జూమ్ మీటింగ్ లో బీజేపీ అధ్యక్షుడిపై ఎంపీ అరవింద్ ఫైర్

by Javid Pasha |
జూమ్ మీటింగ్ లో బీజేపీ అధ్యక్షుడిపై ఎంపీ అరవింద్ ఫైర్
X

దిశ, ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య పై ఎంపీ అర్వింద్ ఫైర్ అయ్యారు. గత కొన్ని రోజులుగా బీజేపీలో ఉన్న గ్రూప్ రాజకీయాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. శుక్రవారం నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లోని జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ నాయకులు, జోన్ కమిటీ కన్వీనర్లతో ఎంపీ అర్వింద్ జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించారు. ఆ సమయంలోనే నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మీనర్సయ్య స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లలో బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జి మల్లిఖార్జున్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఇంచార్జి కులాచారి దినేష్ లు తమ ఫోటోలను ఫ్లెక్సీలపై ఉంచరాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ ఆదేశానుసారం ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని సూచించారు.

ఇది వరకే స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లలో వేదికపై ఉన్న ఇద్దరు లీడర్లు బస్వా లక్ష్మీనర్సయ్య ను దించివేసిన ఉదంతాలు ఇది వరకే ఆ నాయకులు ఎంపీ అర్వింద్ కు ఫిర్యాదు చేశారు. ఆ విషయంలో అవి చర్చకు రాగానే అర్వింద్ బస్వా పై మండిపడ్డారు. బస్వా లక్ష్మీనర్సయ్య పార్టీ డెవలప్ మెంట్ కోసం పని చేసేవారిని తులనాడిన, విమర్శించినా ఊరుకునేది లేదన్నారు. పార్టీ నియమనిబంధనలను అందరూ ఖచ్చితంగా పాటించాల్సిందేనని, గ్రూప్ రాజకీయాలను పెంచి పోషిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

గత కొంత కాలంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య, ఎంపీ అర్వింద్ కు మధ్య పొసగడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే. ఏకంగా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో జరిగిన కీలక నేతల సమావేశంలోనూ బస్వాపై అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేయడం పార్టీలో చర్చనీయాంశంమైంది. బీజేపీ పార్టీలోకి తీసుకురావడంలో, పార్టీ అధ్యక్ష పదవి ఇప్పించడంలో అర్వింద్ చొరవ చూపించి ఇప్పుడు పక్కన పెట్టడంపై పార్టీలో చర్చ మొదలైంది.

పార్టీ నాయకత్వానికి ఇప్పటికే నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో జరిగిన విభేదాలపై ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో తాజాగా జూమ్ మీటింగ్ లోనూ గొడవలు జరుగడం విభేదాల తీవ్రస్థాయిని చెప్పకనే చెప్పాయి. ఉప్పునిప్పుగా ఉంటున్న నేతలు బహిరంగంగా జూమ్ మీటింగ్ లోనే వార్నింగ్ ఇచ్చే స్థాయికి విభేదాలు వెల్లడి కావడం వెనుక మతలబు ఉందని చర్చ జరుగుతుంది. నిజామాబాద్ జిల్లాలో పార్టీ సీనియర్లు, వలస నేతల మధ్య పూరించలేని విభేదాలు ఉన్నాయి. గతంలో రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అవి మరింత ముదిరాయి. శుక్రవారం నాటి జూమ్ మీటింగ్ సమావేశంపై సైతం పార్టీ అధిష్టానంకు ఫిర్యాదులు చేసే అవకాశం ఉంది.

Advertisement

Next Story