దారుణం.. మహిళను సజీవదహనం చేసిన గ్రామస్తులు

by Rani Yarlagadda |   ( Updated:2024-10-04 04:00:36.0  )
దారుణం.. మహిళను సజీవదహనం చేసిన గ్రామస్తులు
X

దిశ, వెబ్ డెస్క్: గ్రామంలో క్షుద్రపూజలు, ఇతర మంత్రాలు చదువుతూ కనిపించినవారిని గ్రామస్తులు తీవ్రంగా కొట్టి చిత్రహింసలు పెడుతున్నారు. వారు అలాంటి పనులు చేశారో లేదో నిర్థారించుకోకుండానే ప్రాణాలు తీసేస్తున్నారు. తాజాగా మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాలలో ఇదే తరహా ఘటన జరిగింది. మంత్రాలు చదువుతుందన్న నెపంతో మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించారు గ్రామస్తులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ద్యాగల ముత్తవ్వ అనే మహిళ గ్రామంలో ఏవేవో మాట్లాడుకుంటూ తిరిగేది. ఆమె ఏవో మంత్రాలు చదువుతోందని అనుమానించిన గ్రామస్తులు గురువారం (అక్టోబర్ 4) రాత్రి ఇంట్లో ఉండగానే ఆమెపై దాడి చేశారు.

మంత్రాలు చదువుతూ కీడు చేయాలని చూస్తోందంటూ.. మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించగా.. ఆ మంటలకు ఆమె బిగ్గరగా కేకలు పెట్టింది. తమపై కూడా దాడి చేస్తారన్న భయంతో కొడుకు, కోడలు అక్కడి నుంచి పరారయ్యారు. మహిళ అరుపులు విన్న కొందరు అక్కడికి చేరి మంటలను ఆర్పి రక్షించాలని ప్రయత్నించారు. కానీ.. గ్రామస్తులు వారిని అడ్డుకోవడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. కానీ దారిమధ్యలోనే మహిళ మృతి చెందింది. దాంతో మృతదేహాన్ని రామాయంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ముగ్గురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

Advertisement

Next Story