మత్స్యకారుల కుటుంబాల్లో సిరులు కురవాలి: మంత్రి పొన్నం

by karthikeya |
మత్స్యకారుల కుటుంబాల్లో సిరులు కురవాలి: మంత్రి పొన్నం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ జిల్లాల్లోని అన్ని చెరువుల్లో ఈ నెల 3వ తేదీ నుంచి చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ క్రమంలోనే అన్ని జిల్లాల్లో తెలంగాణ మత్యశాఖ తరుపున చేపల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. జిల్లాలో మంత్రులు, విప్‌లు, ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కార్పోరేషన్ చైర్మన్‌లు, ప్రభుత్వ సలహాదారులు అందరూ ఈ చేపల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని మంత్రి కోరారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తమ ప్రజాపాలనా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని, అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల్లో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టబోతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. చేప పిల్లల పంపిణీ కార్యక్రమం గ్రామాల్లో ఒక పండగ వాతావరణంలో జరగాలని, రైతులకు నాణ్యమైన చేపపిల్లలను అందించాలని అధికారులకు సూచించారు.

అన్ని చెరువులు, ప్రాజెక్ట్‌లు జలకళ సంతరించుకున్నాయని, ఈ దఫా చేప పిల్లల పంపిణీ మత్స్యకారుల కుటుంబాల్లో సిరులు కురిపిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే చేప పిల్లల పంపిణీ కార్యక్రమంకి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ఫిషరీస్ కార్పోరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, ఫిషరీస్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సబ్యసాచి ఘోష్ తో పాటు , డైరెక్టర్ ప్రియాంకలకు సూచించారు.

Next Story

Most Viewed