరణాత్మక అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వంచే నియమించబడిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ తో కూడిన ఏకసభ్య కమిషన్ గురువారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో బహిరంగ విచారణ నిర్వహించారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందిన షెడ్యూల్డ్ కులాల ప్రజాప్రతినిధులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వైద్యులు, న్యాయవాదులు, షెడ్యూల్డు కుల సంఘాల నాయకులు, వివిధ వర్గాల వారి నుంచి వినతులు స్వీకరించి, వర్గీకరణపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. మాలలు, మాదిగలు, జంగములు, చిందులు, బేడ బుడగ జంగములు, బైండ్ల, మంగులతో పాటు వివిధ వర్గాల ప్రతినిధులు హాజరై తమ అభిప్రాయాలను తెలియ పరుస్తూ విజ్ఞాపనలు అందజేశారు.

బుడగ జంగాలు, బైండ్ల, చిందులు తదితరులు తాము కొనసాగుతున్న వృత్తులు బహిర్గతం అయ్యేలా, సంప్రదాయ వేషధారణతో తరలివచ్చి కమిషన్ కు తమ స్థితిగతులను తెలియజేశారు. సామాజిక-ఆర్థిక వెనుకబాటు కారణంగా విద్య, ఉద్యోగాలు తదితర రంగాలలో ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ప్రస్తావిస్తూ పలువురు వర్గీకరణ ఆవశ్యకతను నొక్కి చెప్పగా, వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని, వర్గీకరణ పేరుతో ఎస్సీలను విభజించడం సబబు కాదని మరికొందరు కమిషన్ కు తమ అభిప్రాయాలను వెల్లడించారు. బహిరంగ విచారణ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ నేతృత్వంలో జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. అభిప్రాయాలు వెల్లడించేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించారు.

ఈ సందర్భంగా ఏకసభ్య కమిషన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ అంశంపై అన్ని వర్గాల వారి అభిప్రాయాలను తెలుసుకుని, క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేసిందన్నారు. ఈ మేరకు కమిషన్ ఇప్పటివరకు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాను కలుపుకొని 9 జిల్లాలలో తన పర్యటనను పూర్తి చేసుకుందని, అందరి అభిప్రాయాలను సేకరించామని తెలిపారు. వర్గీకరణ అంశం తో పాటు సామాజిక స్థితిగతులకు సంబంధించి షెడ్యూల్డ్ కులాలకు చెందిన అన్ని వర్గాల వారు ఎలాంటి ఒత్తిడి లేకుండా నిర్భయంగా కమిషన్ కు తమ అభిప్రాయాలను వెల్లడించవచ్చని జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ సూచించారు.

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అన్ని ఉమ్మడి జిల్లాలలో పర్యటించి, అందరి అభిప్రాయాలను సేకరించిన మీదట ప్రభుత్వానికి కమిషన్ సమగ్ర నివేదిక సమర్పిస్తుందని తెలిపారు. అంతకుముందు ఏకసభ్య కమిషన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ ను రోడ్లు-భవనాల శాఖ అతిథి గృహం వద్ద కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనీ కలెక్టర్ సంకేత్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల డీఎస్సీడీఓ లు నిర్మల, రజిత తదితరులు స్వాగతం పలికారు. ఏకసభ్య కమిషన్ డాక్టర్ షమీమ్ అక్తర్ వెంట రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ అదనపు సంచాలకులు శ్రీధర్, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed