మత సామరస్యానికి ప్రతీక కామారెడ్డి : జిల్లా కలెక్టర్

by Kalyani |
మత సామరస్యానికి ప్రతీక కామారెడ్డి : జిల్లా కలెక్టర్
X

దిశ, కామారెడ్డి : మత సామరస్యానికి ప్రతీక కామారెడ్డి జిల్లా అని, ఇక్కడి ప్రజలు కుల, మతాలకతీతంగా సుహృద్భావ వాతావరణంలో పండుగలు జరుపుకునే సంప్రదాయం ఎంతో సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా గురువారం కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశంలో ఎస్పీ సింధు శర్మ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 17న బక్రీద్ పండుగ సందర్భంగా ప్రార్థన స్థలాలు, వధశాలల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు బ్లీచింగ్ పౌడర్ చల్లాలని మున్సిపల్ కమిషనర్లను, జిల్లా పంచాయతీ అధికారులకు సూచించారు.

నిబంధనలకు లోబడి పశువుల రవాణా జరిగేలా చూడాలని, అక్రమంగా పశువులను తరలిస్తున్నట్లు తమ దృష్టికి వస్తే ఆ సమాచారాన్ని పోలీసులకు చేరవేయాలని యువతకు సూచించారు. రెవెన్యూ, పోలీస్, రవాణా శాఖలకు చెందిన అధికారులు నిరంతరం నిఘా ఉండేలా పర్యవేక్షణ చేయాలన్నారు. నిబంధలకు విరుద్ధంగా వివిధ వాహనాల్లో పశువులను తరలిస్తే వెంటనే సీజ్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పశు వైద్యాధికారులు ధ్రువీకరించిన వాటినే నిర్థారించిన ప్రాంతాల్లో పశువధ జరపాలన్నారు. వ్యర్థ పదార్థాలను వధశాల నుండి డంప్ యార్డ్ కు తరలించుటకు సానిటరీ ఇన్స్పెక్టర్ల ద్వారా అవసరమైన ప్లాస్టిక్ బ్యాగు అందించాలని కలెక్టర్ తెలిపారు.

డంప్ యార్డుల వద్ద గుంత తీసి వ్యర్థాలను పూడ్చాలని, లేకుంటే దుర్వాసనతో పాటు రోగాలు వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. ఈ నెల 17 నుంచి 19 వరకు ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే బక్రీద్ పండుగకు విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, మంచినీటిని సక్రమంగా సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే అసాంఘిక శక్తుల పట్ల, అసత్య వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హితవు చెప్పారు. ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ...పశువుల అక్రమ రవాణాకు అరికట్టుటకు 5 చెక్ పోస్టుల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు.

నిబంధనలకు లోబడి వాహనాల్లో పశువులను తరలిస్తున్నారా? ఓవర్ లోడ్ తో వెలుతున్నాయా తనిఖీ చేయాలన్నారు. అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తిస్తే పోలీసులకు సమాచారమందించాలని, వాహనాలను అడ్డగించరాదని సంఘాలకు, యువకులకు సూచించారు. సంతల వద్దే పశువులను పరిశీలించి సర్టిఫికెట్ ఇవ్వాలని పశువైద్యాధికారుల కు సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ నరసింహ రెడ్డి, ఆర్డీఓలు రంగనాథ రావు, రమేష్ రాథోడ్, జిల్లా పశుసంవర్ధక అధికారి సింహ రావు, డిపిఓ శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ ఈ డి దయానంద్, డిఎస్పీలు, మున్సిపల్ అధికారులు, వివిధ కమ్యూనిటీ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed