పెన్షన్ కోసం పెన్షన్ దారుల పడిగాపులు

by Naveena |
పెన్షన్ కోసం పెన్షన్ దారుల పడిగాపులు
X

దిశ, నిజామాబాద్ : ఒకటో తారీకు వచ్చిందంటే చాలు..ఆసరా పెన్షన్ల కోసం ఆశగా ఎదురు చూస్తుంటారు. ఇక ప్రతి నెలా పోస్ట్ ఆఫీస్ లో పెన్షన్ దారులకు అవస్థలు మాత్రం తప్పడం లేదు. పోస్ట్ ఆఫీస్ సిబ్బంది సమయపాలన పాటించకపోవడంతో.. పింఛన్ కోసం వచ్చే వయసు పైబడిన బామ్మలు, తాతయ్యలు, అంగవైకల్యం కలిగిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెన్షన్ల కోసం ఉదయం నుంచే పోస్ట్ ఆఫీస్ ముందు క్యూ కడుతున్నారు. ఉదయం సమయంలో తెరుచుకోవాల్సిన పోస్ట్ ఆఫీస్ తలుపులు ఇష్టారీతిన తెరుచుకుంటున్నాయి. పోస్ట్ ఆఫీస్ సిబ్బంది సమయపాలన పాటించకపోవడంతో..ఆఫీస్ ఎప్పుడు తెరుచుకుంటుందో, అసలు తెరుచుకుంటుందో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొందని పింఛన్ దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భీంగల్ మండలం బడా భీంగల్ పోస్టాఫీస్ ముందు ఉదయం 8 గంటల నుంచే పింఛన్ దారులు క్యూ కట్టారు. మిట్ట మధ్యాహ్నం అవుతున్నా పోస్ట్ ఆఫీస్ తెరుచుకోకపోవడంతో.. పింఛన్ దారులు పడిగాపులు కాచి నీరసించిపోయారు. ప్రతినెలా ఇదే తంతు కొనసాగుతోందని, ఎప్పుడొస్తారో, ఎప్పుడు పింఛన్లు ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొందని పింఛన్ దారులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకొని పరిస్థితిని చక్కదిద్దాలని పెన్షన్ దారులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story