టీపీసీసీ ప్రెసిడెంట్ కు ఘనంగా స్వాగతం పలుకుదాం.. ఎమ్మెల్యే

by Sumithra |
టీపీసీసీ ప్రెసిడెంట్ కు ఘనంగా స్వాగతం పలుకుదాం.. ఎమ్మెల్యే
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత అక్టోబర్ 4 న తొలిసారిగా జిల్లాకు రానున్న బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ కు భారీ స్వాగతాన్ని పలకాలని, గుర్తుండిపోయేలా స్వాగత సత్కార కార్యక్రమం ఉండాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. జిల్లా వాస్తవ్యుడు, సీనియర్ నాయకుడు మహేశ్ గౌడ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కావడం మన అందరికీ గర్వకారణమన్నారు. ఆయనకు ఘనంగా స్వాగతం పలకాలని ఆయన పిలుపునిచ్చారు.

రాష్ట్ర రాజకీయాల్లో ఆది నుంచి మన జిల్లాకు అత్యంత ప్రాధాన్యత దక్కుతూ వస్తోందని, ఈసారి ఏకంగా టీపీసీసీ అధ్యక్ష పదవి మన జిల్లానే వరించడం మనందరం గర్వపడే విషయమన్నారు. ఓ కార్యకర్త స్థాయి నుంచి పార్టీ ఉన్నత పదవి వరకు ఎదిగిన మహేశ్ గౌడ్ క్రమశిక్షణను, పార్టీ పట్ల ఆయనకున్న విధేయతను, కమిట్ మెంట్ ను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరముందని భూపతిరెడ్డి అన్నారు. పార్టీని నమ్ముకుని విధేయతగా ఉన్న సాధారణ కార్యకర్తను కూడా పార్టీ గుర్తించి గౌరవిస్తుందన్న నమ్మకం పార్టీలో ప్రతి ఒక్కరికి కలిగిందని భూపతిరెడ్డి అన్నారు. కష్టపడ్డ వారికి పార్టీలో ఎప్పటికీ గుర్తింపు ఉంటుందన్నారు.

మహేశ్ గౌడ్ పడ్డ కష్టానికి దక్కిన గౌరవమే టీపీసీసీ అధ్యక్ష పదవి అని ఆయనన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జిల్లాకు రానున్న సందర్భంగా నిర్వహించనున్న అభినందన సభను కాంగ్రెస్ శ్రేణులు విజయవంతం చేయాలని భూపతి రెడ్డి కోరారు. నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యులు ప్రత్యేక చొరవ వహించి ప్రతి నియోజకవర్గ నుండి అధిక సంఖ్యలో కార్యకర్తలను సభకు హాజరయ్యేలా చూడాలని, కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని పార్టీ శ్రేణులనుఎమ్మల్యే కోరారు. మనం నిర్వహించే ఈ సభ ద్వారా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలాన్ని ప్రత్యర్థి పార్టీలకు చూపించాల్సిన అవసరముందన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నిలిచిపోయే విధంగా అక్టోబర్ 4న జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, దీని కోసం ప్రతి ఒక్కరు తీవ్రంగా శ్రమించాలని భూపతిరెడ్డి సూచించారు.

భవిష్యత్తులో మహిళలకు కాంగ్రెస్ పార్టీ పెద్ద పీట వేయనుందన్నారు. రాబోయే రోజుల్లో పార్టీలో మహిళా నేతలకే మహదావకాశాలు వచ్చే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ పార్టీయేనని అన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ పని ఖతమైందన్నారు. ఆ పార్టీది ముగిసిన అధ్యాయమన్నారు. 50 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ప్రజలకు సుదీర్ఘ కాలం సేవలందించిన ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ ను సమావేశంలో ఘనంగా సన్మానించారు. ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జి వినయ్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి సునీల్ కుమార్ రెడ్డి, పీసీసీ కార్యదర్శి గడుగు గంగాధర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాసుల బాలరాజు, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేశ వేణు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరాల రత్నాకర్, ముప్పా గంగారెడ్డితదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed