సేవాలాల్‌ మహారాజ్‌ జయంతిని సెలవుగా ప్రకటించాలి

by Sridhar Babu |
సేవాలాల్‌ మహారాజ్‌ జయంతిని సెలవుగా ప్రకటించాలి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : మహారాజ్‌ను ఎప్పుడు కలిసినా తండ్రిలా ఆశీర్వాదం ఇచ్చేవారని, సేవాలాల్‌ మహారాజ్‌ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ ధర్మపురి అన్నారు. శనివారం నగరశివారులోని బోర్గాం(పి)లో గల మోటాటిరెడ్డి కళ్యాణమండపంలో అర్వింద్‌ ధర్మపురి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాకు 100 రామారావు మహారాజ్‌ విగ్రహాలను ఎంపీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రామారావు మహారాజ్‌ జీవితాంతం సమాజ సేవతోపాటు సనాతన ధర్మ సేవ చేసుకున్నారని గుర్తుచేశారు. 12 ఏళ్లపాటు మౌనవ్రతం పాటించి దైవానుగ్రహం, దైవ శక్తిని పొందారన్నారు. దేశంలో ప్రతి తండాకు తిరిగి గిరిజనులకు ఆయన చేసిన సేవ మాటల్లో వర్ణించలేనిదని తెలిపారు. లంబాడీలు అనేకమంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు,

డాక్టర్లు, ఇంజనీర్లు, విద్యా, వ్యాపారాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. రామారావు మహారాజ్‌ విగ్రహాలు వితరణ చేయడం పూర్వజన్మ సుకృతమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి దేవుడు ఇచ్చిన అనుగ్రహమని రామారావు మహారాజ్‌ చెప్పినట్లు ఎంపీ గుర్తుచేసుకున్నారు. మహారాజ్‌ను ఎప్పుడు కలిసినా తండ్రిలా ఆశీర్వాదం ఇచ్చేవారని, సేవాలాల్‌ మహారాజ్‌ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని పార్లమెంట్‌లో మాట్లాడానన్నారు. రామారావు మహారాజ్‌ ఆశీర్వాదంతోనే ఎంపీనయ్యాయని పేర్కొన్నారు. శ్రీశ్రీశ్రీ సద్గురు రామారావు మహారాజ్‌కు భారతరత్న ప్రకటించేలా కృషి చేస్తానని, అలాగే ఆయన విగ్రహం బాసరలో ఏర్పాటు చేసేలా ప్రయత్నిస్తానని

నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ ధర్మపురి పేర్కొన్నారు. కార్యక్రమానికి పౌరాదేవి నుంచి శేఖర్‌ మహారాజ్, జితేందర్‌ మహారాజ్, కబీర్‌దాస్‌ మహారాజ్‌తోపాటు నిజామాబాద్‌ అర్బన్, ఆర్మూర్‌ ఎమ్మెల్యేలు ధన్‌పాల్‌ సూర్యనారాయణ, పైడి రాకేష్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్‌ కులాచారి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో బంజారా నాయకులు బద్యా నాయక్, డాక్టర్‌ బిలోజి నాయక్, పూజారుల సంఘం అధ్యక్షుడు రమేష్‌ మహారాజ్, బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడు కిషన్‌ నాయక్, ఎంపీపీ గద్దె భూమన్న, పద్మారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, ప్రమోద్‌కుమార్, రాంసింగ్‌ నాయక్, నరేందర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed