బడా రామ్ మఠం భూముల కబ్జాపై కదిలిన యంత్రాంగం

by Naresh |
బడా రామ్ మఠం భూముల కబ్జాపై కదిలిన యంత్రాంగం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో ప్రసిద్ద బడా రాం మఠం (పెద్ద రామ్ మందిర్) కు చెందిన భూముల అన్యాక్రాంతం, కౌలు చెల్లింపులు, లీజుల లెక్కలు తారుమారు అయ్యాయి. మఠానికి రావాల్సిన సొత్తు గయాబ్ పై దేవాదాయ, ధర్మాదాయ శాఖ చర్యలకు ఉపక్రమించింది. ఎందుకంటే దశాబ్ధాలుగా వందల ఎకరాల్లో ఉన్న భూములు ఉండగా ప్రస్తుతం నిజామాబాద్ నగరంలోని పెద్దరాం మందిరంలో పూజలు నిర్వహించాలన్న ధూప దీప నైవేద్యాలకు కూడా చందాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఏళ్ల క్రితం కౌలు తీసుకున్న వారు కౌలు చెల్లింపులు నిలిపివేయగా కొందరు కౌలుదారులు చెల్లించాల్సిన సొమ్మును రామ్ మఠంలో అధికారులు మధ్యలో గయాబ్ చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇటీవల నిజామాబాద్ నగరంలోని 2వ టౌన్ పోలీస్ స్టేషన్‌లో బడారాంమఠంలో అధికారులమని చెప్పుకుంటున్న, వారు కౌలుతాలుకు సంబంధిత చెక్కులను దారి మళ్లించినట్లు గుర్తించారు. అంతేగాకుండా లీజు ముగిసిన భూములను విక్రయించేందుకు ఏర్పాటు చేస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో ఇద్దరు అధికారులకు పోలీసు శాఖ తాజాగా సోమవారం 41 సీఆర్‌పీ కింద నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. అయితే అధికారులమని చెప్పుకుని పెత్తనం చేలాయించిన వారిని ఎవరు నియమించారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అంతేగాకుండా ఏళ్ల తరబడి వారు అక్కడ తిష్ట వేసి భూములను స్వాహా చేయడంతో పాటు కౌలును మింగేయడం, హుండీ లెక్కలు తారుమారు చేశారనే ఆరోపణలు మూటగట్టుకున్నారు. నిజామాబాద్ నగరంలోని గాజుల్ పేట్‌లో గల పెద్ద రాంమందిర్‌, సారంగాపూర్‌లోని హనుమాన్ ఆలయాలు బడారాంమఠ్ అనుబంధంగా ఉన్నాయి.

మహారాష్ట్రలోని సజ్జన్ గడ్‌లో ఈ మఠం ప్రధాన కార్యాలయం ఉంది. చత్రపతి శివాజీ మహారాజ్ గురువు అయిన సమర్థ రామదాసు హయంలో ఈ మఠం ఏర్పడిందన్న చరిత్ర చెబుతుంది. అందులో భాగంగానే ఆలయానికి ఆనాడు ధూప దీప నైవేద్యాలకు కైంకర్యాల కోసం వందల ఎకరాల భూములను ఆనాడు దాతలు దానం చేసినట్లు చెబుతుంది. బడా రామ్ మఠంకు 480.6 ఎకరాల భూమి ఉండగా ఇందులో నిజామాబాద్ జిల్లాలో 213.10, ఆదిలాబాద్ జిల్లాలో 149.32, నాందేడ్ జిల్లాలో 117.4 ఎకరాల భూమి ఉంది. సంబంధిత భూమి వ్యవహరాలను మఠాధిపతులు పర్యవేక్షించేవారు. వారు కూడా దేవాదాయ శాఖ పరిధిలో ఉండి పెద్ద రామ్ మందిర్ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. నిజామాబాద్ నగర శివారులో నిజామాబాద్ రూరల్ మండలం, మోపాల్, నందిపేట్, రెంజల్, ఎడపల్లి మండలాల్లో అత్యధిక భూమి ఉండగా ప్రస్తుతానికి 38 ఎకరాలకు మాత్రమే కౌలుదారు ఉన్నట్లు రికార్డులున్నాయి. నిజామాబాద్ నగరంలో రామ్ మందిర్ మఠం పేరిట అక్కడ కొందరు తిష్టవేసి ఒక మాజీ కార్పొరేటర్(ప్రస్తుతం బీజేపీ లీడర్), మాజీ కార్పొరేటర్ భర్త (ప్రస్తుతం కాంగ్రెస్ నాయకుడు) దేవాదాయ భూములను కౌలు పేరిట చెరబట్టారు. వారితో పాటు కొందరు దివంగత పీఠాధిపతి భూములను అప్పజెప్పారని కబ్జాలో ఉన్నారు.

మరి కొందరు పరిశ్రమల పేరిట లీజుకు తీసుకుని అక్రమంగా అమ్మేసుకున్నారు. ఇటీవల తాజాగా రెవెన్యూ, దేవాదాయ శాఖలు సంయుక్తంగా సర్వే చేయడంతో భూముల కబ్జా వ్యవహరం వెలుగులోకి వచ్చింది. నగరంలోని పెద్ద రామ్ మందిర్, సారంగాపూర్ హనుమాన్ మందిరంకు సంబంధించిన భూముల తాలుకు కౌలు చెల్లింపు జరగడం లేదని వెలుగులోకి వచ్చింది. అయితే కౌలు తీసుకున్న వారు కౌలు చెల్లించడం లేదని తెలియడంతో దేవాదాయ శాఖ రంగంలోకి దిగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆలయం మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ అని చెప్పుకుంటున్న వారు కౌలు తాలుకు డబ్బులను రామ్ మఠం అకౌంట్‌లో జమ చేయకుండా అక్రమంగా డ్రా చేసుకున్నారని తేలింది. అంతేగాకుండా ఆలయ భూములను అమ్మేందుకు యత్నించారనే ఆరోపణలు వెలుగు చూశాయి. గత మఠాధిపతి అనారోగ్యంతో మరణించడంతో ఎవరికి అనుమానం రాకుండా కొత్త మఠాధిపతిని నియమించడంపై పలు ఆరోపణలు, వివాదాలు చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలోనే న్యాల్ కల్ రోడ్డులోని రామాలయం భూముల్లో అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఫిర్యాదులు రావడంతో సర్వే చేయడంతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఇద్దరు అధికారుల పేరిట భూముల క్రయవిక్రయాలతో పాటు ఖజానా కొల్లగొట్టేందుకు ప్రయత్నించి వ్యవహరంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బడారాంమఠ్ భూముల వ్యవహారం మరోసారి తెర మీదకు వచ్చింది. రెవెన్యూ, దేవాదాయ శాఖలు సంయుక్త సర్వే చేసి దేవాదాయ భూములను స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్ పెరిగింది.

Advertisement

Next Story

Most Viewed