తెలుగు సాహిత్యంలో మేటి కవి రాధేయ..

by Sumithra |
తెలుగు సాహిత్యంలో మేటి కవి రాధేయ..
X

దిశ, నిజామాబాద్ సిటీ : తెలుగు సాహిత్యంలో గట్టి అక్షర విత్తనాలను నాటి సాహిత్య వృక్షాలను సృష్టించిన ఘనుడు డాక్టర్ రాధేయ అని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నాళేశ్వరం శంకరం అన్నారు. డాక్టర్ రాధేయ పూర్వకవులు గర్వపడేలా చేస్తూ తర్వాతి కవులకు ఆదర్శంగా నిలిచి మేటి కవిగా స్థానం సంపాదించుకున్నాడన్నారు. ఆయన తన రచనలలో కష్టజీవుల గుండె చప్పుడును ప్రపంచానికి చాటి చెప్పారని తెలిపారు. ఆదివారం కేర్ డిగ్రీ కళాశాలలో సాయంత్రం జరిగిన డాక్టర్ రాధేయ రచించిన సాంత్వనమ్, పేరిశెట్టి శివకుమార్ రచించిన మొలగొలుకు చేను గ్రంథాల ఆవిష్కరణ సభలో పాల్గొన్నారు. తెలుగు సాహిత్యంలోని ప్రముఖ కవులందరి కవితలను విశ్లేషిస్తూ సంపుటాలుగా తీసుకొచ్చిన ఘనత రాధేయ సొంతమని ఆయన అభినందించారు.

పేరిశెట్టి శివకుమార్ రాసిన మొలగొలుకు చేను పుస్తకాన్ని తెలంగాణ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ వి.శంకర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన కవి శివకుమార్ అని వినూత్న ఒరవడులను అందిపుచ్చుకోవడంలో ఆయన నైపుణ్యత కలిగి ఉన్నాడని అభినందించారు. తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనపురం దేవేందర్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో డాక్టర్ రాధేయ మాట్లాడుతూ తెలంగాణ ఆర్తి నిండిన కవిత్వానికి నిలయమని ఇక్కడి కవులు ఉద్యమ కాలంలో నిప్పులు కురిపించారని రాజకీయ ఉద్యమానికి సమాంతరంగా సాహిత్య ఉద్యమాన్ని నడిపారని వివరించారు. పేరిశెట్టి శివకుమార్ మాట్లాడుతూ నెల్లూరుకు చెందిన తాను తెలంగాణ నుంచి చాలా స్ఫూర్తిని పొందానని తన కవిత్వాన్ని ఇక్కడి కవులు చక్కగా ఆస్వాదించి విశ్లేషించారని ఎక్కడైనా కవితల జెండా ఎగరవేయడమే కవుల లక్షణమని ఆయన అన్నారు.

ప్రముఖకవి జి.నరసింహస్వామి సాంత్వనమ్, మొల్ల గొలుకు చేను పుస్తక సమీక్ష చేశారు. స్మృతి కావ్యాలకు సత్యారాధేయం ఆదర్శమని, ఆధునిక ప్రతీకలకు మొలగొలుకు చేను సంకేతమని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్ప ప్రసాద్, కందకుర్తి ఆనంద్ రావు, కందకుర్తి యాదవ్, రావు, పంచరెడ్డి లక్ష్మణ్, మొగిలి స్వామి రాజ్, మద్దుకూరు సాయిబాబు, , కర్క రమేశ్ పటేల్, రాయల మధు, తిరుమల శ్రీనివాస్ ఆర్య, దారం గంగాధర్, వి.పి. చందన్ రావు, సుదర్శన్, చెన్న శంకర్, దేవసాని కైలాస్, బలాస్ట్ మల్లేశ్, తిరుమల శ్రీనివాస్ ఆర్య, గణపురం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed