మంత్రి ప్రశాంత్ రెడ్డి అండదండలతోనే జిల్లాలో మైనింగ్ మాఫియా.. మానాల మోహన్ రెడ్డి

by Sumithra |
మంత్రి ప్రశాంత్ రెడ్డి అండదండలతోనే జిల్లాలో మైనింగ్ మాఫియా.. మానాల మోహన్ రెడ్డి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని ఏర్గట్ల మండలం భట్టాపూర్ గ్రామంలో పంటపొలాల మధ్యలో ఉన్నక్వారీ, క్రషర్లను తక్షణమే మూసివేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం నిజామాబాద్ జిల్లాలోని ఏర్గట్ల మండలంలోని భట్టాపూర్ గ్రామంలో ఉన్న క్వారీ, క్రషర్లను సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పచ్చని పంట పొలాల మధ్యలో ఎలాంటి క్వారీలనుగాని, క్రషర్లను గాని నడపకూడదని పర్యావరణానికి సంబంధించి మైనింగ్ చట్టంలో ప్రాథమిక సూత్రం అమలులో ఉన్నప్పటికీ వాటిని తుంగలోకి తొక్కి క్వారీ, క్రషర్ పేరుతో మైనింగ్ కు పాల్పడుతున్న బాల్కొండ ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బినామీల పైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

కేవలం 13వేల క్యూబిక్ మీటర్ల మైనింగ్ కొరకే అనుమతి తీసుకున్నప్పటికీ ఇప్పటికే దాదాపు 15 లక్షల క్యూబిక్ మీటర్ల లోతుకు మైనింగ్ చేశారని ఆయన ఆరోపించారు. అక్రమ క్వారీ మైనింగ్ ద్వారా చుట్టుపక్కల పంట పొలాలు నాశనం అవ్వడమే కాకుండా పర్యావరణం కూడా దెబ్బతింటుందని గత నాలుగు సంవత్సరాలుగా వివిధ రాజకీయ పార్టీలు ప్రజాసంఘాల నేతలు గగ్గోలు పెడుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం గాని, స్థానిక మంత్రి దగ్గర నుండి గాని ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇదే అంశాన్ని క్వారీ నిర్వాహకులతో మాట్లాడదామని కాంగ్రెస్ పార్టీ పక్షాన తాము ఇక్కడికి వస్తే కేవలం రెండు నిమిషాల్లోనే పోలీసులు ఇక్కడ ప్రత్యక్షమయ్యారని, ఈ క్వారీ నిర్వహిస్తున్నది అక్రమ మైనింగ్ కి పాల్పడుతున్నది ప్రశాంత్ రెడ్డి అనడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలని ఆయన అన్నారు. అనుమతులకు మించి మైనింగ్ కి పాల్పడుతూ సహజ వనరులను దోచుకుంటూ ప్రభుత్వానికి రావలసిన పన్నులను ఎగ్గొడుతున్నారని ఆయన మండిపడ్డారు.

ఈ క్వారీ ముమ్మాటికీ వేముల ప్రశాంత్ రెడ్డి బినామీలదేనని ఆయన అండదండలు లేకుండా నిబంధనలను తుంగలో తొక్కి ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ అక్రమ మైనింగ్ వేరే ఎవరు చేయలేరని ఆయన ఆరోపించారు. గత నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ అక్రమ మైనింగ్ ద్వారా దాదాపు 100 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని దానిలో ప్రతి ఒక్క రూపాయి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటికే వెళ్లిందని ఆయన ఆరోపించారు. ప్రతి విషయంలో వెంటనే స్పందిస్తూ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసమస్యలు తీరుస్తున్నాను అని గొప్పలు చెప్తు డబ్బాలు కొట్టుకునే వేముల ప్రశాంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో గత నాలుగు సంవత్సరాలుగా జరుగుతున్న అక్రమ మైనింగ్ ఎందుకు అడ్డుకోవడం లేదని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఈ అక్రమ క్వారీల నిర్వహణ, మైనింగ్ వల్ల ఏర్గట్ల, భట్టాపూర్ గ్రామాలు సీనరేజ్ చార్జీలను నష్టపోయారని ఆయన ఆరోపించారు. అక్రమ మైనింగ్ గురించి తాము మైనింగ్ ఏడీని అడిగితే ఆయన పొంతనలేని సమాధానాలు చెప్పారని వీటన్నిటిని గమనిస్తే వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ప్రలోభపెట్టి మైనింగ్ మాఫియాను నడిపిస్తున్నారని ఆయన అన్నారు.

గతంలో సచివాలయం నిర్మాణం, అంబేద్కర్ విగ్రహనిర్మాణంలో కమిషన్లు దండుకున్న ప్రశాంత్ రెడ్డి ఇప్పుడు అక్రమ మైనింగ్ క్వారీల నిర్వహణతో వందల కోట్లు దండుకుంటున్నారని అన్నారు. ఒకవేళ ప్రశాంత్ రెడ్డికి మైనింగ్ మాఫియాతో తనకు సంబంధం లేనట్లయితే తాను సచ్చీలుడని నిరూపించుకోవాలని అనుకుంటే నిబంధనలను పాతరేసి సొంత నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ కు పాల్పడుతూ సహజ వనరులను కొల్లగొడుతూ పన్నులను ఎగ్గొడుతూ పచ్చని పంట పొలాలను నాశనం చేస్తున్న క్వారీ నిర్వాహకులను అరెస్టు చేసి వారిపై క్రిమినల్ కేసునమోదు చేయించాలన్నారు. అలాగే క్వారీ శాశ్వతంగా మూసివేయాలని వారి ద్వారా పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దేవరెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శివనుల శివ, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీరడి భాగ్య ఎన్ఎస్యూఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణు రాజ్, మండల కాంగ్రెస్ వేల్పూర్ అధ్యక్షులు నర్సారెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఫీ, జిల్లా జనరల్ సెక్రెటరీ దాము లింగరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed