పెరిగిన ధరలతో కరువైన పండుగ సందడి

by karthikeya |   ( Updated:2024-10-06 08:48:03.0  )
పెరిగిన ధరలతో కరువైన పండుగ సందడి
X

దిశ ఆర్మూర్: దుర్గామాత, బతుకమ్మ, దసరా ఉత్సవాల్లో పండుగ పూట అన్ని ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్య ప్రజలు అవాక్కవుతున్నారు. ఏం కొనేటట్టు లేవు.. ఇలా అయితే పండుగలు ఎలా చేసేదంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. నిత్యవసర వస్తువులతో పాటు కూరగాయల ధరలు విపరీతంగా పెరగడంతో అన్ని వర్గాల ప్రజల్లో పండుగ ఏర్పాట్లలో నిర్లిప్తత నెలకొంది. ధరల నియంత్రణ అదుపు చేయాల్సిన అధికారులు చేతులెత్తేయడంతో సామాన్య ప్రజలు ఏమీ చేయలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇటీవల కొద్ది రోజుల్లోనే అదుపు లేకుండా నానాటికి పెరుగుతూ వస్తున్న నిత్యవసర వస్తువుల ధరలతో అన్ని వర్గాల ప్రజలు విలవిల్లాడుతున్నారు. ముఖ్యంగా పర్వదినాల సీజన్ల ముందు నుంచే నిత్యవసరాల ధరలను పెంచుతూ వ్యాపారస్తులు దండిగా సంపాదించుకునే ఆలోచనలు చేస్తూ ప్రజలను దోచుకుంటున్నారనే ఆరోపణలు ప్రజల నుంచి వినిపిస్తోంది.

రాష్ట్రంలో వరి ధాన్యం దండిగా సాగుతున్న రైతులు వరి ధాన్యం దిగుబడులు అమ్మే టైంలో మొక్కుబడిగా ధరలు ఉంచుతూ, రైతుల పంటల దిగుబడులు అమ్మిన కొద్ది రోజుల్లోనే అమాంతంగా వ్యాపారస్తులు బియ్యం ధరలను పెంచేస్తున్నారు. సమాజంలోని మార్కెట్లో బియ్యం ధరలతో పాటు, పప్పు దినుసుల రేట్లు, వంట నూనెల రేట్లు అమాంతంగా పెరిగిపోవడంతో సామాన్యుడు నానా అవస్థలు పడుతున్నాడు.

పేద మధ్యతరగతి ప్రజలైన సామాన్యులు త్వరలో జరగబోయే దసరా పండుగ సందర్భంగా వారికి కావలసిన సరుకులను కొనుగోలు చేసి సంబురంగా పర్వదినాన్ని జరుపుకునే పరిస్థితి అమాంతంగా పెరిగిన ధరలతో కనబడడం లేదు. ఇదివరకు లేని ముడి రిఫైండ్ వంటనూనెల దిగుమతిపై కేంద్ర ప్రభుత్వం 20% సుంకం విధించడంతో.. వంటనూనె ధర లీటరు ప్రస్తుతం 20 నుంచి 40 వరకు అధికమైంది. వంట నూనెలతో పాటు టమాటా ధర దాదాపు 100 రూపాయలు, అల్లం, వెల్లుల్లి, ఉల్లిగడ్డలు, ఎండుమిర్చి ధరలు రూ.100కు పైన చేరుకున్నాయి. మిగతా కూరగాయలు సైతం సుమారు 100 రూపాయల ధరను చేరుకుంటుండతో సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

అయితే పండుగల సమయంలో నిత్యవసర వస్తువుల ధరలను వ్యవసాయ మార్కెట్ పాలకులు, సివిల్ సప్లై, తూనికలు కొలతల శాఖ అధికారులు నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా బహిరంగ మార్కెట్లో కృత్రిమ కొరతను సృష్టించి ధరలను పెరుగుదలకు కారణం అవుతున్న వ్యాపారస్తులపై కూడా నిఘా పెట్టాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed