రాహుల్ గాంధీ మాటలు దేశంలో ఒకలా, దేశం బయట మరోలా ఉంటాయి - ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

by Naresh |
రాహుల్ గాంధీ మాటలు దేశంలో ఒకలా, దేశం బయట మరోలా ఉంటాయి - ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ సెప్టెంబర్ 26: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశ ప్రతిష్టకు విఘాతం కలిగేలా మాట్లాడుతున్నారని, ఆయన మాట్లాడే మాటలు దేశంలో ఒక తీరున, దేశం బయట మరోలా ఉంటాయని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త అన్నారు.

జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఎస్సీ మోర్చా అధ్యక్షులు బీఆర్ శివప్రసాద్ అధ్యక్షతన గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీ దేశ ప్రతిష్టకు భంగం కలిగేలా మాట్లాడారని, ఆయన మాటలు దేశం లోనే కాదు దేశం బయట కూడా భారతదేశ సార్వభౌమాధికారానికి, దేశ భద్రతకు భంగం వాటిల్లే విధంగా ఉన్నాయని ధన్ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ ప్రజలను మోసం చేయడం, విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు రిజర్వేషన్ల తొలగింపు గురించి మాట్లాడటం ఆయనకు అలవాటుగా మారిందన్నారు.

దేశంలోని సామాజిక వర్గాల్లో అల్లర్లు సృష్టించే విధంగా రాహుల్ మాట్లాడుతున్నారని, రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలకు వెళ్లిన ప్రతిసారి సంఘ విద్రోహకర వ్యక్తులను కలుస్తూ చేసే చర్యలు దేశాన్ని విడగొట్టే విధంగా ఉన్నాయని ఎమ్మెల్యే ధన్ పాల్ దుయ్యబట్టారు. బీఆర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ను 1952, 1954లలో ఓడగొట్టి ఆయనను అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు.

అధికార దాహంతో కాంగ్రెస్ పార్టీ 1975 లో భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి రాజ్యాంగాన్నే అపహాస్యం చేసిందన్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో అంబేద్కర్ చిత్రపటాన్ని కూడా పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ అవమానించిందని, అధికార దాహం కొరకు వంద కన్నా ఎక్కువ సార్లు రాజ్యాంగాన్ని మార్చడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సందీప్, కుమార్, సంజీవ్, పవర్ సాయినాథ్, బాలకృష్ణ, కెప్టెన్ రాజు, కిరణ్ లతో పాటు ఎస్సీ మోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed