'బీసీ డిక్లరేషన్ ను అమలు చేయాలి..'

by Sumithra |
బీసీ డిక్లరేషన్ ను అమలు చేయాలి..
X

దిశ, ఆలూర్ : శాసనసభ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేయాలని బీజేపీ ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బండారి యాదగిరి, మల్లయ్య, డాక్టర్ అరుణ్ ఆలూర్ మండల తహశీల్దార్ రమేష్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యామాద్రి భాస్కర్ మాట్లాడుతూ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించి 28 శాతం ఉన్న బీసీల రిజర్వేషన్ ను 42 శాతం చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి విస్మరించారన్నారు. బీసీ కమిషన్ కు తాను కలిసి జనాభా ధమాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరినట్లు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెట్ లో రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని ప్రకటించి మోసం చేశారన్నారు. ఈ లెక్కన ఐదు సంవత్సరాలకు లక్ష కోట్లు బీసీలకు కేటాయించాల్సి ఉందన్నారు.

బీసీలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేసినందున వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు తగిన గుణపాఠం నేర్పించాలన్నారు. 10 సంవత్సరాల కాలంలో బీసీల గురించి మాట్లాడని ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికారం కోల్పోయిన తర్వాత మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ కవితకు సోయి లేదా అని ప్రశ్నించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు జనాభా మేరకు రిజర్వేషన్లు ప్రకటించనట్లయితే ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని గద్దెనెక్కి మోసం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండారి దేగాం యాదగిరి, ఆలూర్ ఒబీసీ ఆలూర్ మండలం అధ్యక్షులు నాడీశరం మల్లయ్య, డాక్టర్ అరుణ్, ప్రణయ్ తేజ్, మనీష్, సుభాష్, నవీన్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story