కామారెడ్డిలో రేపు కేసీఆర్ నామినేషన్

by Sridhar Babu |   ( Updated:2023-11-08 16:20:58.0  )
కామారెడ్డిలో రేపు కేసీఆర్ నామినేషన్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కామారెడ్డి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. సీఎం కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో పోటీ చేయనున్న విషయం తెల్సిందే. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆయన మున్సిపల్ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్ నామినేషన్ దాఖలు చేసిన తర్వాత కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ కళాశాల గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి ఇప్పటికే అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నిజామాబాద్ అర్బన్ స్థానం నుంచి మాజీ మంత్రి షబ్బీర్ అలీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్

కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. ఎలాంటి ర్యాలీ లేకుండానే తన నామినేషన్ పత్రాలను సమర్పించే ఏర్పాట్లు చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. దానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో అభ్యర్థులు నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ నెల 10న రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కామారెడ్డిలో తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. బుధవారం రేవంత్ రెడ్డి కి సంబంధించిన మొదటి సెట్ నామినేషన్ ను మాజీ మంత్రి షబ్బీర్ అలీ దాఖలు చేశారు. టీపీసీసీ ఐటీ సెల్ చైర్మన్ కల్వకుంట్ల మధన్ మోహన్ రావు ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో నామినేషన్ దాఖలు చేశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీజేపీ నేత పైడి రాకేష్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయగా ఆయన వెంట కేంద్ర సహాయ మంత్రి పాల్గొన్నారు. బాల్కొండ బీజేపీ అభ్యర్థి గా ఏలేటి అన్నపూర్ణమ్మ భీంగల్ మున్సిపాలిటీలో నామినేషన్ దాఖలు చేయగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు.

Also Read..

ఎమ్మెల్సీ కవిత జైలుకెళ్లడాన్ని ఎవరూ ఆపలేరు: కేంద్ర మంత్రి చౌబే సెన్సేషనల్ కామెంట్స్

Advertisement

Next Story