Goreti Venkanna : మహాకవి దాశరథి అత్యద్భుతమైన కవి..

by Sumithra |
Goreti Venkanna : మహాకవి దాశరథి అత్యద్భుతమైన కవి..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఏ మత గ్రంధాల్లో లేని మానవతా విషయాలను కవితల రూపంలో చెప్పిన మహాకవి దాశరథి అని ఎమ్మెల్సీ, తెలంగాణ వాగ్గేయకారుడు గోరేటి వెంకన్న అన్నారు. నిజామాబాద్ నగరంలోని టీఎన్జీవోస్ భవన్ లో ఆదివారం జరిగిన దాశరథి జయంత్యోత్సవ సభలో గోరేటి వెంకన్న మాట్లాడారు. ప్రశ్న వేయకుంటే కవి కవి కాడు.. ప్రశ్న వేసిన వాడే నిజమైన కవి అని ఆయనన్నారు. కవి దాశరథి పద్యాన్ని చాలా గొప్పగా రాశాడని, ఆయన ఓ అద్భుతమైన భావ కవి అని గోరేటి అన్నారు. వ్యావహారిక సత్యాన్ని మహాకవి దాశరథి తన రచనల రూపంలో చెప్పిన తీరు అత్యద్భుతంగా ఉంటుందన్నారు. మానవీయ సమాజాన్ని స్వప్నించి రచనలు చేసిన దాశరథి అందరికీ ఆదర్శనీయుడేనని వెంకన్న పేర్కోన్నారు. కవుల నుంచి పసిపాప నవ్వు లాంటి స్వచ్ఛమైన కవిత్వం రావాలని, కవి శ్రమజీవుల పక్షాన ఉండాలని గోరేటి అన్నారు.

రాను రాను మనుషుల్లో వివేకం నశించి క్రూరత్వం పెరుగుతోందన్నారు. ఇది సమాజానికి ఏమంత మంచిది కాదన్నారు. వివేకవంతులు సైతం ఆత్మహత్యలు చేసుకునే దయనీయ పరిస్థితి నెలకొందని గోరేటి ఆవేదన వ్యక్తం చేశారు. లాభాపేక్షతో కొందరు అన్నీ కల్తీ చేస్తున్నారన్నారు. కవులు రచయితలు ప్రజల కోసం పది నిమిషాలు కేటాయించి వారి కష్టాలను రాస్తే అదే మహాకవి దాశరథికి మనమిచ్చే నిజమైన నివాళి అని ఆయన అన్నారు.

Next Story

Most Viewed