రేవంత్ రెడ్డి ఒక రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి: ఎంపీ అర్వింద్ ఫైర్

by Satheesh |   ( Updated:2024-05-03 06:55:45.0  )
రేవంత్ రెడ్డి ఒక రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి: ఎంపీ అర్వింద్ ఫైర్
X

దిశ, ప్రతినిధి నిజామాబాద్: రాష్ట్రంలో మూతపడిన చక్కెర కర్మాగారాలను తెరుస్తామంటూ ప్రభుత్వం బ్యాంకులకు రూ.43 కోట్ల బకాయిలను చెల్లించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై నిజామాబాద్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలో జరిగిన ప్రచార కార్యక్రమంలోని కార్నర్ మీటింగ్‌లో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ భయం పట్టుకుందని, 70 ఏళ్లుగా గుర్తుకురాని గల్ఫ్ బోర్డ్, పసుపు రైతులు, చెరుకు రైతులు వరి రైతులు గుర్తుకు వచ్చారని కామెంట్ చేశారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు, ఓటర్లు గుర్తుకు వస్తారని.. అందుకే గల్ఫ్ బోర్డ్ అంశాన్ని చక్కెర కర్మాగారాలను తెరిపిస్తామని రైతులను మరోసారి మోసం చేస్తున్నారన్నారు. మూతబడిన చక్కెర కర్మాగారాలను తెరిపించేందుకు హడావిడిగా రూ.43 కోట్లు బ్యాంకులకు చెల్లించేందుకు జరుగుతున్న యత్నాలను వివరించారు. చక్కెర కర్మాగారం భూములలో రియల్ ఎస్టేట్ దందా చేసేందుకే రేవంత్ రెడ్డి హడావిడిగా బకాయిలను విడుదలకు బ్యాంకర్లతో చర్చిస్తున్నారని అన్నారు.

రైతులకు రెండు లక్షల రుణమాఫీ పథకం అనేది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం జరగదని ధర్మపురి అరవింద్ అన్నారు. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి అంటూ వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు ఆరు గుడ్లు లాంటివని అవి ఎప్పుడు పొదుగుతాయో తెలియదని అన్నారు. రైతులకు భరోసా కల్పిస్తామని రైతుబంధును బంధ చేసిన ఘనత రేవంత్ రెడ్డిదని అన్నారు. వరి రైతులు కోతలు జరిగిన వెంటనే ధాన్యం కొనుగోలు చేస్తే చాలని తమకు బోనస్ అక్కర లేదని అంటుంటే కేసీఆర్ మాదిరిగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్లీ తరుగును తీస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీలైన కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా తులం బంగారం వచ్చిందా అని ఓటర్లను ప్రశ్నించారు. నాలుగు వేల పింఛన్ పెంచారా, ప్రతి మహిళకు రెండున్నర వేల రూపాయలు ప్రతినెల అందుతున్నాయా అని ఆరా తీశారు.

కాంగ్రెస్ పథకాలను వింటే లక్షాధికారులు అయిపోయినట్టే అనిపిస్తుందని కానీ వాటిని అమలు మాత్రం చేయరని ఎద్దేవా చేశారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాసీల కోసం బీజేపీ పనిచేస్తుందని, ఇండియన్ పీపుల్స్ ఫోరం ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో 10 సంవత్సరాలుగా వైద్యం, న్యాయ సేవలను ఉచితంగా గల్ఫ్ వాసులకు అందిస్తున్నామని గుర్తు చేశారు. ఎలాంటి రాజకీయ కోణం అక్కర్లేకుండానే గల్ఫ్‌లో ఉన్న ప్రవాసీల కోసం ఇండియన్ పీపుల్స్ ఫోరం పనిచేస్తుందని ఆయన గుర్తు చేశారు. భారతీయుల పరపతి దేశం, ప్రపంచ నలుమూలల విస్తరించిందనడానికి మోడీ పాలనని నిదర్శనం అన్నారు. 500 సంవత్సరాల తర్వాత రాముడిని అయోధ్యలో నిలిపి కొలుచుకుంటున్నామని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజలు గుర్తు వస్తారని, వారికి ఓటుతో బుద్ధి చెప్పాలని ధర్మపురి అరవింద్ అన్నారు. భారతీయ జనతా పార్టీని ఆదరించి గెలిపించాలని, మోడీని మరోసారి ప్రధాని చేయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.

Advertisement

Next Story