తెలంగాణ బడ్జెట్ కాగితపు బడ్జెట్.. ఫండ్స్ అసలు రావు : ఎంపీ ధర్మపురి అరవింద్

by Sumithra |   ( Updated:2023-02-22 15:52:16.0  )
తెలంగాణ బడ్జెట్ కాగితపు బడ్జెట్.. ఫండ్స్ అసలు రావు : ఎంపీ ధర్మపురి అరవింద్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణలో లక్ష కోట్ల బడ్జెట్ అని గొప్పలు చెబుతున్నారు తప్పితే అవి కాగితాలకే పరిమితమయ్యాయని, నిధులు లేవని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. బుధవారం జిల్లా బీజేపీ కార్యాలయంలో అరవింద్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రాజెక్టుల కొరకు జాతీయ హోదా ఇవ్వాలని చెబుతున్న డీపీఆర్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టులైన నాగార్జున సాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులకు 9 సంవత్సరాలుగా మెయింటెనెన్స్ కొరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఎప్పుడైనా ఏదైనా జరుగవచ్చని దానిని రాసిపెట్టుకోవాలన్నారు. బడ్జెట్ మీద పార్లమెంట్ లో మొదటి సెషన్ ముగిసిందని, అజాదిక అమృతోత్వం కార్యక్రమం జరపడం జరుగుతుందన్నారు. మోడీ ప్రభుత్వం వచ్చి 25 సంవత్సరాల కాలం పూర్తి కావస్తోంది, రాబోయే 25 సంవత్సరాలను పరిగణలోకి తీసుకుని అమృత్ కాల్ గా మొట్ట మొదటి బడ్జెట్ ను ప్రవేశపెట్టారని అన్నారు.

2014లో మోడీప్రధాన మంత్రి చేపట్టి నప్పటి నుండి ప్రపంచలో ఆర్థికంగా 10 వ స్థానంలో ఉన్న దేశం 5 వ స్థానంలోకి వచ్చిందన్నారు. ఈ బడ్జెట్ లో 7 అంశాల మీద దృష్టి సాధించి బడ్జెట్ ప్రవేశ పెట్టారన్నారు. అవినీతి రహితపాలన అందించడం ద్వారా ప్రపంచ దేశాలు మోడిని ఆకాశానికి ఎత్తుతున్నాయన్నారు. రాష్ట్రంలో పసుపునకు, ఇతర ఉత్పత్తులకు మద్దతు ధర లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని దానిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని ఎంఎస్ పి ఇస్తే రైతులకు కష్టాలు ఉండవన్నారు. నిజామాబాద్ జిల్లాలో జక్రాన్ పల్లి వద్ద ఏర్పాటు చేసే విమాన శ్రేణి కొరకు ఇప్పటి వరకు భూసేకరణ సంబంధిత రిపోర్టును కేంద్ర ప్రభుత్వానికి అప్పగించలేదన్నారు.

నిజామాబాద్ జిల్లాలో రైల్వే ఓవర్ బ్రిడ్జిల పనులు పరుగెత్తుతున్నాయని, అందుకు బీజేపీ చేసిన ప్రయత్నమే కారణమన్నారు. ముఖ్యమంత్రి రైతు ప్రభుత్వం తెస్తానంటున్నా రైతులకు నిధులు ఇవ్వడం లేదన్నారు. నిజామాబాద్ నగరంలోని రాజారాం స్టేడియం కొరకు ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక్క రూపాయి విడుదల చేయలేదని రాష్ట్ర ప్రభుత్వం కలిసి వస్తే తాను నిధులు ఇప్పించేందుకు సిద్దంగా ఉన్నానన్నారు. బీఆర్ఎస్ నాయకుల కమిషన్ల కారణంగానే కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా జరిగే పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని ఆరోపించారు.

తెలంగాణ ప్రభుత్వం ఎంఐఎస్ స్కీంను పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తే ఇప్పటి వరకు ఉన్న ఏ స్కీంలు బంద్ కావని డబుల్ ఇంజన్ సర్కారు రావడం ఖాయమన్నారు. ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ, నగర అధ్యక్షులు పంచరెడ్డి లింగం, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంతిరెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed