ఓటు నమోదుకు గ్రాడ్యుయేట్ అనాసక్తి..

by Sumithra |   ( Updated:2024-11-04 03:54:43.0  )
ఓటు నమోదుకు గ్రాడ్యుయేట్ అనాసక్తి..
X

దిశ, ఆలూర్ : గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటరు నమోదుకు గ్రాడ్యుయేట్లు ముందుకు రావడం లేదు. రాజకీయ పార్టీల నేతలతో పాటు పోటీకి సిద్ధమవుతున్నవారు అవగాహన కల్పిస్తున్నా ఎక్కువ మంది నమోదు చేసుకోవడం లేదు. పోటీలో ఉన్నవారు తమకు దగ్గరగా ఉన్న సంఘాల ద్వారా ప్రయత్నాలు చేస్తున్న వివరాలను ఇచ్చేందుకు కూడా ముందుకు రావడం లేదు. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఓటరు నమోదుకు ఈ నెల 6 వరకే గడువు ఉన్నా ఆశించిన విధంగా మాత్రం నమోదు కావడం లేదు. ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రధాన పార్టీల నేతలు అభ్యర్థుల కోసం వెతుకుతున్నారు. ఆర్థిక, అంగబలం, రాజకీయ పలుకుబడి ఉన్న వారిని నిలబెట్టేందుకు సిద్ధమవుతున్నారు. గడువు దగ్గర పడుతుండటంతో ఎక్కువగా ఓటర్లను నమోదు చేసేందుకు ప్రయత్నాలను చేస్తున్నారు.

ఉపాధ్యాయులు అంతంతే..

ఆదిలాబాద్‌ - కరీంనగర్‌ - నిజామాబాద్‌ - మెదక్‌ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ స్థానానికి ఓటర్ల నమోదు నెమ్మదిగా సాగుతుంది. ఉపాధ్యాయ వర్గాల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉంది. నిజామాబాదు జిల్లాలో 5,500 మంది టీచర్లు ఉండగా ఇప్పటి వరకు 1,500 మంది మాత్రమే ఎమ్మెల్సీ ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకున్నారు. మండలిలో ఓటు వేయాలంటే ఇది వరకు దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ చేసుకోవాలని పదే పదే చెబుతున్నా ఆయా వర్గాల నుంచి స్పందన కనిపించడం లేదు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లు 3078 మంది ఓటరుగా నమోదు చేసుకోగా.. ఈసారి ఇంతకు వెనకంజలో ఉన్నారు.

పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాలంటే పట్టభద్రులు తమ పేరు నమోదు చేసుకోవాలి. 2021 అక్టోబరు 31 నాటికి డిగ్రీ పూర్తయి ఉండాలి. వీరు ఫారం - 18లో పూర్తి వివరాలు నమోదు చేయాలి. ఇప్పటి వరకు పట్టభద్రులు 12,500 మంది మాత్రమే నమోదు చేసుకోగా, గత ఏడాది 24,073 కాగా ఈ సంఖ్య గతంలో దానికంటే సగం కూడా లేదు.

ఆన్లైన్లో నమోదు..

పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఇంటి వద్ద నుంచే ఓటు నమోదు చేసుకోవచ్చు. ఇందుకు వెబ్‌సైట్‌లో www.ceotelangana.nic.in లో పట్టుభద్రులు ఫారం - 18, ఉపాధ్యాయులు ఫారం - 19 దరఖాస్తు నింపాలి. డిగ్రీ ధ్రువపత్రం, ఆధార్‌, ఓటరు గుర్తింపు కార్డుతో ఫొటో అప్‌లోడ్‌ చేయాలి. ఆయా పత్రాలతో స్థానిక తహశీల్దార్‌ కార్యాలయాల్లో మ్యాన్‌వల్‌గా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

మార్చ్ 29న ముగియనున్న పదవీకాలం..

ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, మెదక్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ పదవీకాలం మార్చి 29న ముగియనుంది. ఈ పదవీకాలం పూర్తయ్యేలోపే కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఈ ఎమ్మెల్సీ కోసం ఎన్నికను నిర్వహించనుంది. దాంట్లో భాగంగానే గత నెల రోజుల నుంచి ఈ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఓటరు నమోదు చేసేందుకు గ్రాడ్యుయేట్లకు అవకాశం ఇచ్చింది. నాలుగు ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆయా మండలాల పరిధిలో నమోదు చేసుకునే విధంగా ఏర్పాట్లను చేసింది. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. రాజకీయ పార్టీల లెక్కల ప్రకారం ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలో గ్రాడ్యుయేట్‌లు సుమారు 10 లక్షల వరకు ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈ ఎన్నికల కోసం 2021లోపు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకున్న వారికి ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

పోటీకి సిద్ధమవుతున్న ప్రధాన పార్టీలు..

ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రధాన పార్టీల నేతలు ముందస్తుగానే సిద్ధమవుతున్నారు. ఈ దఫా బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు అధికార కాంగ్రెస్‌తో పాటు బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలోని ఆర్థిక, అంగబలం ఉన్నవారిని బరిలో దించేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో పోటీ చేసిన వారికంటే కొత్తవారిని దింపడంతో పాటు గట్టి పోటీ ఇచ్చే విధంగా ప్రయత్నాలను చేస్తున్నారు. ప్రస్తుతం సిట్టింగ్‌ ఎమ్మెల్సీ కూడా అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారు కావడంతో దానిని నిలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలో కాంగ్రెస్‌ నేతలతో పాటు సగం మంది పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నందున బలమైన నేతను ఈ దఫాగ పోటీకి దింపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అని పార్టీ ఆధ్వర్యంలో సభలు, సమావేశాలను నిర్వహించడంతో పాటు ముందస్తుగా ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు.

Advertisement

Next Story