ఇరిగేషన్ శాఖ భూములు అన్యాక్రాంతం కాకుండా చూస్తా

by Sridhar Babu |
ఇరిగేషన్ శాఖ భూములు అన్యాక్రాంతం కాకుండా చూస్తా
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ నియోజకవర్గంతో పాటు, పట్టణ కేంద్రంలో నీటిపారుదల, మున్సిపల్ 10, 5 శాతం స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చూస్తానని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో పైడి రాకేష్ రెడ్డి మాట్లాడారు. ఆర్మూర్ నియోజకవర్గంలో నెలకొన్న ప్రజల ప్రధాన సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తానన్నారు. 63వ జాతీయ రహదారి పక్కన నీటిపారుదల శాఖకు చెందిన స్థలాన్ని అధికారులు గతంలో సర్వే చేసి గుర్తించారని తెలిసిందని,

దానిపై సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో తొందరలోనే సమావేశాన్ని ఏర్పాటు చేస్తానన్నారు. అవసరమైతే ఈ స్థలం విషయంలో అన్ని రాజకీయ పక్షాలతో సమావేశం ఏర్పాటు చేయిస్తానన్నారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిన వారు ఎంతటి వారైనా సహించేది లేదని హెచ్చరించారు. ఆర్మూర్ ఆర్టీసీ డిపో ఎదుట మురుగు నీరు ప్రవహిస్తున్నందున టెండర్లు నిర్వహించి కాలువ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. ఆర్మూర్ నియోజకవర్గం స్థాయిలో మున్సిపల్, మండలాల వారీగా తొందరలో అధికారులతో సమావేశాలను

నిర్వహించి ప్రభుత్వ భూములు, 10,5 శాతం మున్సిపల్ భూముల లెక్కలు తీయిస్తానన్నారు. అంతకుముందు ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట మండలానికి చెందిన పలువురు కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి బీజేపీ నాయకులతో కలిసి అందజేశారు. ఈ సమావేశంలో ఆర్మూర్ మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ జీవి నరసింహారెడ్డి, ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు రెడ్డి, సడాక్ క్రాంతి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story