నన్ను మళ్లీ దీవించండి ..నేను మీ కోసమే పనిచేసే మీ జీవన్ రెడ్డిని

by samatah |   ( Updated:2023-04-04 08:24:49.0  )
నన్ను మళ్లీ దీవించండి ..నేను మీ కోసమే పనిచేసే మీ జీవన్ రెడ్డిని
X

దిశ, ఆర్మూర్ : నిరంతరం ప్రజాసేవకే పునరంకితమైన నన్ను మళ్లీ దీవించండి నేను మీ కోసమే పని చేసే మీ జీవన్ రెడ్డిని అని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అర్ధించారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో మంగళవారం "నమస్తే చేపూర్ . .మీ కోసం మీ జీవన్ రెడ్డిని " అనే కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి చేపూర్ గ్రామానికి చేరుకున్న జీవన్ రెడ్డికి ఆ గ్రామ ప్రజలంతా మేళ తాళ్లాలతో అపూర్వ స్వాగతం పలికారు. మహిళలు పెద్ద ఎత్తునతరలి వచ్చి మంగళ హారతులు పట్టి జీవన్ రెడ్డి నుదుట తిలకం దిద్ది ఆశీస్సులు అందజేశారు. పూలమాలలు, శాలువాలతో ప్రజా ప్రతినిధులు, వీడీసీ, కుల సంఘాల సభ్యులు సత్కరించారు.

ఈ సందర్భంగా చేపూర్ గ్రామ ప్రజలంతా ముక్త కంఠంతో "జై కేసీఆర్, దేశ్ కీనేత కేసీఆర్, జై జీవనన్న" అన్న నినాదాలతో మారు మోగించారు. కాగా, జీవన్ రెడ్డి ప్రజలతో కలిసి గ్రామమంతా కలియ తిరుగుతూ ప్రతి ఒక్కరినీ పేరు పేరున పలకరించి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు . అనంతరం చేపూర్ గ్రామంలో జరిగిన భారీ సభలో జీవన్ రెడ్డి తనదైన శైలిలో ప్రసంగించి చేపూర్ గ్రామ ప్రజల మనసు దోచుకున్నారు.

"నేను మీ కోసమే పనిచేసే మీ జీవన్ రెడ్డిని. నేను మీ బిడ్డను. నా జీవితం ప్రజాసేవకే అంకితం. ఆర్మూర్ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెడ్ల లా పరుగులు పెట్టిస్తున్నా. ప్రగతి పథంలో ఆర్మూర్ పేరును చరిత్రలోనే చెరగని పేజీలా సువర్ణాక్షరాలతో లిఖిస్తా అని జీవన్ రెడ్డి చెప్పారు. ఆర్మూర్ నియోజకవర్గం గతంలో ఎట్లుంది? ఇప్పుడెట్లుంది?అభివృద్ధి జరగని పల్లె ఉందా? సంక్షేమ పథకాలు అందని ఇల్లు ఉందా? సీఎం కేసీఆర్ ప్రజల పాలిట దేవుడన్నారు. తెలంగాణ వస్తే ఏమొస్తదని చేపూర్ చౌరస్తాలో నిలబడి కూతలు కూసిన సన్నాసులకు చేపూర్ గ్రామంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమమే ధీటైన సమాధానం అన్నారు.

చేపూర్ గ్రామమంటే నాకు సెంటిమెంట్ అని,ఎనిమిదేళ్లుగా జరుగుతున్నఅభివృద్ధి పనులతో చేపూర్ రూపురేఖలే మారిపోయాయి అన్నారు.గతంలో ఎప్పుడైనా ఈ అభివృద్ధి చూసారా? ఈ గ్రామంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, చేయాల్సిన పనుల గురించి చెప్పడానికే నేనొచ్చా నని జీవన్ రెడ్డి చెప్పారు. చేపూర్ గ్రామంలో ప్రజలందరికీ అందుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను పథకాల వారీగా, గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను సంఘాల వారీగా జీవన్ రెడ్డి వివరించారు.

Advertisement

Next Story