Nijamabad: ఆసరా కోసం ఆశగా ఎదురు చూపులు..

by Ramesh Goud |
Nijamabad: ఆసరా కోసం ఆశగా ఎదురు చూపులు..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఆసరా పింఛన్ల కోసం ఉమ్మడి జిల్లా ప్రజలకు రెండేళ్లుగా ఎదురు చూపులు తప్పడంలేదు. గత ప్రభుత్వం 2022 ఆగస్టు నెలలో చివరిసారిగా కొత్త పింఛన్లను మంజూరు చేసింది. అప్పటి నుంచి ఇప్పటి దాకా కొత్త పింఛన్లను ప్రభుత్వం మంజూరు చేయడం లేదు. దరఖాస్తులు కూడా తీసుకోవడం లేదు. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేస్తుందని ఆశ పడ్డ జనాలకు నిరాశే మిగిలింది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలిచి కొత్తగా కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇస్తుందని అందరూ భావించారు. కానీ, ఏడాది పూర్తవుతున్నా ఇప్పటికీ పింఛన్ల ఊసెత్తడం లేదు. రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న సంక్షేమ పథకాలకు నిధుల కొరత అడ్డంకిగా మారడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలోనే జాప్యం జరుగుతోంది. ఇక కొత్తగా ఆసరా పింఛన్లకు ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించడం, మంజూరు చేయడం ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఇంకొంత కాలం పింఛన్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులే కనిపిస్తున్నాయి.

ఉమ్మడి జిల్లాలో 4.34 లక్షల మందికి పింఛన్లు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 4,33,943 మందికి వివిధ రకాల ఆసరా పింఛన్లు అందుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో 2,69,546 మందికి, కామారెడ్డి జిల్లాలో 1,64,397 మందికి ప్రభుత్వం ఆసరా పెన్షన్లు అందజేస్తోంది. ఆసరా పెన్షన్ ల ద్వారా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆసరా లబ్దిదారులకు రూ.95.63 కోట్లు ప్రభుత్వం ప్రతినెలా చెల్లిస్తోంది. వీటిలో నిజామాబాద్ జిల్లాలో 58.67 కోట్లు, కామారెడ్డి జిల్లాలో 36.76 కోట్లు చెల్లిస్తోంది. ఫించన్ల కోసం ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన 70 వేల మందికి పైగా వివిధ రకాల ఫించన్ల కోసం ఎదురు చూస్తున్నట్లు ఒక అంచనగా అధికారులు చెబుతున్నారు.

పెంచుతామన్న ఆసరా పింఛన్లు పెంచలే..

తాము అధికారంలోకి వస్తే ఆసరా పింఛన్లు పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా ఇప్పటికీ పాత పింఛన్లే అమలవుతోంది. ప్రతి మహిళకు ప్రతినెలా రూ.2,500 లు ఇస్తామన్న పింఛన్ కూడా అమలు కావడం లేదు. ఏడాది గడుస్తున్నా ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ మొత్తాన్ని పెంచలేదు. కొత్త పింఛన్లను మంజూరు ఇవ్వడం లేదు. దీంతో ఎప్పుడెప్పుడొస్తాయో కొత్త పింఛన్లు అని అర్హులు చకోర పక్షిలా ఎదురు చూస్తున్నారు. కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసే వారిలో వృద్ధులు, ఒంటరి మహిళలే ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం ఇన్ స్టంట్ ఓఏపీ పింఛన్లనే ఇస్తోంది. ఒక ఇంట్లో భార్యభర్తల్లో ఎవరైనా చనిపోతే వారికి వస్తున్న పింఛన్ వారి బతుకున్న భర్తకో, భార్యకో పింఛన్ బదిలీ చేసే అవకాశం మాత్రమే ఇప్పుడు కొనసాగుతోందని అధికారులు చెపుతున్నారు.

590 మంది అనర్హుల ఫించన్లు కట్..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 590 మంది అనర్హులు పొందుతున్న ఫించన్లను అధికారులు కట్ చేశారు. అనర్హుల్లో డబుల్ పింఛన్ పొందుతున్న వారిలో చాలా మంది సర్వీస్ పింఛన్ పొందుతూ, ఆసరా పింఛన్లు కూడా పొందుతున్నారని అధికారులు గుర్తించారు. మరికొందరు నకిలీ వయసు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి వృద్ధాప్య ఫించన్లు, తప్పుడు పీఎఫ్ పత్రాలు వంటివి సమర్పించి బీడీ కార్మికులకు ఇచ్చే ఆసరా పింఛన్లు పొందుతున్నట్లు తేలింది. ఒంటరి మహిళ పింఛన్లు పొందేవారిలో కూడా అనర్హులున్నట్లు అధికారులు గుర్తించారు. ఇలా అడ్డదారిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 590 మంది వరకు డబుల్ పింఛన్లు పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. నిజామాబాద్ జిల్లాలో 435 మందిని, కామారెడ్డి జిల్లాలో 155 మందిని అధికారులు అనర్హులుగా గుర్తించి వారికి పింఛన్ కట్ చేశారు. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ కన్నా ముందుగానే పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తారని గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు ప్రజలకు ఆశలు కల్పిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా దరఖాస్తులు స్వీకరించి వెంటనే అర్హులకు ఆసరా ఫించన్లు మంజూరు చేయాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Next Story