ఆర్మూర్‌‌లో భారీగా డబ్బు పంచుతున్న ప్రధాన పార్టీ అభ్యర్థులు

by Mahesh |
ఆర్మూర్‌‌లో భారీగా డబ్బు పంచుతున్న ప్రధాన పార్టీ అభ్యర్థులు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం గా సాగుతుంది. ఎన్నికలకు మరో 12 రోజులు సమయం మాత్రం ఉండటంతో బరిలో నిలుచున్న అభ్యర్థులు ఓటర్ దేవుళ్లను మెప్పించేందుకు అపసోపాలు పడుతున్నారు. ఐదు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే ఎమ్మెల్యే అభ్యర్థులు ఖర్చు చేసే అవకాశం ఉండటంతో వారు గెలుపు కోసం డబ్బును మంచి నీళ్ళలా ఖర్చు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో 9 నియోజకవర్గాల్లో ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో ఎలక్షన్ కోడ్ వచ్చిన నాటి నుంచే కాసుల పంపిణీ జోరుగా సాగుతోంది. ఓ ప్రధాన పార్టీకి చెందిన నేత ఈసారి ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలని తాయిలాల పంపిణీకి తెరలేపారు. ప్రజాప్రతినిధులు అయితే తులం బంగారం, మహిళా ప్రజాప్రతినిధులైతే తులం బంగారంతో పాటు పట్టు చీరల పంపిణీ పూర్తి చేశారు.

ఇక ప్రజాప్రతినిధులకు మొదటి విడతనే రూ.50 వేలు మొదలుకొని రూ.2 లక్షల వరకు పంపిణీ చేసినట్లు సమాచారం. పండుగలకు మేకలు కోసుడు, దావత్ లు ఇవ్వడం పరిపాటిగా మారింది. తాజాగా పది గ్రాముల బంగారం పంపిణీతో పాటు నగదు పంపిణీ వ్యవహరం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. చోటామోటా లీడర్లను పట్టించుకోవడం లేదని నాయకులు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. మొన్నటి దసరా పండుగ వరకే రూ.10 కోట్ల వరకు కానుకలకే ఖర్చు చేసిన ఆ నేత ఎన్నికల సమయం ముంచుకొస్తున్న వేళ తాయిలాల పంపిణీ డోస్ పెంచినట్లు తెలిసింది. ఈ వ్యవహారం ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లడంతో ప్రజాప్రతినిధులు పార్టీ లీడర్లకే బంగారం, తాయిలాలు పంపిణీ చేస్తారా? మాకేవి అంటూ ప్రశ్నిస్తున్నారని చిన్నస్థాయి లీడర్లు వాపోతున్నారు. తాజాగా నియోజకవర్గంలో ఓటర్లకు చీరల పంపిణీ జోరుగా సాగుతోంది. రాత్రి అయితే చాలా ఇళ్లలోకి కార్యకర్తలు వచ్చి నేరుగా చీరల పంపిణీ చేస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా బంగారం, నగదు పంపిణీ తమకు ఈసారి ఎక్కువగా వస్తుందన్న చర్చ ఓటర్లలో మొదలైంది. అసలే ఆర్మూర్ నియోజకవర్గంలో ముక్కోణపు పోటీ నెలకొనగా ఒక పార్టీ నేత పంపిణీ వ్యవహరం మిగిలిన రెండు పార్టీలకు తలనొప్పిగా మారిందనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆ ఎమ్మెల్యే అభ్యర్థి అందిస్తున్న తాయిలాల డోస్ ను తాము అందుకుంటామో లేదోనని అది ఎక్కడ ఓటింగ్ పై ప్రభావం చూపుతుందోనని లీడర్లు అనుమానిస్తున్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో జరుగుతున్న తాయిలాల పంపిణీపై ఇప్పటి వరకు ఎన్నికల అధికారుల వద్ద ఎలాంటి ఫిర్యాదు లేకపోవడం విశేషం. కానీ నియోజకవర్గంలో జరుగుతున్న బంగారం, నగదు పంపిణీ వ్యవహరం ఇతర నియోజకవర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఉప ఎన్నికలను తలపించేలా అభ్యర్థులు గెలిచేందుకు కసరత్తు చేస్తుండడంతో ఎమ్మెల్యే పదవితో ఎంత మేరకు వెనకేసుకుంటారని చర్చ మొదలైంది.

ఓట్లకు ముందే తాయిలాల పంపిణీ వ్యవహరం ఖరీదుగా మారడంతో ఈనెల 30న జరిగే పోలింగ్ నాటికి అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థుల చేతి చమురు చాలానే వదిలేలా ఉందని ఆ సొంత పార్టీ నేతలు కూడా చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆ నియోజకవర్గంలో జరుగుతున్న తాయిలాల పంపిణీతో గెలిచిన అభ్యర్థి సంగతి ఏమో కానీ ఓడే అభ్యర్థులకు మాత్రం దివాలా తీయడం ఖాయమంటున్నారు. అక్కడి ఓటర్లు. తాయిలాలకు ఓటర్లు ఓటు వేస్తారా లేక తమ సొంత అభిప్రాయాలకు అవకాశం ఇచ్చి ఓట్లు వేస్తారా అన్నది తెలియకపోయినా జరుగుతున్న కాసుల పంపిణీపై మాత్రం ఇప్పటికి అభ్యర్థుల్లో దడ కొనసాగుతునే ఉంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇస్తున్న తాయిలాలు సరే కానీ ఆ రోజు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓట్లు వేస్తారా లేదా అన్న సంశయంలోనే అభ్యర్థుల ఉన్నారు. తాయిలాల పంపిణీ సంగతి ప్రజల్లోకి చేరడంతో అక్కడ ఈసారి ఓటర్ ఎవరికి ఓటు వేస్తారని నిర్ణయం పై మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed