Induru : ఇందూరు ఊరంతా పండగ..

by Kalyani |
Induru : ఇందూరు ఊరంతా పండగ..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : హైదరాబాద్ లష్కర్ బోనాలు.. ఇందూరులో ఊరపండగ..ఈ రెండూ దేనికవే ప్రత్యేకత. నిజామాబాద్ నగరం అణువణువునా పండగ శోభను సంతరించుకుంది. ఊర పండగ కోసం సర్వసమాజ్ సర్వం సిద్ధం చేసింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే వడ్ల దాతి నుంచి అమ్మ వాళ్ళ విగ్రహాలు తేలు మైసమ్మ గద్దెవద్దకు చేరుకుంటాయి. వతన్ దార్లు అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు తల్లుల ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్తారు. పోతరాజు విన్యాసాల మధ్య శోభయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. వర్షాకాలంలో అంటు వ్యాధుల నుండి ప్రజలను, పశువులు, పాడి పంటలను కంటికి రెప్పలా కాపడాలని వేడుకుంటూ పండగను జరుపుకుంటారు. గ్రామదేవతలకు కల్లు సాకలు పోసి, కుల సంఘాల సమక్షంలో యాటలను బలిస్తారు. ఇందూరు వాసులు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సాంప్రదాయ బద్ధంగా ఈ వేడుకలో పాలుపంచుకుంటారు.

తొట్లెల తయారీ..

ఊర పండగలో అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన తొట్టెలు చాలా ముఖ్యమైనవి. వీటిని ఒకరోజు ముందుగానే శనివారం రాత్రి 11 గంటల నుంచి ఆదివారం ఉదయం 7 గంటల వరకు హమాలీ చాట కార్మిక సంఘం ఆధ్వర్యంలో కొత్తగంజిలో తయారుచేస్తారు. ఉదయం 5 గంటల వరకు శారదాంబ గద్దె, తేలు మైసమ్మ గద్దె వద్ద ఉంచుతారు. ఊరేగింపులో మొదట తొట్లెలు ఊరేగుతాయి. కొండెంగ హన్మాండ్లు వద్ద వడ్ల దాతీయులు తయారు చేసే పెద్ద తొట్లె దేవత విగ్రహాలతో పాటు సిర్నపల్లి గుడికి చేరుకుంటుంది. అక్కడి నుంచి మహాలక్ష్మి అమ్మ వారి గుడికి చేరుకుంటుంది. ఊర పండగలో కీలకమైన బోనాలు శనివారం రాత్రి సిర్నపల్లి గడిలో నుండి 5 కడవలతో బయలుదేరతాయి. అందులో ఒకటి నల్ల పోచమ్మ మందిరం, దేవిమాత మందిరం, ఒకటి ఎల్లమ్మ గుట్టలోని పెద్ద పోచమ్మ గుడికి, కాంతాళమ్మ గుడికి, మరొకటి కోటగడ్డ మైసమ్మ గుడికి, మరొకటి అడెల్లి మైసమ్మ గుడికి కూడా ఒకటి వెళుతుంది..

శక్తిస్వరూపినులుగా గ్రామదేవతలు

అత్యంత మహిమగల మహా లక్ష్మి అమ్మా.. మమ్ము కాపాడవమ్మా ..అడెల్లి పోచమ్మ ఆదరించమ్మా.. సార్గమ్మా రోగాలు రాకుండా కాపాడమ్మా.. అంటూ భక్తిశ్రద్ధలతో ప్రజలు వేడుకుంటారు. ప్రతియేటా ఆషాడమాసంలో ఈ ఊరపండగను జరుపుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. నగరంలోని ఖిల్లా ప్రాంతం నుంచి దేవతా విగ్రహాలను ఊరేగించనున్నారు. ఊర పండగలో పవిత్ర ప్రసాదంగా భావించే సరిని నగరం నలుమూలల జల్లుతూ చెరువులో కలుపుతారు. ప్రత్యేకమైన కర్రతో తయారుచేసిన అమ్మవార్ల విగ్రహాల ఊరేగింపు నిర్వహిస్తారు. ఖిల్లా రఘునాథ ఆలయం వద్ద ఉన్న తేలు మైసమ్మ గద్దె, శారదాంబ గద్దే వద్ద అమ్మవార్లకు పసుపు కుంకుమ గులాలు పట్టు వస్త్రాలతో చెవి పోగులు గాజులతో నగర పెద్దలు అలంకరించి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచే వేడుకలను ప్రారంభిస్తారు.

అనంతరం దేవత మూర్తులతో శోభాయాత్రగా బయలుదేరి గాజుల పేట్ చౌరస్తా మీదుగా పెద్ద బజార్ చౌరస్తా వరకు చేరుకుంటారు. పెద్ద బజార్ చౌరస్తా నుంచి రెండు భాగాలుగా విడిపోయి డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, శివశక్తుల పూనకాలు మధ్య ఒక బృందం పోకాలమ్మ అడేల్లి పోచమ్మ, నల్ల పోచమ్మ, రాట్నం, తొట్లే లతో దుబ్బ వైపుగా వెళ్తుంది. రెండో బృందం సిర్నాపల్లి గడి, గోల్ హనుమాన్ చౌరస్తా, పూలన్ చౌరస్తా మీదిగా వినాయక్ నగర్ లోని ఐదు చేతుల పోచమ్మ, మత్తడి పోచమ్మ, మహాలక్ష్మమ్మ ఆలయాలకు తోట్లెలతో చేరుకుంటుంది.

నగరంలో దేవతల ఊరేగింపు కొనసాగి చౌరస్తాలలో ప్రజలు కుల సంఘాల ఆధ్వర్యంలో మేకలు గొర్రెలను కోళ్లను కొబ్బరికాయలు కొట్టి ఎదురొచ్చి బలిస్తూ కల్లు సాకలు పోస్తూ మొక్కులు తీర్చుకుంటారు. ప్రతి వీధిలోని మూడు తోవ్వల వద్ద జీవాలను బలిస్తారు. ఈ పండగ రోజు నాగర్వాసులెవరూ పొలిమేర దాటవద్దని అలా వెళ్తే అరిష్టమని ప్రజలు భావిస్తారు. దీనిని నగర ప్రజలు ఇప్పటికీ ఆచరిస్తూ విశ్వసించడం విశేషం. ప్రత్యేకంగా తయారు చేసిన పదార్థం " సరి "ని వెదురు కొత్త గుల్లలో వేసి నాలుగు భాగాలుగా విభజిస్తారు. వినాయకనగర్, ఎల్లమ్మ గుట్ట, దుబ్బ, కంటేశ్వర్ నాలుగు వైపులా జల్లుకుంటూ వెళ్తారు. ఈ సరి ని ప్రసాదంగా స్వీకరించేందుకు భక్తులు పోటీ పడుతుంటారు.

దశాబ్దాల నుంచి ఆనవాయితీగా..

1862-67 మధ్య కాలం నుంచి ఇందూరులో ఊర పండుగ ప్రారంభమైనట్లు పెద్దలు చెబుతారు. 83 ఏండ్ల క్రితం సిర్నాపల్లి సంస్థానాధీశురాలు శీలం జానకీబాయి నిధులు సమకూర్చి ఊర పండుగను ఘనంగా నిర్వహించడం ప్రారంభించారని చెపుతారు. అప్పట్లో గత్తర (ప్లేగు) వ్యాధి సోకడంతో ఎంతోమంది చనిపోయారని, గ్రామదేవతలను పూజిస్తే వ్యాధి నయమవుతుందని భావించి పండుగను నిర్వహించగా వ్యాధి పూర్తిగా నయమై ప్రజలకు ప్రాణాపాయం తప్పిందట. అప్పటి నుంచి ప్రతియేటా ఆషాఢమాసంలో ఈ ఊర పండగను జరుపుకునే ఆనవాయితీ ప్రారంభమైనట్లు చెప్పుకుంటారు.

సర్వ సమాజ్ కమిటీ ప్రధాన కార్యదర్శి బంటు రాజేశ్వర్, ఊర పండగ కన్వీనర్ రామ్మూర్తి గంగాధర్, కో కన్వీనర్ అదే ప్రవీణ్, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, కమిటీ కార్యదర్శి కిషన్ పట్వారి, అశోక్, భరత్ భూషణ్, భక్తవత్సలం శరత్ కుమార్, వినోద్ కుమార్ అంకిరెడ్డి సుదర్శన్ రెడ్డి,రాజు ఇతర కార్యవర్గ ఆధ్వర్యంలో ఈ పండగ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాం..

బంటు రాజేశ్వర్. సర్వ సమాజ్ ప్రధాన కార్యదర్శి..

నగరంలోని ప్రజలు నిబంధనలు పాటిస్తూ ఊర పండుగను జరుపుకో వాలి, పండగ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాం. పిల్లలు, పెద్దలు గొడ్డుగో అంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుళ్లకు బండారు పోసి పండుగను ప్రారంభించాం. ఇందురు లో పాడి పంటలు బాగా పండి ఎలాంటి రోగాలు రాకుండా ఉండాలని కోరుకుంటూ ఊర పండుగను ఘనంగా జరుపు తున్నాం. ప్రజలు సహకరించాలి.

Next Story