ప్రజాపాలనను సద్వినియోగం చేసుకోవాలి

by Sridhar Babu |
ప్రజాపాలనను  సద్వినియోగం చేసుకోవాలి
X

దిశ, కామారెడ్డి : ప్రజలకు చేరువగా పాలనను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అభయ హస్తం కింద అర్హులైన నిజమైన లబ్ధిదారుల నుండి మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహ జ్యోతి, చేయూత పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తున్నదని అన్నారు. గురువారం కామారెడ్డి మున్సిపాలిటీ దేవునిపల్లిలోని 12 వ వార్డు, సదాశివనగర్ మండలంలోని వడ్లూర్ ఎల్లారెడ్డి, సదాశివనగర్, గాంధారి రైతు వేదికల వద్ద ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమ తీరుతెన్నులను రాష్ట్ర పరిశీలకులు విద్యా శాఖ సంయుక్త కార్యదర్శి హరిత, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మను చౌదరిలతో కలిసి పరిశీలించి అధికారులకు తగు సూచనలిచ్చారు. ఆయా గ్రామ సభలలో అవసరమైన దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంచడం, షామియానా,

మంచినీటి సౌకర్యం కల్పించడం, దరఖాస్తులు నింపడానికి ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ లు, దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లను పరిశీలించి వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...ప్రజలు ఎంతో ఉత్సాహభరితంగా దరఖాస్తులు అందజేసేందుకు గ్రామ సభలకు వస్తున్నారని తెలిపారు. వారికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక హెల్ప్ డెస్క్ కౌంటర్ లు ఏర్పాటు చేసి దరఖాస్తు ఫారాలు నింపడంలో గ్రామ కార్యదర్శులు, వార్డు సిబ్బంది సహాయ పడుతున్నారని అన్నారు. నేటి నుండి జనవరి 6, 2024 వరకు (8) పనిదినాలలో రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డుల్లో ఒకేసారి ఈ ప్రజా పాలన దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలోని 526 గ్రామా పంచాయతీలు, మూడు మున్సిపాలిటీలలోని 80 వార్డుల్లో ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. జిల్లాలో 2,93,635 కుటుంబాలున్నాయని, అన్ని పథకాలకు కుటుంబం నుండి ఒకే దరఖాస్తు ఇస్తే సరిపోతుందని ఆయన స్పష్టం చేశారు.

దరఖాస్తు ఫారాలు ఉచితంగా అందజేస్తున్నామని, దరఖాస్తులో లబ్ధిదారుడు పొందాల్సిన పథకాలకు టిక్ మార్కు చేస్తూ రేషన్ కార్డు, ఆధార్ కార్డు జతపరచాలని సూచించారు. రేషన్ కార్డు లేని, కొత్తగా రేషన్ కార్డు కావలసిన వారు దరఖాస్తు ఫారం మొదటి పేజీలోని రేషన్ కార్డు నెంబరు దగ్గర లేదు, కొత్త రేషన్ కార్డు అవసరం అని పొందుపర్చాలని, ప్రత్యేక దరఖాస్తూ అవసరం లేదని అన్నారు. దరఖాస్తు ఇవ్వడానికి అభ్యర్థే రానవసరం లేదని, ఎవరైనా ఇవ్వవచ్చని స్పష్టం చేశారు. టీమ్ లీడర్ సూచనల మేరకు గ్రామ సభల వద్ద హెల్ప్ డెస్క్ లు అవసరం మేర పెంచాలని, ఒకవేళ ఏదేని కారణాల వల్ల గ్రామ సభ రోజు దరఖాస్తు చేయని వారు జనవరి 6 లోగా సంబంధిత గ్రామ పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు అందజేయవచ్చని, వారికి తప్పక రసీదు అందజేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇందు ప్రియ, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, ఆర్డీఓ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీఓ లక్ష్మి, తహసీల్ధార్ హిమబిందు, వార్డు సభ్యురాలు కాసర్ల గోదావరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed