మున్సిపల్ కు నిబంధనలు పట్టవా...!

by Sumithra |
మున్సిపల్ కు నిబంధనలు పట్టవా...!
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలోని సుమారు 16 మున్సిపల్ వాహనాలు ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా ఎంచక్కా సుమారు రెండు మూడేళ్లుగా రోడ్డు పై దర్జాగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ తంతును అంతా ఆర్మూర్ మున్సిపల్ జనం ప్రతినిత్యం కళ్ళారా చూస్తూ ఔరా అని కళ్ళు పేలేసుకుంటున్నారు. సామాన్యులకు ఒక రూల్.. మున్సిపల్ కు మరో రూలు ఉంటుందా అని ముక్కున వేలేసుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయానికి నిబంధనలు పట్టవా అంటూ ఆర్మూర్లో జనం చర్చించుకుంటున్నారు. సాధారణంగా ఏ వాహనం అయినా రోడ్డెక్కాలంటే కొనుగోలు జరిపిన తర్వాత తప్పనిసరిగా రవాణా శాఖ నిబంధనలు పాటించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ లేకుండా తిరుగుతూ ఆర్టీఏ, పోలీస్ అధికారుల కంటపడితే జరిమానాలు, కేసులు నమోదు చేయడం అందరికీ తెలిసిందే.

కానీ ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయానికి చెందిన సుమారు 16 వాహనాలు ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో మూడేళ్లుగా చక్కర్లు కొడుతున్నా, మున్సిపల్ కార్యాలయానికి ఆ నిబంధనలు పట్టవా అన్నట్లు స్థానిక పోలీస్, ఆర్టీఏ అధికారుల తీరును చూస్తే అర్థమవుతుంది. వాహనాలకు పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే చుక్కలు చూపించే అధికారులు చెత్త సేకరణకు వినియోగించే మున్సిపల్ వాహనాలు ఏళ్ల తరబడి రిజిస్ట్రేషన్ లేకుండానే రోడ్లపై తిరుగుతున్నాయి. మున్సిపల్ లోని వాహనాలకు రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, ఫిట్ నెస్ లేకపోవడంతో ప్రమాదాలు జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారు అనే విషయం పై మున్సిపల్ పాలకవర్గ అధికార సభ్యులు నోరెత్తకపోవడం విడ్డూరం. కానీ అనునిత్యం మున్సిపల్ కార్యాలయంలో ప్రజల అవసరం కోసం వాహనాల ద్వారా విధులు నిర్వహించే సందర్భంలో, అనుకోని సందర్భంలో ప్రమాదాలు సంభవించి ఎవరికైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు అనే విషయం పై అధికారులు మీనమేశాలను లెక్కిస్తున్నారు.

16 వాహనాలకు నో.. రిజిస్ట్రేషన్ లు..

ఆర్మూర్ మున్సిపాలిటీలో వార్డుల వారీగా చెత్త తీసుకెళ్లడానికి 22 ఆటోలతో పాటు 9 ట్రాక్టర్లు, రెండు బ్లేడ్ ట్రాక్టర్లు, ఒక జేసీబీ, ఒక స్విపింగ్ మిషన్ ఉన్నాయి. ఈ వాహనాలలో పీయాజీయో కంపెనీకి చెందిన 12 ఆటోలకు, 3 ట్రాక్టర్లకు, ఒక జేసీబీకి రిజిస్ట్రేషన్లు, ఇన్సూరెన్స్ లు రెండు మూడు సంవత్సరాలు కావస్తున్న ఆర్మూర్ మున్సిపల్ పాలకవర్గ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇంత వరకు కాలేదు. ఈ వాహనాలకు సంబంధించిన డాక్యుమెంట్లు, వాటిని ఏ ధరకు కొనుగోలు చేశారో ఆ రసీదులు.. ఉన్నాయా.. మున్సిపల్ లో వీటికి సంబంధించిన బిల్లులను ఏ విధంగా లేపారు అనే విషయం పై ఆర్మూర్ మున్సిపల్ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో ఈ వాహనాల వివరాలు విషయాన్ని అడిగితే ఫైళ్ళు వెతకాల్సి ఉందని సంబంధిత అధికారులు పొంతనలేని సమాధానంతో తప్పించుకుంటున్నారు. ఆర్మూర్ మున్సిపల్ లో రిజిస్ట్రేషన్ కానీ వాహనాలకు సంబంధించిన ఫైళ్లను మున్సిపల్ కార్యాలయంలో ఎప్పుడు వెతుకుతారో.. వాహనాలకు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేయిస్తారోననే తెలియని అయోమయ పరిస్థితి ఆర్మూర్ మున్సిపాలిటీలో తయారయింది.

మున్సిపల్ ట్రాక్టర్ ఢీ తో ఒకరి మృతి.. వెలుగులోకి వచ్చిన వాహనాల రిజిస్ట్రేషన్ ల వ్యవహారం..

ఇటీవల మున్సిపాలిటీ ట్రాక్టర్ తో ఒక ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. అయితే ఈ ట్రాక్టర్ కు రిజిస్ట్రేషన్ లేకపోవడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో సుమారు 16 వాహనాలకు రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ లేవనే అంశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్మూర్ ఎంవీఐ సైతం మున్సిపాలిటీలోని వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించాలని మున్సిపల్ అధికారులకు సూచించినట్లు తెలిసింది. ఈ రోడ్డు ప్రమాద వ్యవహారం జరిగి, ఆ సందర్భంలో స్థానిక ఆర్మూర్ ఎంవీఐ మున్సిపల్ వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయించాలని సూచించి రెండు నెలలు కావస్తున్న మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా తమకేం పట్టనట్లు చూసి చూడనట్లుగా ఉంటున్నారని విమర్శలు సర్వత్ర వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా మున్సిపల్ పాలకవర్గం, అధికారులు చొరవ చూపి ఆర్మూర్ మున్సిపల్ కు సంబంధించిన 16 వాహనాలకు రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ చేసి నంబర్ ప్లేట్ లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Next Story

Most Viewed