‘ముప్పు తప్పదా...?..ఆ కంపెనీలో పని చేయడం మా వల్ల కాదు’

by Aamani |
‘ముప్పు తప్పదా...?..ఆ కంపెనీలో పని చేయడం మా వల్ల కాదు’
X

దిశ, భిక్కనూరు : భరించలేని విధంగా దుర్వాసన... ఆ కెమికల్ చేతులకు అంటితే, సబ్బు పెట్టి ఎన్నిసార్లు చేతులు కడుక్కున్న,స్నానం చేసి వచ్చినా,స్మెల్ మాత్రం పోవడం లేదంటూ ఫార్మా కంపెనీలో పని చేస్తున్న లేబర్ లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బయట పనులు దొరకక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఫార్మా కంపెనీలో పని చేస్తే అనారోగ్య సమస్యలతో పాటు, ముఖ్యంగా మగతనానికి దూరమవ్వాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రం లో ఉన్న ఎం ఎస్ ఎన్ ఫార్మా కంపెనీలో, దసరా పండుగ నాడు ప్రారంభించిన సీ బ్లాక్ తోనే ముప్పు పొంచి ఉందన్న భయం వారిలో వ్యక్తమవుతోంది.

కంపెనీలో ఆ బ్లాక్ ప్రారంభమైన నాటి నుంచి ప్రతిరోజు వాయు కాలుష్యం పెరిగిపోవడం వలన చాలామంది లేబర్ లు ఆ కంపెనీలో పని చేయడం మా వల్ల కాదంటూ పని మానేసుకుని వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన వారికి ఏండ్లు గడుస్తున్నా సంతానం కలగకపోవడం, శృంగారం పై మోజు తగ్గుతుండటం వంటి సమస్యలతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ బ్లాక్ ప్రారంభానికి ముందు పెద్దగా దుర్వాసన వచ్చేది కాదని, సీ బ్లాక్ పని ప్రారంభించిన రోజు నుంచే వాసన రావడం మొదలైందని చెబుతున్నారు. నెల రెండు నెలలు కూడా గడవక ముందే వాసన భరించలేక పని మానేసి మధ్యలో వెళ్లిపోతున్నారు. అంతేకాకుండా చర్మ వ్యాధులు, శ్వాస కోస వ్యాధులతో బాధపడుతూ స్థానికంగా ఉన్న ఆసుపత్రుల్లో చేరుతున్నారు.

ఆ యూనిట్ ను ఇక్కడ ప్రారంభిస్తారా ....?

ఎడారి ప్రాంతంలో ప్రారంభించాల్సిన ఆ యూనిట్ ను జనసంచారం ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో నిర్మించడం పట్ల ఫార్మా కంపెనీ యాజమాన్యం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనావాసాలకు దూరంగా ఉండాల్సిన ఈ యూనిట్ ను, ఈ ఫార్మా కంపెనీలో ప్రారంభించేందుకు అనుమతులు ఎలా ఇచ్చారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ కంపెనీ వెదజల్లుతున్న వాయు కాలుష్యం వల్ల చుట్టుపక్కల ఐదు ఆరు కిలోమీటర్ల దూరం భరించలేని విధంగా స్మెల్ వస్తుంది. ముఖ్యంగా రాత్రి వేళలో ఈ వాసన రావడంతో ముక్కు మూసుకోవల్సిన పరిస్థితి తలెత్తింది.

వారికి నో ఎంట్రీ...

కంపెనీలో పని చేసేందుకు వచ్చేవారిలో యూత్ కు నో ఎంట్రీ అని, పెళ్లి అయిన వారు, వయస్సు పైబడిన వారికి మాత్రమే కంపెనీలో పని కల్పిస్తామని కంపెనీ సిబ్బంది చెబుతోంది. అయితే కొందరు ఉపాధి ఎక్కడ దొరకక, పలుకుబడిని ఉపయోగించి పైరవీ చేసి పనిలో చేరుతున్నప్పటికీ, చేరిన కొద్ది రోజులకే పని మానేసి వెనక్కి వచ్చేస్తున్నారు.ముఖ్యంగా ఈ కంపెనీలో ఉద్యోగం సంపాదించడానికి ముందు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నవారు, కంపెనీలో ఉద్యోగం పొందాక, శరీరంలోని భాగాలు ఒక్కొక్కటిగా దెబ్బ తింటున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed