రోడ్లపై చిన్న పిల్లలు కనిపిస్తే ఆశీర్వదిస్తాం కిడ్నాప్ చెయ్యం

by Naresh |
రోడ్లపై చిన్న పిల్లలు కనిపిస్తే ఆశీర్వదిస్తాం కిడ్నాప్ చెయ్యం
X

దిశ, నిజామాబాద్ సిటీ: రోడ్డుపై చిన్న పిల్లలు కనిపిస్తే ఆశీర్వదించి వెళతాం.. పిల్లలను ఎత్తుకుపోతున్న వారమని సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లలో వాస్తవం లేదని ట్రాన్స్ జెండర్స్ రక్ష, జరీనా, శ్యామల అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఆర్మూర్, రుద్రూర్‌లలో సోషల్ మీడియాలో మాపై కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. మాపై సమాజంలో ఇప్పటికే చిన్నచూపు ఉందని, ఇలాంటి పుకార్లు వదంతులు చేయడం వలన ప్రజలు మమ్మల్ని అసహ్యించుకునే అవకాశం పెరుగుతుందని దయచేసి మా పై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు.

ఇప్పటికీ మేము సమాజంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఎవ్వరూ ఉద్యోగాలు ఇవ్వక పోవడంతో భిక్షాటన చేస్తూ జీవనం గడుపుతున్నామని ఇలా పుకార్లు చేయడం వల్ల మా బ్రతుకు అగమ్యగోచరంగా మారనుందని అన్నారు. మేము రోడ్డు పై చిన్న పిల్లలు కనిపిస్తే ఆశీర్వదించి వెళతామని, షాపింగ్ మాల్స్, దుకాణాల ఓపెనింగ్‌లలో వారు ఇచ్చింది తీసుకొని వారు చల్లగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థించి, అందరి మేలు మాత్రమే కోరుకుంటామని తెలిపారు. అడుక్కుని తిని బ్రతికే మాపై కావాలని కొందరు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మా అందరికీ ట్రాన్స్ జెండర్‌గా గుర్తింపు కార్డులు ఉన్నాయని అన్నారు. ట్రాన్స్ జెండర్స్ కాని వారు ఎవరైనా మా చుట్టుపక్కల కనిపిస్తే మేమే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వారిని అప్పగిస్తామని అన్నారు. నిజామాబాద్ జిల్లా ప్రజలు అర్థం చేసుకొని అందరితో పాటు మేము బ్రతికేలా అవకాశం కల్పించాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో హారతి, గంగా, ప్రియా, ప్రజ్ఞా, అలకనంద తదితర ట్రాంజెండర్లు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed