కాసులిస్తేనే పర్మిషన్లు.. లేదంటే చెప్పులరగాల్సిందే..

by Sumithra |
కాసులిస్తేనే పర్మిషన్లు.. లేదంటే చెప్పులరగాల్సిందే..
X

దిశ, కామారెడ్డి : ఏదైనా ప్రాపర్టీ అమ్మి.. ఆ డబ్బుతో ఒక కొత్త ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా.. అయితే అనుమతి కోసం కనీసం చేతిలో తక్కువలో తక్కువ రూ.10 లక్షలైనా ఉండాల్సిందే. ఇల్లు కట్టుకోవడానికి కాదండోయ్.. ఇంటి నిర్మాణానికి పర్మిషన్ కావాలంటే మధ్యలో అడ్డుపడే నాయకులకు మామూళ్లు ముట్టజెప్పడానికి..మామూళ్లు ఎందుకివ్వాలని అడిగే పొరపాటు చేశారో.. ఇక మీ ఇంటి నిర్మాణం పనులు ఇంచు కూడా ముందుకు జరగనట్టే.. ఈ తంతు ఎక్కడో మారుమూల గ్రామంలో జరుగుతుందనుకుంటే పొరపాటే సుమా.. ఏకంగా కామారెడ్డి మున్సిపాలిటీలో జరుగుతున్న బహిరంగ తతంగం ఇదంతా.. కామారెడ్డి మున్సిపాలిటీలో కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టాలంటే ఓ పెద్ద సమస్యగా మారుతోంది. ఇల్లు కట్టుకోవడానికి అనధికారికంగా రూల్స్ అడ్డొస్తున్నాయి.

ప్రభుత్వ నిబంధనలను దాటుకుని వెళితే మధ్యలో బ్రోకర్లు, మెయిన్ లీడర్లకు కొంత నగదు ముట్టజెప్పుకోవాల్సిన పరిస్థితులు కామారెడ్డి మున్సిపాలిటీలో దాపురించాయి. ఐదో పదో అంటే ఎలాగోలా ఇచ్చేయొచ్చు.. కానీ రూ.లక్షల్లో ముట్టజెప్పాలంటే నిలుచున్న చోటు భూమి కంపించినట్లు ఫీలవ్వాల్సి వస్తోందని బాధిత ఇంటి యజమానులు లబోదిబోమంటున్నారు. ఇంటి నిర్మాణం అంచనా విలువను బట్టి మామూలు రేటు నిర్ణయించడం ఇక్కడ లేటెస్ట్ ట్రెండ్ గా మారింది. అందుకే అందుకే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంగా మారిన తర్వాత జిల్లా కేంద్రంలో ఇల్లు కట్టుకోవడానికి చుట్టు పక్కల గ్రామాల వారు ఎక్కువ సంఖ్యలో ఆసక్తి చూపుతున్నారు. పిల్లల చదువులు, ఆరోగ్య పరిస్థితులతో అందుబాటులో వైద్యసేవలు అన్ని దృష్టిలో పెట్టుకుని కామారెడ్డిలో స్థిర నివాసం ఏర్పరుచుకునే ఆలోచనతో ఇంటి స్థలాలు కొని చాలా మంది ఇళ్లు నిర్మించుకుంటున్నారు.

ముడుపులు ముట్డజెప్పకుంటే చెప్పులరిగేలా తిరగాల్సిందే..

కామారెడ్డి మున్సిపాలిటీలో ఫైవ్ మెన్ కమిటీ అని కొత్తగా అవతరించింది. మున్సిపాలిటీ పరిధిలో ఏ సమస్య పరిష్కారం కావాలన్నా ఈ కమిటీ వద్దకు వెళ్లాల్సిందే. ఈ కమిటీ చెప్పిన రేటుకు ఇంటి యజమాని ఓకే అనుకుంటే ఆ పని అయిపోయినట్టే. ఇళ్ల నిర్మాణానికి కూడా ఈ కమిటీ ఫైనల్ రేట్ డిసైడ్ చేస్తుందన్న ప్రచారం ఉంది. కమిటీని కాదని వెళ్లాలంటే ప్రధాన నాయకుని వద్దకు వెళ్లాల్సిందే. అక్కడ ఫైనల్ గా చెప్పిన రేట్ ఇవ్వకపోతే ఇంటి అనుమతుల కోసం మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఇలా చెప్పులరిగేలా తిరిగి విసుగు చెంది ఏదైతే అదైందని నిర్మాణం చేపడితే అక్రమ కట్టడం అంటూ కొర్రీలు పెట్టి నిర్మాణంలో ఉన్న ఇళ్లను కూల్చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

వసూళ్లకు కాదేదీ అనర్హం..

కామారెడ్డి మున్సిపాలిటీలో వసూళ్ల పర్వం మూడు పువ్వులు .. ఆరు కాయలుగా కొనసాగుతుందన్న ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా ఇళ్ల నిర్మాణాల అనుమతులకు గిరాకీ బాగా ఉంటుందన్న టాక్ నడుస్తోంది. ఇల్లు కట్టుకునే వ్యక్తి ఏ స్థాయి వ్యక్తి అయినా, పలుకుబడి ఎంతున్నా ఇంటి నిర్మాణానికి ఎంతో కొంత ముట్టజెప్పాల్సిందేనని తెలుస్తోంది. మున్సిపాలిటీలో నాయకునిగా చలామణి అయిన సొంత పార్టీ నాయకుని వద్దే సుమారు రూ.20 లక్షలకు పైగా ఇస్తేనే ఇంటి నిర్మాణానికి అనుమతి ఇచ్చారంటే అక్రమ వసూళ్లు ఏ రేంజిలో ఉంటాయో ఇట్టే అర్థం అవుతోంది. మున్సిపాలిటీలో జరుగుతున్న ఈ నయా వసూళ్ల దందాపై ఉన్నతాధికారులు స్పందించి సామాన్య ప్రజల సొంతింటి కలను నిజం చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట వేసి నగరాభివృద్ధిలో భాగంగా కొత్తగా ఇళ్లు నిర్మించుకునే వారికి న్యాయంగా ప్రభుత్వ నిబంధనల పరిధిలో అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed