నాడు సర్పంచ్... నేడు కూలీ ప్రజా ప్రతినిధిగా చేసినా మారని తలరాత

by Naveena |   ( Updated:2024-10-07 11:52:56.0  )
నాడు సర్పంచ్... నేడు కూలీ  ప్రజా ప్రతినిధిగా చేసినా మారని తలరాత
X

దిశ, కామారెడ్డి : డబ్బు..డబ్బు..డబ్బు..రాజకీయాల్లో డబ్బు లేకపోతే ఆ నాయకుడికి విలువే లేదు. ఇక ఒకపదవి వచ్చాక ఆ నాయకుడు సంపాదించుకునే తీరే వేరు. ఒకసారి సర్పంచ్ అయితే..ఒక తరం బతికేయొచ్చు అనుకుంటున్నా నేతలున్న ఈ రోజుల్లో ఐదేళ్లు సర్పంచ్ గా కొనసాగినా.. చిల్లి గవ్వ కూడా వెనకేసుకోకుండా కూలి పని చేసుకునే సర్పంచులు నేటి రోజుల్లో ఉన్నారా..? అంటే అవుననే చెప్పాలి.

ఏకగ్రీవంగా ఎన్నికైన ఓ సర్పంచ్ ఐదేళ్లు పనిచేసినా చిల్లిగవ్వ కూడా సంపాదించుకోకపోవడంతో..పదవి ముగియగానే ఎప్పటి మాదిరిగానే దినసరి కూలీగా పని చేస్తున్నాడు. కామారెడ్డి మండలం నర్సన్నపల్లి గ్రామంలో 2014 సంవత్సరంలో ఎస్టీ సామాజిక వర్గానికి సర్పంచ్ స్థానం రిజర్వేషన్ వచ్చింది. గ్రామానికి చెందిన కుర్ర ఎల్లయ్య అనే వ్యక్తి పందులను మేపుతూ జీవనాన్ని సాగిస్తుండేవాడు. గ్రామస్తుల కోరిక మేరకు సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఐదేళ్లు సర్పంచ్ పదవిలో ఉన్నాడు. నిజాయితీగా ప్రజలకోసం పనిచేశాడు. పదవీకాలం సమయంలో చిల్లి గవ్వ కూడా సంపాదించుకోలేదు. అంతేకాకుండా సర్పంచ్ గా పని చేస్తూ పందులను మెపుతుండడంతో..అధికారులు హుందాగా బతకాలని సూచించారు. దీంతో పందులను అమ్మేశాడు. నివసించడానికి పెంకుటిల్లు కూడా లేకపోవడంతో.. పూరి గుడిసెలోనే ఐదేళ్లు జీవనం సాగించాడు. అప్పటి సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పేదవారికి కట్టించగా ఎల్లయ్యకు కూడా ఇచ్చారు. ఈ ఒక్కటి తప్ప తన పదవిలో ఉన్నప్పుడు కానీ ..ఇప్పుడు కానీ ఏది సంపాదించుకోలేదు. ప్రస్తుతం వ్యవసాయ కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి తనదని, హోదా మెయింటైన్ చేయాలంటే తనకు ఎలాంటి ఆధారం లేదని ఈ సందర్భంగా ఎల్లయ్య పేర్కొన్నారు. తనతో పాటు పని చేసిన సర్పంచ్ లు అందరూ ఎంతో కొంత కూడబెట్టుకొని నేడు దర్జాగా బతుకుతున్నరన్నారు. తాను మాత్రం సర్పంచ్ కంటే ముందు ఎలా ఉన్నానో సర్పంచ్ పదవి అయిపోయాక కూడా అలాగే ఉన్నానని పేర్కొన్నారు. తనకు ప్రభుత్వం ఉపాధి చూపించి ఆదుకోవాలని ఆయన కోరారు.

Advertisement

Next Story

Most Viewed