నన్ను గెలిపించండి మీకోసం ఫైట్ చేస్తా

by Sridhar Babu |
నన్ను గెలిపించండి మీకోసం ఫైట్ చేస్తా
X

దిశ, భీంగల్ : ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో బీఆర్ఎస్ విజయం సునాయసమని, ఈ ఎన్నికల్లో తనని గెలిపిస్తే ప్రజల కోసం పార్లమెంట్ లో ఫైట్ చేస్తానని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. శనివారం వేల్పూర్ మండల కేంద్రంలోని శ్రీరామాలయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తో కలిసి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం వేల్పూర్ లో పాదయాత్ర నిర్వహించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తదనంతరం మండలంలోని లక్కోరాలో ఏఎన్జీ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన వేల్పూర్ మండల పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికలకు ఇంకా 40 రోజుల సమయం ఉందని,

ప్రతి రోజూ రెండు గంటలు ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్, బీజేపీల ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించి మీరు కష్టపడి గెలిపిస్తే ఐదేళ్లు మీకు అండగా ఉంటానన్నారు. తనని గెలిపిస్తే పార్లమెంట్ కు ఢిల్లీ కి లేదంటే గల్లీలో మీ వెంటే అని అన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలను గత ఎన్నికల్లో ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఒక్కటి కూడా అమలు చేయలేదని, పసుపు బోర్డు ఐదు రోజుల్లో తెస్తానని అబద్దపు మాటలు చెప్పి గెలిచిన ఎంపీ అరవింద్ పసుపు బోర్డు తేకపోగా మళ్లీ మోడీ కాళ్లుమొక్కి ఉట్టిట్టి ప్రకటన చేయించి ప్రజలను, రైతులను మోసం చెయ్యాలని చూస్తున్నాడని ఆరోపించారు. ఈ జూట, దగాకోరు కాంగ్రెస్, బీజేపీ నాయకులను ప్రజలు అవకాశం ఇచ్చి చూశారని, ఇక వారిద్దరి తోడు దొంగల పని అయిపోయిందన్నారు. ప్రజలు నోటికి వచ్చిన వాగ్దానాలను చేసిన రేవంత్ రెడ్డిని సీఎం ను చేసి, అన్ని వర్గాలకు సమానంగా సంక్షేమ పథకాలు అందజేసిన కేసీఆర్ ను పక్కన పెట్టారన్నారు.

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల, సీఎం పని తీరును మూడు నెలల్లో ప్రజలు తెలుసుకున్నారని అన్నారు. అబద్దాలు చెప్పి గెలిచిన ఎంపీ అరవింద్, వాళ్ల నాన్న ఎన్నడూ రాముణ్ణి తల్వనోళ్లు ఇవాళ ఎన్నికల్లో లబ్ది కోసం రామ జపం చేస్తున్నారని ఆరోపించారు. ఎంపీ గా గెలిచి ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని అన్నారు. మొన్న పొలాస వెళ్లి ఇక్కడ ఎంపీ ఎవరమ్మా అని ఓ మహిళను అడిగితే ఎవరో తెలియదు ఆయన ఎట్లా ఉంటాడో తెలియదని చెప్పింది అన్నారు. ఇక కాంగ్రెస్, బీజేపీ ల దుకాణం ఖతం అయ్యిందని పేర్కొన్నారు. కోరుట్ల, జగిత్యాల ప్రాంతం నుండి లక్షకు పైగా మనకు ఓట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు తాను ప్రతిపక్షంలో ఉండి పోరాడానని, తనకు రాజకీయ భిక్ష పెట్టింది ఆర్మూర్ ప్రాంతామేనన్నారు. తనకు రాజకీయంగా గుర్తింపు ఇచ్చిన వైఎస్సార్ మరణించిన తర్వాత ఒరిజినల్ కాంగ్రెస్ ఖతం అయిందని, ఇప్పుడున్న కాంగ్రెస్ డుబ్లికేట్ అని అన్నారు.

ప్రతిపక్షంలో ఉన్న వారిని జైళ్లకు పంపడమే బీజేపీ, కాంగ్రెస్ ల అభిమతమని, ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనం ప్రజల్లోకి వెళ్లి అన్ని విషయాలు వివరిస్తే గెలుపు సులభం, సునాయసమని గోవర్ధన్ ఉద్బోదించారు. అనంతరం మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ అబద్దపు హామీలను ఇచ్చి, వాటి అమలుకు 100 రోజుల గడువు తీసుకొని ఒక్క హామీని కుడా సీఎం రేవంత్ రెడ్డి తీర్చలేకపోయారన్నారు. రైతులకు ఇస్తామన్నా రైతు భరోసా, బోనస్, గృహలక్ష్మి, మహాలక్ష్మి, నిరుద్యోగ భృతి ఇలా 420 హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.

ఈ విషయాలన్నీ ప్రతి గ్రామంలో ఇంటింటికీ తిరిగి చెప్పాలని ఆయన కార్యకర్తలు, నాయకులకు సూచించారు. హామీల విషయంలో అప్పటి పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎన్నికల్లో మాట్లాడిన మాటలు, ఇచ్చిన హామీలకు సంబంధించిన వీడియోలను ప్రశాంత్ రెడ్డి పవర్ పెయింట్ ప్రజెంటేషన్ ద్వారా వ్యూజివల్స్ చూపిస్తూ నాయకులకు, కార్యకర్తలకు వివరించారు. ఈ వీడియోలు మొబైల్స్ లో ఉంచుకొని ప్రచారంలో ఇంటింటికీ చూపించి వివరించాలని కోరారు. అధికారం పోయిందని ఆందోళన చెందవద్దని, కలిసికట్టుగా ప్రజావ్యతిరేక ప్రభుత్వ విధానాలను ప్రజలకు చెప్పి మెప్పించాలని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ మెంబెర్ కె.సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, జెడ్పి చైర్మన్ దదన్నగారి విట్టల్ రావు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story