ఆదివారం రోగమొస్తే అంతే సంగతి..

by Sumithra |
ఆదివారం రోగమొస్తే అంతే సంగతి..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఆదివారం వస్తే చాలు.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రముఖ స్పెషలిస్ట్ వైద్యులు అందుబాటులో ఉండని పరిస్థితి నెలకొంది. చాలా మంది వైద్యులు ఆదివారం వచ్చిందంటే చాలు హైదరాబాద్ కు వెళ్లిపోతున్నారు. తిరిగి సోమవారం వరకు రావట్లేదని, ఈ లోపు ఇన్‍ పేషంట్లకు ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితులేర్పడితే ప్రాణాలమీదకొచ్చే ప్రమాదాలున్నాయని రోగులు భయపడుతున్నారు. ఇప్పటికే ఇలాంటి పరిస్థితుల్లో పలువురు ప్రాణాలు కూడా కోల్పోయిన దాఖలాలున్నాయి. డాక్టర్ల నిర్లక్ష్యంతో రోగులు ప్రాణాలు కోల్పోయిన సందర్భాల్లో హాస్పిటల్ వద్ద రోగుల బంధువులు ధర్నాలకు దిగి గొడవలు సృష్టించిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఇలాంటి కేసుల్లో రోగుల బంధువులతో ఆర్థిక ఒప్పందాలు చేసుకుని బయటపడుతున్నారు తప్ప ఆదివారం వస్తే హైదరాబాద్ కు వెళ్లే అలవాటును మాత్రం మార్చుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.

ల్యాబోరేటరీల్లో కూడా రోగనిర్ధారణ పరీక్షలకు అధిక ధరలు..

ఆదివారాల్లో ఎమర్జెన్సీలో రోగనిర్ధారణ పరీక్షలు అవసరమై ల్యాబోరేటరీల్లోకి వెళితే సాధారణ రోజుల్లో కన్నా అధికంగా చార్జి చేస్తున్నారు. ప్రశ్నిస్తే ఆదివారాలింతేనని దర్జాగా సమాధానాలు చెపుతున్నారు. వీరి పై పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేదని రోగుల బంధువులు అంటున్నారు. అధికారుల సహకారంతోనే వీరు రెచ్చిపోతున్నారని ఆరోపిస్తున్నారు. ల్యాబోరేటరీల్లో ధరల నియంత్రణ పై ఎవరి అజమాయిషీ లేకపోవడంలో రోగులను అడ్డగోలుగా దోచుకుంటున్నారని పలువురు గతంలో వైద్యారోగ్యశాఖకు ఫిర్యాదులు చేసినా పరిస్థితిలో మార్పు రాలేదు. ఆదివారం అనారోగ్యం వస్తే డాక్టర్లు అందుబాటులో ఉండరు. రోగ నిర్ధారణ పరీక్షలు చేయించాలంటే అదనపు రుసుం చెల్లించాల్సిందేనని రోగులు వాపోతున్నారు.

నిర్లక్ష్యం నీడలో వైద్యారోగ్యశాఖ..

వైద్యం గాడి తప్పినా, వైద్యులు గాడి తప్పినా ఆ వ్యవస్థను, వ్యవస్థలోని వ్యక్తులను సరైన ట్రాక్ లో నడిచేలా నియంత్రించాల్సింది వైద్యారోగ్యశాఖ. కానీ, ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే వైద్యారోగ్య శాఖ నిర్లక్ష్యం నీడలో పడకేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యైద్యుల అక్రమాలను, వారి నిర్లక్ష్యాన్ని, వైద్య వ్యవస్థలోని లోపాలను అరికట్టాల్సిన వైద్యారోగ్యశాఖ తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా ధనార్జనే ధ్యేయంగా నకిలీ డాక్టర్లు, నకిలీ ల్యాబ్ టెక్నీషియన్లు, పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. సరైన వైద్య పరిజ్ఞానం లేకపోయినా దర్జాగా హాస్పిటళ్లు ప్రారంభించుకుని మెడికల్ ప్రాక్టీస్ లు నడుపుతున్నారు. ఫలితంగా రోగుల ప్రాణాలు గాల్లో దీపాలుగా ఆరిపోతున్నాయి. దీన్ని నివారించి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన గురుతర బాధ్యత ఉన్న వైద్యారోగ్య శాఖ ముడుపుల మత్తులో ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి తన బాధ్యతను విస్మరిస్తోందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

వైద్య రంగంలో శంకర్ దాదా ఎంబీబీఎస్ లు ?

వైద్య రంగంలో అక్రమార్కులు, నకిలీల పై వైద్యారోగ్యశాఖ ఫోకస్ పెట్టడం లేదు. దీంతో ప్రైవేట్ హాస్పిటళ్లలో నకిలీ డాక్టర్లు పుట్టుకొస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైద్య రంగంలో అనుభవం తప్ప అర్హతల్లేని, అర్హత ప్రమాణాలు పాటించని కొందరు శంకర్ దాదా ఎంబీబీఎస్ లు వైద్యసేవలందిస్తున్నారని, నాణ్యత లేని మందులను రోగులకిస్తూ ప్రాణాలు తోడేస్తున్నారు. నిజామాబాద్ లో ఒక ప్రముఖ హాస్పిటల్ లో గతంలో ఓ సీనియర్ కాంపౌండర్ డాక్టర్ అవతారమెత్తి పేషంట్లను పరీక్షించి ప్రిస్ర్కిప్షన్ రాసిన విషయం అప్పట్లో దుమారం రేపింది. దీని పై మీడియాలో కూడా కథనాలు ప్రచురితమయ్యాయి. మీడియాలో కూడా ప్రత్యేక కథనాలు ప్రసారమయ్యాయి. కానీ, సదరు హాస్పిటల్ పైనా, డాక్టర్ అవతారమెత్తిన కాంపౌండర్ మీద కానీ చర్యలేమీ తీసుకోకపోవడంతో నకిలీ వైద్యుల్లో, హాస్పిటల్ మేనేజ్మెంట్ లో కూడా భయం లేకుండా పోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైద్యం వికటించి రోగులు చనిపోయిన సందర్బాల్లో పేషంట్ తరఫు బంధువులు గొడవలు చేస్తే వైద్యులకు చట్టపరంగా ఉన్న రక్షణను అడ్డం పెట్టుకుని తప్పించుకుంటున్నారు.

కొన్ని సందర్భాల్లో పేషంట్‌ల బంధువులతో ఆర్థిక పరమైన ఒప్పందం చేసుకుని కేసులు కాకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూస్తున్నా ఫిర్యాదులొస్తే తప్ప పట్టించుకోవడం అవసరం లేదన్నట్లుగా అధికారులు వ్యవహరిస్తుండటంతో అక్రమార్కులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా నడుస్తోంది. వైద్యచికిత్సలో ప్రధానమైంది రోగనిర్ధారణ పరీక్షలు. ఈ పరీక్షలు నిర్వహించే ల్యాబ్ టెక్నీషియన్లలో సగానికి పైగా సంబంధిత విభాగంలో అనుభవం తప్ప అర్హత లేని వారే పరీక్షలు నిర్వహిస్తున్నారని, వారు ఇచ్చిన రిపోర్టునే రిజిష్టర్డ్ ల్యాబ్ టెక్నీషియన్స్ పేరుతో రిపోర్టులు తయారు చేసి ఇస్తున్నారనేది బహిరంగ రహస్యం. దీని పై వైద్యారోగ్య శాఖ ఏనాడూ సీరియస్ ఫోకస్ పెట్టిన దాఖలాలు లేవు. ఇలాంటి నకిలీలు, సర్టిఫికెట్ లేకుండానే వైద్య రంగంలో డాక్టర్లుగా, టెక్నీషియన్లుగా చలామణి అవుతూ అడ్డగోలుగా సంపాదిస్తున్నారు.

నిజామాబాద్ లోని ఓ స్కానింగ్ సెంటర్లో బూతు భాగోతం..

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ స్కానింగ్ సెంటర్లో అభ్యంతరకర రీతిలో మహిళల వీడియోలు తీసిన కేసు విషయం తెలిసిందే. స్కానింగ్ కోసం వెళ్లిన మహిళల వీడియోలను వారికి తెలియకుండా రికార్డు చేసిన విషయం బయటకు రాగా పెద్ద దుమారం రేగింది. మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తే తప్ప వైద్యారోగ్య శాఖ స్పందించలేదు. అప్పట్లో స్కానింగ్ సెంటర్ బూతు భాగోతం పై సమాజంలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

Next Story

Most Viewed